ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఇంటర్, డిగ్రీ కోర్సులు నిర్వహించే ప్రైవేట్ కాలేజీల్లోనూ రిజర్వేషన్ల ప్రకారమే పేద విద్యార్థులకు సీట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కల్పిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల మాయాజాలానికి ఆన్‌లైన్ అడ్మిషన్ల ద్వారా అడ్డుకట్ట పడనుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్లకు శ్రీకారం చుడుతుండడంతో ప్రైవేట్ విద్యా సంస్థల్లోనూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పక్కాగా అమలు కానుంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలపై ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఇప్పటికే జీవో 34 జారీ చేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లను పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన సీట్లను భర్తీ చేయనున్నారు.
బోర్డు వెబ్‌సైట్‌లో అడ్మిషన్ల వివరాలు..
ఇంటర్ కాలేజీలకు అనుమతులతో సహా ప్రవేశాలను ఆన్‌లైన్‌లోనే నిర్వహించేలా బోర్డు సన్నాహాలు పూర్తిచేసింది. ఆన్‌లైన్ ప్రవేశాల విధి విధానాలను సోమవారం రాత్రి వెబ్‌సైట్లో పొందుపరిచింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలకు ఆన్‌లైన్‌లో ప్రవేశాలు చేపట్టనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. రిజర్వేషన్ల వారీగా సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. స్టూడెంట్ లాగిన్ ద్వారా వివరాలను పూరించి ప్రాధాన్యత క్రమంలో ఐదు కాలేజీలను ఎంపిక చేసుకోవాలి. సీటు లభించిన కాలేజీ వివరాలను సూచిస్తూ వెబ్‌సైట్‌లోనే అలాట్‌మెంట్ లెటర్ వస్తుంది. నిర్ణీత ఫీజు చెల్లించి కాలేజీలో చేరవచ్చు.
ఇక సెక‌్షన్‌కు 40 మంది మాత్రమే..
ఇన్నాళ్లూ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను పట్టించుకోకుండా ప్రైవేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రవేశాలు నిర్వహిస్తూ విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. సీబీఎస్‌ఈ నిబంధనల ప్రకారం ఇక సెక‌్షన్‌కు 40 మందిని మాత్రమే చేర్చుకోవాలి.
పక్కాగా రిజర్వేషన్లు..
తాజా నిబంధనల ప్రకారం ఆయా కాలేజీల్లోని మొత్తం సీట్లలో ఎస్సీ విద్యార్థులకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం సీట్లు కేటాయించాలి. వెనుకబడిన తరగతులకు 29 శాతం సీట్లు కేటాయించాల్సి ఉండగా అందులో బీసీ ‘ఏ’ 7 శాతం, బీసీ ‘బీ’ 10 శాతం, బీసీ ‘సీ’ 1 శాతం, బీసీ ‘డి’ 7 శాతం, బీసీ ‘ఈ’ విద్యార్థులకు 4 శాతం చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు 3 శాతం, ఎన్‌సీసీ, స్పోర్ట్స్ కోటా కింద 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయించాలి. అంతేకాకుండా ఆయా కేటగిరీల్లోని సీట్లలో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయించాలి. ఇంటర్ బోర్డు ఆన్‌లైన్‌లో ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో నిబంధనల ప్రకారం ఆయా వర్గాల విద్యార్థులకు సీట్లు దక్కనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment