గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థుల నామినల్స్ రోల్స్ ఆన్‌లైన్‌లో పంపుతున్న ఉపాధ్యాయులు
గుంటూరు ఎడ్యుకేషన్: వచ్చే ఏడాది మార్చి 18 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థుల ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ స్వీకరణ ప్రక్రియలను ప్రభుత్వ పరీక్షల విభాగం తొలిసారిగా ఆన్‌లైన్ పద్ధతిలోకి తీసుకువచ్చింది. దీంతో పాటు విద్యార్థులకు హాల్‌టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో జారీకి ఏర్పాట్లు చేస్తోంది. పాఠశాలల యాజమాన్యాలకు దీనిపై అవగాహన కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశముంది. ప్రస్తుతం పాఠశాలల్లో ఎస్‌ఏ–1 పరీక్షల హడావుడి నెలకొంది. దీంతోపాటు నామినల్ రోల్స్ సమర్పించేందుకు తుది గడువు ముంచుకొస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల వివరాల నమోదు, నామినల్ రోల్స్ అప్‌లోడింగ్ పనులు జరుగుతున్నాయి. మార్చి 18 నుంచి జరిగే టెన్త్ పరీక్షలకు జిల్లాలో 60 వేల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు.
ఆన్‌లైన్ అనుసంధానంతో కొత్త ఒరవడి
ప్రస్తుత ఏడాది నుంచి పరీక్ష ఫీజుల చెల్లింపు, నామినల్ రోల్స్ సమర్పించే విధానాన్ని పూర్తిగా ఆన్‌లైన్‌లోకి మార్పు చేశారు. అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ సంఖ్య ఆధారంగా చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేసిన వివరాలను ఆధారంగా చేసుకుని పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసింది. ఆయా వివరాలను ప్రభుత్వ పరీక్షల విభాగం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చగా, టెన్త్ విద్యార్థుల వివరాలను సైతం ఇదే వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది. దీనిపై ఈనెల 24న గుంటూరులో జరిగిన సదస్సులో ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఆన్‌లైన్‌లో పక్కాగా వివరాలు నమోదు
ఆన్‌లైన్ విధానంలో విద్యార్థికి సంబంధించిన సమగ్ర వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పటిష్టమైన చర్యలు చేపట్టింది. పాఠశాలలకు ఇచ్చిన యూడైజ్ కోడ్, ఎస్సెస్సీ కోడ్ ఆధారంగా ఒక్కో విద్యార్థికి ప్రత్యేక అప్లికేషన్ ఫారం ఆన్‌లైన్లో పొందుపర్చారు. ఇందులో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సామాజిక వర్గం, నివాస, పుట్టిన తేదీ, పరీక్ష లాంగ్వేజ్ తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంది. విద్యార్థులకు అవే వివరాలతో హాల్ టికెట్లు జారీ చేస్తారు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు. ఇప్పటివరకూ ఫీజు చెల్లించని విద్యార్థులు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించేందుకు ఈ నెలాఖరు వరకూ అవకాశముంది. హెచ్‌ఎంలు సీఎఫ్‌ఎంఎస్ విధానం ద్వారా ఫీజు జమ చేసేందుకు తుది గడువు డిసెంబర్ ఒకటి. నామినల్ రోల్స్‌ను డీఈవో కార్యాలయంలో సమర్పించేందుకు తుది గడువు డిసెంబర్ 3. రూ.50 అపరాధ రుసంతో డిసెంబర్ 15, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబర్ 24, రూ.500 అపరాధ రుసుంతో కలిపి పరీక్ష ఫీజు చెల్లించేందుకు జనవరి 3 వరకూ అవకాశముంది. జిల్లాలోని పలు ప్రభుత్వ, జెడ్పీ హైస్కూళ్లలో ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం, ఉన్నా ఫొటోలు, సంతకాన్ని స్కాన్ చేసేందుకు స్కానర్లు లేక హెచ్‌ఎంలు ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు.
సందేహాల నివృత్తికి వాట్సాప్ గ్రూపు
నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో పంపే విధానంపై హెచ్‌ఎంలకు ఇప్పటికే అవగాహన కల్పించాం. ఇందుకోసం డీవైఈవోల ద్వారా హెచ్‌ఎంలను అనుసంధానం చేస్తూ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. హెచ్‌ఎంలకు ఏమైనా సందేహాలుంటే దాని ద్వారా నివృత్తి చేస్తున్నాం.–ఆర్‌ఎస్ గంగా భవానీ, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment