సాక్షి, వరంగల్ రూరల్: ఉద్యోగ రీత్యా కన్నకొడుకు పొరుగు దేశంలో ఉన్నాడు.. ఇక్కడున్న కొడలు పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటేసింది. కాటికి కాలుజాపిన వయసులో గత్యంతరం లేక ఆ కన్నతల్లి కూతురు వద్ద తలదాచుకుంటోంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పరకాల పట్టణంలోని మమత నగర్‌కు చెందిన గుండెమీద రాజయ్య–నర్సమ్మ(76) దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. వారికి వివాహం అయింది. సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొడుకు రవికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను ఉద్యోగ రీత్యా దుబాయిలో ఉంటున్నాడు.
కుమార్తె హసన్‌పర్తిలోని అత్తవారి ఇంట్లో ఉంటోంది. 2014 డిసెంబర్ 20న రాజయ్య మృతి చెందడంతో నర్సమ్మకు కష్టాలు మొదలయ్యాయి. కోడలు మంజుల నర్సమ్మను పట్టించుకోకపోగా.. మమత నగర్‌లో ఉన్న ఇంటిని ఆక్రమించుకుని ఆమెను బయటకు పంపించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో హసన్‌పర్తిలోని కూతురు ఇంట్లో మూడేళ్లుగా తలదాచుకుంటోంది. కన్నకొడుకు పట్టించుకోకపోవడం ఒక వైపు, మరోవైపు వృద్ధాప్యం కారణంగా జీవనం భారంగా మారడంతో నర్సమ్మ 2019 జూన్‌లో పరకాల ఆర్డీఓను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది. ఆమె అభ్యర్థనపై విచారించిన అప్పటి ఆర్డీఓ తల్లి పోషణ బాధ్యతను కొడుకు రవి, కోడలు మంజుల చూసుకోవాలని, పరకాల మమత నగర్‌లోని ఇంటికి చెందిన కిరాయి డబ్బులు నర్సమ్మకు చెందాలని ఈ ఏడాది ఫిబ్రవరి 9న తీర్పు వెల్లడించారు.
నాలుగు నెలలు గడిచినా అమలు కాకపోవడంతో నర్సమ్మ హైకోర్టును ఆశ్రయించగా.. ఆర్డీఓ ఇచ్చిన తీర్పు అమలు చేయాలంటూ కలెక్టర్ హరితను ఆదేశించింది. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చి పది రోజులు దాటినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని బాధితురాలు వాపోయింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని నర్సమ్మ కోరుతోంది. ఈ విషయమై కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో పరకాల ఇన్‌చార్జి, వరంగల్ రూరల్ ఆర్డీఓ మహేందర్‌జీని వివరణ కోరగా.. గుండెమీద నర్సమ్మతో పాటు కోడలు మంజులను మంగళవారం కార్యాలయానికి పిలిపించి మాట్లాడుతానని, హైకోర్టు ఆదేశాల అమలుకు కృషి చేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment