
ప్రతిష్ఠాపనకు నోచుకోని సాహూ విగ్రహం
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): బూర్జువా పాలకులపై తుపాకీ ఎక్కుపెట్టి రాజీలేని పోరుసల్పిన ధీరత్వం...గోండు బిడ్డల ధీనత్వాన్ని ఆర్తిగా కవితల్లో ఆవిష్కరించే భావోద్వేగం... అయన జీవితమనే నాణానికి బొమ్మాబొరుసులు. తూటాలకు ఎదురొడ్డి సాయుధ పోరులో అగ్గిబరాటై కదం తొక్కి, అన్నార్తుల అక్రందనలకు అక్షర రూపమిచ్చిన ఆ శైలి స్ఫూర్తిమంతం. ఏక కాలంలో రచయిత, ఉద్యమకారుడిగా విశేష గుర్తింపు పొందిన సవ్యసాచి మాణిక్యాపూర్ ముద్దు బిడ్డ సాహు శనిగరం వెంకటేశ్వర్లు వర్ధంతి నేడు(శనివారం). వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్‌లో 1955 అక్టోబర్ 2న శనిగరం స్వామి–అయోధ్యలకు వెంకటేశ్వర్లు( సాహూ) జన్మించాడు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన ఆయన ఉన్నత విద్య కోసం హుజురాబాద్‌కు, డిగ్రీ కోసం జమ్మికుంటకు వెళ్లాడు. హుజురాబాద్‌లో చదువుకున్న రోజుల్లో 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాల్గొన్నాడు.
గో టు విలేజ్ క్యాంపస్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే గ్రామాల్లో భూస్వాములు చేస్తున్న ఆగడాలు, పేదలు పడుతున్న కష్టాలు అతనిని విప్లవోద్యమం వైపు అడుగులేసేలా చేశాయి. ఆ క్రమంలోనే ‘గో టు విలేజ్ క్యాంపస్’ పేరిటా మాణిక్యాపూర్‌లో 20 రోజులపాటు దాదాపుగా వందలాది మందికి ఉద్యమ శిక్షణ తరగతులను నిర్వహించాడు సాహూ. మావోయిస్ట్ కీలక నేత గణపతితో పాటు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేష్ లాంటి మావోయిస్ట్ అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు..
- సాహూ, అతని భార్య శోభ
అతని కలం పేరును సాహూగా పెట్టుకున్నాడు. ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషిస్తూ మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి వరకు వెళ్లి అదిలాబాద్ అడువుల్లో అరెస్ట్ అయ్యాడు. అనేక ఏళ్ల పాటు జైలు జీవితం గడిపిన సాహూ జైలు నుంచి విడుదలయ్యాడు. అకస్మాత్తుగా మార్చి 16, 1993న గుండె పోటుతో మృతి చెందాడు
సాహూ రచనలు...
కన్నీటి కథ–నీటి కథ, పెండ్లి కావాలి, ఖాయిదా, ఐదు రూపాయాల కథ, భూమి కోసం, జెండా కథ, ఆకలి నిర్ణయం, కిసింగార్ వెంతా, అమరుల రక్తం వృథా కాదు, రక్తపింజెర, మరట్ తుడుం పాయానా, మనుషుల్ని తినే వాళ్లం కోసం, ఒక తల్లి, పిల్ల రక్కసులు, రగల్ జెండా, విహంగ వీక్షణం, జాగీరిగాల్లు తదితర కథలు, కవితలు రాశాడు.
విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి...
మరుగున పడిన కొమురం భీం జీవిత చరిత్రను బాహ్య ప్రపంచానికి అందిచడంతోపాటుగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన ఆయన ఆశయాలను ప్రభుత్వం నెరవేర్చాల్సిన అవసరంఉంది. ఆయన విగ్రహాన్ని కరీంనగర్‌లోగాని, వరంగల్‌లో గాని ప్రతిష్ఠించాలని ఆయన స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment