వసూలు చేసిన ఫీజు తల్లులకు వెనక్కివ్వండి | CM YS Jagan Mohan Reddy letter to private colleges | Sakshi
Sakshi News home page

వసూలు చేసిన ఫీజు తల్లులకు వెనక్కివ్వండి

Published Thu, May 7 2020 3:48 AM | Last Updated on Thu, May 7 2020 8:30 AM

CM YS Jagan Mohan Reddy letter to private colleges - Sakshi

సాక్షి, అమరావతి: పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వమే చెల్లించినందున తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని తిరిగి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కాలేజీ యాజమాన్యాలకు సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆయా కళాశాలలకు లేఖ రాశారు. కోవిడ్‌–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, పేద వర్గాల విద్యార్థుల మంచి చదువుల కోసం నవరత్న హామీల్లో భాగంగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నామన్నారు. సీఎం లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. 

ప్రియమైన మిత్రులారా..
► నేను రాష్ట్ర ప్రభుత్వ అధికార పగ్గాలు చేపట్టిన నాటికి రాష్ట్ర ఖజానా దాదాపు ఖాళీ. అదే సమయంలో వేల కోట్ల రూపాయల బిల్లుల బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి. తాజాగా కోవిడ్‌–19తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్న విషయం మనందరికీ తెలిసిందే. 

► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ‘నవరత్నాల’ హామీల మేరకు మా ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కట్టుబడి ఉంది. 2019–20 విద్యా సంవత్సరం నుంచి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆ సంవత్సరపు విద్యార్థులతో పాటు అంతకు ముందు నుంచి ఉన్న సీనియర్‌ విద్యార్థులకు కూడా అమలు చేస్తోంది. 

► వీరి కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లు చెల్లించాం. గత ప్రభుత్వం విడుదల చేయకుండా వదిలేసిన రూ.1,880 కోట్లు కూడా ఇచ్చాం. ఒక విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల మొత్తం అదే విద్యా సంవత్సరంలో ప్రభుత్వం విడుదల చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.

► ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గత ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కేవలం రూ.35 వేలకు మాత్రమే పరిమితం చేసింది. తక్కిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని కాలేజీలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసుకొనేవి. ఈ ప్రభుత్వం వచ్చాక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాన్ని చెల్లిస్తున్నందున ఆయా తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన ట్యూషన్‌ ఫీజు మొత్తాన్ని తల్లుల బ్యాంకు అకౌంట్లలో తిరిగి జమ చేయాలని కాలేజీ యాజమాన్యాలను కోరుతున్నాను.

► ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పడానికి, అందుకనుగుణంగా విద్యా సంస్థలకు సహకారం అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇదే సమయంలో అనైతిక కార్యక్రమాలకు పాల్పడే, నిబంధనలు పాటించని కొన్ని విద్యా సంస్థలను ఉపేక్షించబోము. బోధన, బోధనేతర సిబ్బందిని, విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కొన్ని కాలేజీల గురించి ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

► నిరుపేద వర్గాలకు నాణ్యమైన విద్యను అందించడం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం ప్రధాన లక్ష్యం. 2020–21 విద్యా సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచి విద్యార్థుల బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగా తల్లుల బ్యాంకు అకౌంట్లలోకి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు జమ చేస్తాం.

► ప్రభుత్వం అందించిన ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను తల్లులు కాలేజీలకు వచ్చి చెల్లిస్తారు. దీనివల్ల తల్లులు తమ పిల్లలు చదువుతున్న కాలేజీలను ఏడాదిలో నాలుగుసార్లు సందర్శిస్తారు. పిల్లల చదువుల పురోగతి ఎలా ఉందో పర్యవేక్షించే అవకాశం కలుగుతుంది. 

► కాలేజీల యాజమాన్యాలన్నిటికీ ఒక విన్నపం చేస్తున్నాను. మా ప్రభుత్వం ప్రతి క్వార్టర్‌కు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను విడుదల చేయడానికి కట్టుబడి ఉంది. అందువల్ల (2020–21 విద్యా సంవత్సరం నుంచి) ఇకపై విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని కోరుతున్నాను. నాలెడ్జ్‌ సొసైటీ నెలకొల్పే దిశగా నిబద్ధతతో మనమందరం కలిసి పని చేద్దాం.  
    – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement