‘ప్రయోగం’.. ప్రశ్నార్థకం | 'Experiment' .. Questionable | Sakshi
Sakshi News home page

‘ప్రయోగం’.. ప్రశ్నార్థకం

Published Wed, Jan 22 2014 3:34 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

'Experiment' .. Questionable

టెన్త్ పరీక్షల షెడ్యూల్ రెడీ. విద్యాసంవత్సరం ఇంచుమించుగా చివరి దశలో ఉంది. కొన్ని నెలల్లో విద్యార్థులు తరగతులు మారిపోతారు. మారందల్లా ఒక్కటే...జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రయోగశాలల తీరు. స్కూళ్లకు మంజూరైన పరికరాలు హాయిగా బీరువాల్లో రెస్ట్ తీసుకుంటున్నాయి. టీచర్లు పాఠాలు పూర్తిచేసినా...ప్రాక్టికల్స్ వద్దకు వచ్చే సరికి ఎప్పటిలా అలవాటైన రీతిలో మమ అనిపించేస్తున్నారు. సైన్స్ అంశాలపై ప్రయోగానుభవం లేకుండానే స్టూడెంట్లు తరగతులు దాటేస్తున్నారు.
  ఇదీ లేబ్‌లున్నా ప్రాక్టికల్స్ లేని పాఠాల తీరు.
 
 జిల్లాలో 600కు పైగా ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పరిజ్ఞానం లేకుండానే ఉన్నత చదువులకు వెళ్తున్నారు. పాఠ్యాంశంలో ఫలానా అంశంపై విద్యార్థులకు ప్రయోగం ద్వారా వివరించాలని స్పష్టంగా పేర్కొన్నా...90 శాతం స్కూళ్లలో  ఆ పరిస్థితి కరువైంది.
 
  6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా ప్రయోగశాలల ద్వారా సైన్స్ సబ్జెక్టుపై అవగాహన పెంపొందించాల్సి ఉంది. ప్రధానంగా 8,9,10వ తరగతి విద్యార్థులకు వారానికి నాలుగు వం తున జీవ, రసాయన శాస్త్రాల్లో ప్రయోగ శిక్షణ తరగతులు నిర్వహించాలి.
  ఆర్‌ఎంఎస్‌ఏ కింద 152 పాఠశాలల్లో ప్రయోగశాలల ఏర్పాటుకు 150 గదులు నిర్మించగా.. వీటిని తరగతి గదులుగా  మార్చి ప్రయోగపరికరాలను  బీరువాలకే పరిమితం చేశారు.  
 
 గతంలో ప్రభుత్వం అయిల్‌చార్ట్‌లను పంపేది, ప్రస్తుతం బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకుంటుండటంతో ఉపాధ్యాయులు స్థానికంగా దొరికే నాణ్యతలేని చార్ట్‌లతో సరిపెడుతున్నారు.
  గాలిలో ధ్వని వేగం కనుక్కోవడం, ఎలక్ట్రికల్, మోటర్స్‌కు సంబంధించిన కొన్నింటిపై మాత్రమే అవగాహన క ల్పిస్తున్నారు. హీట్, మెల్ట్ చేయాలంటే గ్యాస్ తప్పనిసరి, కానీ ఆ సిస్టమ్‌ను హైస్కూల్‌లో ఏర్పాటు కాక రసాయనాల ద్వారా రంగుల మార్పుతో పాటు ఇతర ప్రయోగాలేవీ విద్యార్థులకు తె లుసుకునే వీలు లేకపోతోంది.
 
  మైక్రోస్కోప్‌లు, స్ప్రింగ్‌త్రాసులు వంటివి పని చేయడంలేదు.  భౌతిక, రసాయనిక, జీవ శాస్త్రాల్లో మారిన పాఠ్యాంశాల మేరకు కొత్త ప్రయోగ పరికరాలు లేకపోవడంతో పాత పాఠ్యాంశాల్లోని పరికరాలతోనే ప్రయోగ విద్యను  తూతూమంత్రంగా బోధిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని చాలా పాఠశాలలను పరిశీలించగా చాలా వరకు ప్రయోగాలు నిర్వహించనట్లుగా విద్యార్థుల ద్వారా తెలిసింది.
 
 ఒక్కసారి కూడా నిర్వహించలేదు..
 రసాయనశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు ఒక్కసారి కూడా చేయించలేదు. కేవలం బౌతికశాస్త్రానికి సంబంధించిన పరికరాలు చూపించారు. దీనితో మాకు సబ్జెక్టు అర్థం కావడం లేదు. ఇప్పటికైన ప్రయోగాలు చేయించాలి.
 - వసంత,10వతరగతి పోలీసులైన్ ఉన్నత పాఠశాల
 
 ప్రత్యేక గది లేదు...
 ప్రయోగాలకు ప్రత్యేక గది లేదు. లాబ్ పరికరాలు ఉన్నచోటే మాకు తరగతులు బోధిస్తారు ఇప్పటి వరకు రసాయన, జీవశాస్త్రానికి సంబంధించిన ప్రయోగాలు చేయించలేదు. అప్పుడప్పుడు చార్ట్‌ల ద్వారా మాత్రమే బోధిస్తున్నారు.
 - విష్ణువర్ధన్, 10వ తరగతి షాషాబ్‌గుట్ట
 
