agreement with maharashtra
-
రీ డిజైనింగ్ పేరుతో దోపిడీ
ప్రాణహితను పక్కన పెట్టేందుకు కుట్ర డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ వరంగల్ : మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం వల్ల తెలంగాణకు తీరని ద్రోహం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఒప్పందాన్ని నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరనన కార్యక్రమాలు చేపట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం డీసీసీ భవన్ చౌరస్తాలో నాయకులు నల్లగుడ్డలు ధరించి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో పోలీసులు నేతలను అరెస్టు చేసి హన్మకొండ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద నిర్మించ తలపెట్టిన ప్రాణహిత ప్రాజెక్టును పక్కన పెట్టేందుకు కుట్ర జరుగుతోందన్నారు. రీ డిజైనింగ్ పేరుతో దోచుకునేందుకు తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని 148 మీటర్లకే పరిమితం చేసి, మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ఒప్పందాలు చేసుకుంటుందోన్నారు. గత వంద ఏళ్ల గరిష్ట ప్రవాహాన్ని అంచనా వేసి ఆమేరకు ముంపు ఉంటుందని నిర్ణయించి 152 మీటర్ల ఎత్తు నిర్మాణం చేయాలని అనేది సాంకేతికంగా తీసుకున్న నిర్ణయమన్నారు. ఈ ఎత్తులో నిర్మాణం చేస్తే మహారాష్ట్రలో 1800 ఎకరాల ముంపు ఉంటుందని, అందువల్ల డిజైన్ మార్చుతున్నామని కేసీఆర్ ప్రకటించారని అన్నారు. మేడిగడ్డ వద్ద నిర్మించే ప్రాజెక్టు వల్ల మూడువేల ఎకరాలు ముంపు ఉందని, దాన్ని ఎలా మహారాష్ట్రతో ఒప్పిస్తారని అంటే కేసీఆర్ వద్ద సమాధానం లేదన్నారు. ప్రాణహిత ప్రాజెక్టును తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, కొండేటి శ్రీధర్, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, పీసీసీ నేతలు నమిండ్ల శ్రీనివాస్, ఈవీ.శ్రీనివాసరావు, బండి సుధాకర్, కార్పొరేటర్లు తొట్ల రాజు, సారంగపాణి, భాస్కర్, నసీం, వెంకటేశ్వర్లు, శేఖర్, రమణారెడ్డి, అశోక్, శ్రీనివాస్, నవీన్‌నాయక్, పోశాల పద్మ, శోభారాణి, సాగరికరెడ్డి పాల్గొన్నారు. -
మహారాష్ట్రతో ఒప్పందం చారిత్రకం
తెలంగాణ బీడు భూములకు వరం ఉమ్మడి రాష్ట్రంలో నష్టపోయాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ ప్రాజెక్టుల పేరుతో నిస్సిగ్గుగా దోచుకున్నారు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాలతో బీళ్లుగా మారిన తెలంగాణ భూములకు నీళ్లు పారించే చారిత్రక ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. గోదావరి జలాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ల మధ్య జరిగిన ఒప్పందంతో తెలంగాణ ప్రాంతం సస్యశ్యాలమవుతుందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా అంతరాష్ట్ర వివాదాల అడ్డంకుల కారణంగా ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ ఒప్పందం కుదిరిందన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మంగళవారం హన్మకొండలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గోదావరి జలాలు 1400 టీఎంసీలు, ఇందులో తెలంగాణకు 950 టీఎంసీలు రావాలన్నారు. కృష్ణానదిలో ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు వస్తే ఇందులో తెలంగాణ 300 టీఎంసీల నీరు వాటా ప్రకారం రావాలన్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో బచావత్ అవార్డు నీటి కేటాయింపులు చేసినా వాడుకోలేని దుస్థితి నాటి పాలకులదని విమర్శించారు. 1975, 2012లో మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకున్నామని కాంగ్రెస్ వారు చెపుతున్నారని... ఒప్పందాలు చేసుకుంటే ప్రాజెక్టులు ఎందుకు నిర్మించలేదని కడియం ప్రశ్నించారు. 2015లో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చౌహాన్ తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించ వద్దని ఎందుకు లేఖ రాశారని ప్రశ్నించారు. తమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్లతో నిర్మిస్తే ఇబ్బందులు తప్పవని, నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి 148 మీటర్ల వరకు నిర్మించాలని మహారాష్ట్ర సీఎం చౌహాన్ సూచించారని పేర్కొన్నారు. 152 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే 160 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని, 148కి తగ్గిస్తే 40 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకోవాల్సి వస్తుందన్నారు. ఈ క్రమంలో మిగతా నీటిని వినియోగించుకోవడానికి ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. మేడిగడ్డ వద్ద 180 టీఎంసీల నీటి లభ్యత ఉందన్నారు. ఇక్కడ ప్రాజెక్టు నిర్మించడం ద్వారా తమ్మిడిహట్టి వద్ద కోల్పోయిన 160 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావచ్చని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ రెండు ప్రాజెక్టులతో 36 లక్షల హెక్టార్లకు సాగు నీరు అందుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ.80 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పేటెంట్ అని దుయ్యబట్టారు. నాడు ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ వారు నిస్సిగ్గుగా దోచుకున్నారని విరుచుకుపడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబందించి జీఓ 123ను హైకోర్టు నిలిపివేస్తే స్వీట్లు పంచుకుని రాక్షస ఆనందం పొందారని, దీనిపై అప్పీలుకు వెళితే జీఓ నిలిపివేతను ఎత్తివేస్తే కాంగ్రెస్ నాయకులు బిక్కముఖం వేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన జలయజ్ఞంపై సీబీఐ విచారణ జరుపుతుందన్నారు. వాస్తవాలు బయటపడుతాయన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, ఎంపీ ఆజ్మీర సీతారాం నాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయబాస్కర్, కొండా సురేఖ, ఆరూరి రమేష్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్రావు పాల్గొన్నారు. -
ఈ విజయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించాలి: కేసీఆర్
హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై ఐదు బ్యారేజీలు నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బృందానికి బేగంపేట విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, దీనివల్ల రాష్ట్రాన్ని సాధించినప్పటి సంతోషం మళ్లీ కలుగుతోందని అన్నారు. రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలని, కృష్ణ, గోదావరి నీళ్లు తెలంగాణలోని పంటపొలాలకు మళ్లాలని అన్నారు. తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కలిగిస్తుందని చెప్పారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. తమకు అద్భుత విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు త్వరలో 24 గంటలూ తాగునీరు అందిస్తామని చెప్పారు. 15 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మలిచే వరకు కేసీఆర్ నిద్రపోరని ఆయన పేర్కొన్నారు.