
ప్రాక్టికల్స్ చేస్తున్న విద్యార్థులు (ఫైల్)
ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ అంతా మాయగా మారింది. జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు మచ్చుకైనా కనిపించవు. ఉన్న వాటిల్లో పరికరాల బూజు దులపని పరిస్థితి. తరగతులు ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఒక్క ప్రయోగం కూడా నిర్వహించని దుస్థితి ఉంది. సబ్జెక్టుల వారీగా వారానికి రెండు క్లాసులు నిర్వహించాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్క క్లాసు కూడా జరగలేదు. ఓ వైపు విద్యార్థుల్లో ఆందోళన నెలకొనుండగా.. మరోవైపు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ యాజమాన్యాల
అడుగులకు మడుగులొత్తుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నెల్లూరు (టౌన్): జిల్లాలో 174 ప్రభుత్వ, కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ 58, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలు 116 ఉన్నాయి. ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ప్రభుత్వ కళాశాలలు 26, ఎయిడెడ్ కళాశాలలు 11, మోడల్ స్కూళ్లు 7, సోషల్ వెల్ఫేర్ కళాశాలలు 11, ఏపీ రెసిడెన్షియల్ కళాశాల 1, ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలు 2 ఉన్నాయి. ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో జిల్లా వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ, ద్వితీయసంవత్సరానికి సంబంధించి బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఏ కళాశాలలో ప్రాక్టికల్స్ చేపట్టలేదని అధ్యాపకులే చెప్పడం గమనార్హం. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు బ్రాంచీల పేరుతో పెద్ద ఎత్తున కళాశాలలను ఏర్పాటు చేశాయి. బ్రాంచీల్లో ఎక్కడా ప్రయోగశాలలు లేవని తెలుస్తోంది.
నెలకు బైపీసీకి 32, ఎంపీసీకి 16 క్లాసులు
ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ విద్య అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు వారానికి రెండు సార్లు ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. అంటే నాలుగు సబ్జెక్టులకు 8 క్లాసులు ఉంటాయి. ఈ లెక్కన నెలకు బైపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ జువాలజీలకు సంబంధించి 32, ఎంపీసీ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్టీలకు సంబంధించి 16 ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహణ కొంత మెరుగుగా ఉంది. కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఒక్క క్లాసు కూడా తీసుకోలేదు. ద్వితీయ సంవత్సరంలో మొక్కుబడిగా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహిస్తున్నారు. కళాశాలలు ప్రారంభించి 3 నెలలు దాటినా ఒక్క ప్రాక్టికల్ తరగతి నిర్వహించిన పరిస్థితి లేదు. ప్రాక్టికల్స్‌కు ల్యాబ్‌లు, రసాయన పదార్థాలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో వాటి జోళికి వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
మామూళ్ల మత్తులో అధికారులు ..
ప్రాక్టికల్స్‌ను పర్యవేక్షించాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలో పూర్తి స్థాయిలో పరికరాలు, రసాయనాలు లేవు. ప్రాక్టికల్స్ పరీక్షల సమయంలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.200 ఇంటర్ బోర్డు అధికారులకు అప్పజెప్పి మార్కులు వేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు ఇంటర్ బోర్టు అధికారులు ప్రాక్టికల్స్ నిర్వహణలో నోరు మెదపడం లేదని తెలిసింది. ఇప్పటికైనా ఇంటర్ ప్రాక్టికల్స్‌పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని తల్లి,దండ్రులు కోరుతున్నారు.
కళాశాలలను తనిఖీ చేస్తున్నాం.
కళాశాలల్లో ప్రయోగశాలల నిర్వహణపై ఇప్పటికే కొన్ని కళాశాలలను తనిఖీ చేశాం. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాలి. ప్రధానంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తప్పకుండా ప్రాక్టికల్స్ తరగతులు నిర్వహించాల్సి ఉంది. ఈ తరగతులు నిర్వహణపై విద్యార్థులను అడిగి తెలుసుకుంటాం. ప్రాక్టికల్స్ నిర్వహించని కళాశాలలపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, ఆర్‌ఐఓ
Comments
Please login to add a commentAdd a comment