ఈ విజయాన్ని సువర్ణ అక్షరాలతో లిఖించాలి: కేసీఆర్
హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగా నదులపై ఐదు బ్యారేజీలు నిర్మించేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు బృందానికి బేగంపేట విమానాశ్రయం వద్ద ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిందని, దీనివల్ల రాష్ట్రాన్ని సాధించినప్పటి సంతోషం మళ్లీ కలుగుతోందని అన్నారు. రాష్ట్రం ఆకుపచ్చ తెలంగాణ కావాలని, కృష్ణ, గోదావరి నీళ్లు తెలంగాణలోని పంటపొలాలకు మళ్లాలని అన్నారు. తెలంగాణ రైతులు రెండు పంటలు పండించుకునేందుకు ఈ ఒప్పందం వీలు కలిగిస్తుందని చెప్పారు.
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించే ప్రాజెక్టులతో తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందిస్తామని తెలిపారు. తమకు అద్భుత విజయాన్ని అందించిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు త్వరలో 24 గంటలూ తాగునీరు అందిస్తామని చెప్పారు. 15 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మలిచే వరకు కేసీఆర్ నిద్రపోరని ఆయన పేర్కొన్నారు.