ఆరిన కంటి దీపాలు | Five Missed Kids Found Deceased at Munneru Canal | Sakshi
Sakshi News home page

ఆరిన కంటి దీపాలు

Published Wed, Jan 12 2022 5:00 AM | Last Updated on Wed, Jan 12 2022 5:00 AM

Five Missed Kids Found Deceased at Munneru Canal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చందర్లపాడు/సాక్షి, అమరావతి:  మునేరులో సోమవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్‌ (11), కర్ల బాలయేసు (12), జట్టి అజయ్‌ (12), గురజాల అజయ్‌ చరణ్‌  (14) సోమవారం ఉదయం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన విషయం విదితమే. వీరంతా గ్రామంలోని మునేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, యానాదులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది చిన్నారుల జాడ కోసం సోమవారం రాత్రి నుంచే మునేరుతోపాటు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నల్లవాగు వరద మునేరులో కలిసే ప్రదేశంలో ఏర్పడిన గోతిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ బిడ్డలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటారని గంపెడాశతో రాత్రి నుంచి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు. నందిగామ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఏటి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.  

మృతులంతా కూలీ కుటుంబాల వారే 
మృత్యువాతపడిన పిల్లల తల్లిదండ్రులంతా కూలీలే. కాయకష్టం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. మైల దానయ్య, ఆంథోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాకేష్‌ (11) స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కర్ల గురవయ్య, లక్ష్మి దంపతులకు  కుమారుడు బాలయేసు (12)తో పాటు కుమార్తె ఉంది. ఆ బాలుడు స్థానిక పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి గురవయ్య గతంలో మరణించడంతో ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయింది. ఇక జట్టి సుందరరావు, అరుణలకు ఇద్దరు సంతానం కాగా చిన్నవాడైన అజయ్‌ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే గురజాల మరియమ్మ భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. ఆమె కుమారుడు అజయ్‌ చరణ్‌(14)ను అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటున్నారు.

అజయ్‌చరణ్‌ 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, మాగులూరి సుబ్బారావు మేరీ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. మూడవ కుమారుడైన సన్నీ (12) 7వ తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారులంతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వంట కట్టెలు తేవడానికి సైకిళ్లపై వెళ్లి మునేరులో దిగి మృత్యువాత పడ్డారు. ఏటూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ గ్రామానికి ఓ వైపు మునేరు మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. 2016 అగస్టు 16న నందిగామ చైతన్య కళాశాలలో చదువుతున్న తోటరావులపాడు, జయంతి, చెరువు కొమ్ముపాలెం, నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఐదుగురు చిన్నారులు మునేరులో దిగి దుర్మరణం పాలయ్యారు. 

రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా 
మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు కలెక్టర్‌ జె.నివాస్‌ ప్రకటించారు. బుధవారం ఈ సొమ్మును అందజేయనున్నారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్‌మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. 

మంత్రి ఆదిమూలపు సంతాపం 
కాగా, విద్యార్థుల మృతిపై విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సంక్రాతి సెలవులు, కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement