
సాక్షి, అమరావతి: ల్యాబ్‌లు ఉండవు.. ప్రయోగాలు అసలే కనిపించవు.. చాలామంది విద్యార్థులు కనీసం ప్రాజెక్టు రికార్డులు కూడా రాయరు.. సిబ్బందితోనే ఆ పనీ చేయించేస్తున్నారు.. ఇదీ రాష్ట్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లోని ప్రాక్టికల్స్ పరిస్థితి. పరీక్షల్లో ఆయా సెంటర్ల ఎగ్జామినర్లను మేనేజ్ చేస్తూ తమ పిల్లలకు అత్యధిక మార్కులు వేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను జరిపేందుకు బోర్డు షెడ్యూల్ ప్రకటించినా ఏ కార్పొరేట్ కాలేజీలోనూ ల్యాబ్‌లు లేకపోవడంతో ప్రయోగాల జాడేలేదు. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌పై కనీస పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా ఉండడంలేదు.
ఎంపీసీలో 60.. బైపీసీలో 120 మార్కులకు..
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు తమ పాఠ్యాంశాలతో పాటు ప్రయోగాలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఇందుకు బోర్డు నిబంధనల ప్రకారం వారానికి రెండు పీరియడ్లు కేటాయించాలి. ఎంపీసీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బైపీసీ విద్యార్థులైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలలో ప్రయోగాలు చేయాలి. ఎంపీసీలో 60కి, బైపీసీలో 120 మార్కులకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.
సబ్జెక్టుల వారీగా ఎలాగంటే..
⇒ కెమిస్ట్రీలో 30 మార్కులకుగాను సాల్ట్ అనాలసిస్, వేల్యూమెట్రిక్ అనాలసిస్, ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రయోగాలతో పాటు ప్రాజెక్టు వర్కు, వైవా–వాయిస్, రికార్డులు రాయాలి.
⇒ ఫిజిక్స్‌లో 20 ప్రయోగాలు ఉంటాయి. టాబ్లర్ కాలమ్, వేల్యూస్, కాలిక్యులేషన్, ప్రికాషన్ గ్రాఫ్, వైవా–వాయిస్, రికార్డులు ఉంటాయి.
⇒ ఇక జువాలజీలో ఇంతకుముందు డిసెక్షన్లు (క్రిమికీటకాలను కోయడం) ఉండేవి. ఇప్పుడు మొత్తం రాత పరీక్ష పెడుతున్నారు.
⇒ బోటనీలో సెక్షన్ కటింగ్, క్రోమోటోగ్రఫీ ప్రయోగాలు చేయాలి.
జంబ్లింగ్ విధానం అమలుచేయాలి
కార్పొరేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి ఎగ్జామినర్లను ప్రలోభాలకు గురిచేసి తమ విద్యార్థులకు మార్కులు వేయించుకుంటున్నారు. ఈ పద్ధతి మారాలంటే ప్రైవేటు కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌ను తప్పనిసరిగా చేయించాలి. అలాగే, ఈ పరీక్షలను జంబ్లింగ్ విధానంలోనే జరపాలి. విద్యార్థులతో పాటు ఎగ్జామినర్లకు కూడా జంబ్లింగ్ విధానంలోనే సెంటర్లు కేటాయించాలి.– రవి, ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం
తూతూమంత్రంగా డెమోలు
ప్రభుత్వ కాలేజీల్లో టైమ్ టేబుల్ ప్రకారం ప్రయోగాలు చేయిస్తుండగా.. ప్రైవేటు కాలేజీలలో ఆ ఊసే ఉండడంలేదు. రెండో ఏడాది పరీక్షలకు కొద్దిరోజులు ముందు మాత్రమే తూతూమంత్రంగా తరగతి గదిలోనే డెమోలు చూపిస్తూ బోధిస్తున్నారు. ఇక రికార్డుల విషయానికొస్తే.. విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని వారి పేరిట తమ సంస్థలోని జూనియర్ లెక్చరర్లు, స్టడీ అవర్ టీచర్లతో పాత రికార్డులను చూసి రాయిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment