రీ డిజైనింగ్ పేరుతో దోపిడీ
-
ప్రాణహితను పక్కన పెట్టేందుకు కుట్ర
-
డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి
-
నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్
వరంగల్ : మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఒప్పందాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరనన కార్యక్రమాలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం డీసీసీ భవన్ చౌరస్తాలో నాయకులు నల్లగుడ్డలు ధరించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో పోలీసులు నేతలను అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. రీ డిజైనింగ్ పేరుతో దోచుకునేందుకు తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్లకే పరిమితం చేసి, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంటుందోన్నారు. గత వంద ఏళ్ల గరిష్ట ప్రవాహాన్ని అంచనా వేసి ఆమేరకు ముంపు ఉంటుందని నిర్ణయించి 152 మీటర్ల ఎత్తు నిర్మాణం చేయాలని అనేది సాంకేతికంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ ఎత్తులో నిర్మాణం చేస్తే మహారాష్ట్రలో 1800 ఎకరాల ముంపు ఉంటుందని, అందువల్ల డిజైన్ మార్చుతున్నామని కేసీఆర్ ప్రకటించారని అన్నారు.
మేడిగడ్డ వద్ద నిర్మించే ప్రాజెక్టు వల్ల మూడువేల ఎకరాలు ముంపు ఉందని, దాన్ని ఎలా మహారాష్ట్రతో ఒప్పిస్తారని అంటే కేసీఆర్ వద్ద సమాధానం లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ నేతలు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బండి సుధాకర్, కార్పొరేటర్లు తొట్ల రాజు, సారంగపాణి, భాస్కర్, నసీం, వెంకటేశ్వర్లు, శేఖర్, రమణారెడ్డి, అశోక్, శ్రీనివాస్, నవీన్‌నాయక్, పోశాల పద్మ, శోభారాణి, సాగరికరెడ్డి పాల్గొన్నారు.