భువనేశ్వర్: ఒడిశాలో ఆశావర్కర్‌గా పనిచేస్తున్న స్వర్ణలత పాటి చిన్ననాటి నుంచి కష్టాలను చాలా దగ్గర్నుంచి చూశారు. తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో ఆమెను పెద్దగా చదివించలేదు. ఏడో తరగతి వరకు చదువుకున్న స్వర్ణలతకు చిన్నతనంలోనే పెళ్లి చేశారు. ఆమెకు 27 ఏళ్ల వయసులో భర్తను కోల్పోవడంతో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. తన ఇద్దరు పిల్లలనే ఆమె తన జీవితంగా భావించి వారికోసం కష్టపడుతూ వచ్చింది. ఏదైనా జాబ్ చేయాలని అనుకున్నా ఆమెకు సరైన విద్యార్హత లేకపోవడంతో ఉపాధి దొరకడం కష్టంగా మారింది. చివరికి తన ఊర్లోని స్కూల్‌లో వంద రూపాయలకు కుక్‌గా చేరి తన పిల్లలిద్దరిని పోషించుకుంది.
కాగా 2005లో ఆమె జీవితం మరో మలుపు తీసుకుంది. ఆమె తాను పని చేస్తున్న గ్రామంలోనే ఆశావర్కర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆశావర్కర్‌గా ఆమె చూపిన పనితనానికి, ప్రతిభకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. తనకు వచ్చిన డబ్బుతో ఇద్దరి పిల్లలను ప్రస్తుతం పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిస్తోంది. అయితే 2019లో ఒడిశా ప్రభుత్వం ఆశావర్కర్లుగా పనిచేస్తున్న మహిళలకు టెన్త్ తప్పనిసరిగా ఉండాలని మెలిక పెట్టింది.
టెన్త్ పాస్ అయితేనే అన్ని సౌకర్యాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో స్వర్ణలతా తన ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి పది పరీక్షలు రాయడానికి సిద్ధమైంది. 2019 డిసెంబర్‌లో మెట్రిక్ పరీక్షలు రాసేందుకు ఓపెన్ స్కూల్‌లో అప్లికేషన్ పెట్టుకుంది. కరోనా కారణంగా 2020 మార్చిలో జరగాల్సిన పరీక్షలు సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. కష్టపడి చదివిన స్వర్ణలత సెప్టెంబర్‌లో రాసిన పరీక్షల్లో ఒక్క ఇంగ్లీష్ తప్ప అన్ని సబ్జెక్టులు పాసయ్యింది. ఇంగ్లీష్ కూడా కేవలం నాలుగు మార్కులతో ఫెయిల్ అయింది.
తాను ఫెయిల్ అయ్యానని కుంగిపోకుండా మరోసారి ఇంగ్లీష్ పరీక్ష రాసింది. ఈసారి కూడా ఫలితం ఆమెకు వ్యతిరేకంగానే వచ్చింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో స్వర్ణలతకు ఓడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈసారి ఆమెను దేవుడు కరోనా రూపంలో కరుణించాడు. కరోనా కారణంగా గతేడాదితో పాటు ఈ ఏడాది ఓపెన్‌లో అప్లై చేసుకున్న అందరిని పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకేముంది తాను పాసయినట్లు తెలుసుకున్న స్వర్ణలతా దాన్ని ఒక పెద్ద పండగలా చేసుకుంది. ఇక తన జాబ్ ఎక్కడికి పోదని.. తనకు అన్ని సౌకర్యాలు లభిస్తాయని ఆనందం వ్యక్తం చేసింది.
చదవండి: మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా
Comments
Please login to add a commentAdd a comment