 ఉన్నత పాఠశాల.
 ప్రయోగాలు లేవు..
 పాఠశాలలో ఎన్నో సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన రసాయనాలే ఉన్నట్లుగా ఉపాధ్యాయులు చెబుతున్నారు. రసాయన శాస్త్ర ప్రయోగాలపై మాకు ఎలాంటి అవగాహన రాలేదు.
 - శిరీష, షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాల
 
 ఆ ఊసేలేదు..
 పాఠశాలలో ప్రయోగాల ఊసే లేదు. కేవలం చార్టుల ద్వారా మాత్రమే అప్పుడప్పుడు బోధిస్తున్నారు. ప్రయోగాలు రెగ్యులర్‌గా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. భౌతిక, రసాయన, జీవశాస్త్రాలకు సంబంధించిన ప్రయోగాలు చేయించడం లేదు.
 - రమాదేవి, పోలీసులైన్ ఉన్నత పాఠశాల
 
 ప్రయోగాలు నిర్వహించని వారిపై చర్యలు తీసుకోవాలి..
 విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. స్కూల్ గ్రాంట్స్‌ను సద్వినియోగం చేసుకోవడం లేదు. చాలా వరకు ప్రధానోపాధ్యాయులు జేబుల్లోకే వెళ్తున్నాయి. ప్రయోగ పరికరాలు దుమ్ముపట్టి పోతున్నాయి. ప్రయోగాలపై అవగాహన కల్పించక పోవడం వల్ల విద్యార్థులు ఇంటర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైన అధికారులు పాఠశాలల్లో ప్రయోగాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
 - నరేష్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి
 
 ప్రత్యేక నిధులు అవసరం..
 విద్యార్థులకు ప్రయోగాలు నిర్వహించేందుకు, రసాయానాల, పరికరాల కొనుగోలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. ప్రయోగాత్మకంగా బో దన చేయడం ద్వారా ఎక్కువగా గుర్తుంటుంది. సిసిఈ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ప్రయోగాలు నిర్వహించక పోవడం భాధాకరం, చాలా పాఠశాలల్లో తేది అయిపోయిన రసాయానాలు ఉన్నాయి. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలి. లేదా స్కూల్ గ్రాంట్స్‌ను వినియోగించుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
 - రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
 
 ప్రతీ ఉపాధ్యాయుడు
 ప్రయోగాలు నిర్వహించాలి..
 ప్రతి సైన్స్ ఉపాధ్యాయుడు ప్రయోగాలు విద్యార్థులకు చేసి చూపించాలి. చాలా తక్కువ ఖర్చుతో, అసలు ఖర్చు లేకుండా చేసే చిన్న చిన్న ప్రయోగాలను కూడా విద్యార్థులకు బోదించనట్లుగా తెలిసింది. సైన్స్ ఉపాధ్యాయులు ప్రయోగాలపై ప్రత్యేక దృష్టి సారించాలి.
 - చంద్రమోహన్, డీఈఓ, మహబూబ్‌నగర్
 
 జిల్లా కేంద్రంలోని
 స్కూళ్ల పరిస్థితి ఇలా...
  జిల్లా కేంద్రంలోని షాషాబ్‌గుట్ట ఉన్నత పాఠశాలలో ప్రయోగశాల ప్రత్యేకంగా లేక పోవడం వల్ల  టెన్త్ విద్యార్థులు కూర్చునే గదిలోనే ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. పరికరాలు కేవలం బీరువాలకే పరిమితం చేశారు.
 
   పోలీసులైన్ ఉన్నత పాఠశాలలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్కసారికూడా  ప్రయోగాలు చేయించలేదు. కేవలం భౌతిక శాస్త్రానికి సంబంధించిన పరికరాలు మాత్రమే రెండుసార్లు చూపినట్లు తెలిసింది.
 
   షాబజార్ ఉన్నత పాఠశాలలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రయోగశాలకు ప్రత్యేకమైన గది లేదు.  పరికరాలు బీరువాల్లో దాచి తాళాలు వేశారు. ఏడో  తరగతి నిర్వహిస్తున్న గదిలోనే ప్రయోగపరికరాలకు సంబం ధించిన బీరువాలను ఉంచారు. ప్రయోగాలు ఒక్కసారి కూడా నిర్వహించలేదని విద్యార్థులు వెల్లడించారు.
 
   మార్కెట్‌రోడ్ ఉన్నత పాఠశాలలోనూ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇక్కడ విద్యార్థులదీ అదే మాట.
 
  ఏనుగొండ ఉన్నత పాఠశాలలో  సైన్స్‌కు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించేందుకు ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి అప్పుడప్పుడు బోధిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు.

   మాడల్‌బేసిక్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక గది ఉన్నప్పటికి గత సైన్స్ టీచర్లు దాని జోలికి వెళ్లక పోవడం వల్ల దుమ్ముపట్టి పోయింది. ఇటీవల వచ్చిన ఓ సైన్స్ ఉపాధ్యాయుడు గదిని మూడు రోజుల పాటు శుభ్రం చేయించి ప్రయోగాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

 జిల్లా కేంద్రంలోనే పాఠశాలల్లో పరిస్థితి ఈ విధంగా ఉంటే మారుమూల ప్రాంతాలలో ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement