ప్రశాంతంగా పది పరీక్షలు | Tenth Public Examinations Began On Monday In AP State Ended Peacefully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పది పరీక్షలు

Published Tue, Apr 4 2023 9:37 AM | Last Updated on Tue, Apr 4 2023 11:29 AM

Tenth Public Examinations Began On Monday In AP State Ended Peacefully - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విద్యార్థులు పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పరీక్ష రాయవలసిన అభ్యర్థులు 6,17,971 మంది కాగా 6,11,832 మంది (99.01 శాతం) హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈసారి 26 జిల్లాలను ప్రాతిపదికగా తీసు­కుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హడావుడి నెలకొంది.

విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేయడం, వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది సకాలంలోనే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్నిచర్‌తోపాటు మంచినీరు అందుబాటులో ఉంచారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టు­కుని ప్రభుత్వం ఈసారి అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా విస్తృతమైన ప్రచారం కల్పించింది.

అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రక­టించి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్లతో సహా ఎవరి ఫోన్లను అనుమతించలేదు. విద్యార్థులకు కూడా ఫోన్లు, డిజిటల్‌ వాచీలు, ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్‌ వంటి డిజిటల్‌ పరికరాలను పూర్తిగా నిషేధించింది. ప్రతి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీసు స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్‌ స్క్వాడ్లు, సిట్టింగ్‌ స్క్వాడ్ల సంఖ్యను పెంచింది. లీక్‌లు, ఫేక్‌ ప్రచారాలు చేయకుండా ఈ చర్యలు అడ్డుకట్ట వేశాయి. ఎవరైనా ఎక్కడైనా లీక్‌ లేదా ఫేక్‌ ప్రశ్నపత్రాల ప్రచారం చేసినా వెంటనే పసిగట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సిద్ధం చేసింది. ప్రతి ప్రశ్నపత్రం మీద క్యూఆర్‌ కోడ్‌తో కూడిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు కూడా ఎక్కడా నమోదు కాలేదు.

డిజిటల్‌గా పరీక్ష రాసిన దివ్యాంగ విద్యార్థులు
అనంతపురం జిల్లాలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డీటీ) ఇన్‌క్లూజివ్‌ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ (దృష్టిలోపం ఉన్న) విద్యార్థినులు డిజిటల్‌గా పరీక్ష రాశారు. ఈ పాఠశాలకు చెందిన ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చందుగారి పావని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. వీరు డిజిటల్‌ విధానంలో కంప్యూటర్‌ ద్వారా స్క్రయిబ్‌ సహాయం లేకుండా పరీక్ష రాశారు.

(చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్‌ అమ్మకం ధరలు తగ్గింపు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement