kids missing
-
పాపం పసిపాప ఏమైందో ?
ప్రకాశం: ఐదేళ్లు కూడా నిండని పసిపాప మనుబ్రోలు రమ్య అదృశ్యమైంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రమ్య తన అక్కతో పాటు మద్దులూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తోంది. బడి ఈడు వయస్సు లేకపోయినా తన అక్క ఐదో తరగతి చదువుతుంటే అక్కతో కలిసి రోజులాగే శుక్రవారం కూడా బడికి వెళ్లింది. సాయంత్రం ఇంటర్వెల్లో రమ్య ఇంటికి వెళ్తానంటే బడిలో ఉన్న టీచర్ పంపించాడు. రోడ్డు మీద వేరే పేరెంట్ వెళ్తుంటే ఆ పేరెంట్‌తో కలిసి రమ్య వెళ్లింది. కానీ పేరెంట్ ఇల్లు మధ్యలోనే ఉండటంతో అక్కడి నుంచి రమ్య ఒక్కతే వెళ్లినట్లు స్థానికులు చెబున్నారు. తీరా సాయంత్రం 4 గంటలకు బడి వదిలినప్పుడు రమ్య అక్క ఇంటికి రాగానే రమ్య ఏదని తల్లి కోటేశ్వరి అడగటంతో ఇంటర్వెల్లోనే ఇంటికొచ్చిందని అక్క చెప్పటంతో రమ్య అదృశ్యమైనట్లు తల్లి గుర్తించి తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని పరిసరాలను వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, సింగరాయకొండ సీఐ రంగనాథ్, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, టంగుటూరు, కొండపి ఎస్సైలతో పాటు ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి మరో ముగ్గురు ఎస్సైలు కలిసి అదృశ్యమైన పాప ఆచూకీ కోసం మద్దులూరు గ్రామాన్ని జల్లెడ పట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల, బాత్రూములు, అనకర్లపూడి వైపు ఉన్న ఆక్వా పరిశ్రమలు, మూసీ నదివైపు స్థానిక గ్రామస్థులతో పాటు పోలీసులు పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయినా రాత్రి 10 గంటల గడిచినా పాప ఆచూకీ లభించకపోవడంతో పాప తల్లి కోటేశ్వరి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. పాప తండ్రి రామాంజనేయులు స్వస్థలం చీమకుర్తి మండలం ఇలపావులూరు అయితే డెలివరీ కోసం కోటేశ్వరి అమ్మగారి ఊరైన మద్దులూరు వచ్చింది. కోటేశ్వరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అదృశ్యమైన పాప రమ్య రెండో కుమార్తె. తండ్రి హైదరాబాద్‌లో బేల్దార్ పనులకని వెళ్లాడు. కోటేశ్వరి డెలివరీకని వచ్చి మద్దులూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాప ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
ఆరిన కంటి దీపాలు
చందర్లపాడు/సాక్షి, అమరావతి: మునేరులో సోమవారం గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు మంగళవారం బయటపడ్డాయి. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టి అజయ్ (12), గురజాల అజయ్ చరణ్ (14) సోమవారం ఉదయం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన విషయం విదితమే. వీరంతా గ్రామంలోని మునేరులో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు, యానాదులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చిన్నారుల జాడ కోసం సోమవారం రాత్రి నుంచే మునేరుతోపాటు కృష్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయం నల్లవాగు వరద మునేరులో కలిసే ప్రదేశంలో ఏర్పడిన గోతిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. తమ బిడ్డలు ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటారని గంపెడాశతో రాత్రి నుంచి ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు వారి మృతదేహాలను చూసి భోరున విలపించారు. నందిగామ ప్రభుత్వాస్పత్రి వైద్యులు ఏటి ఒడ్డునే పోస్టుమార్టం నిర్వహించి పిల్లల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతులంతా కూలీ కుటుంబాల వారే మృత్యువాతపడిన పిల్లల తల్లిదండ్రులంతా కూలీలే. కాయకష్టం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు. మైల దానయ్య, ఆంథోనీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రాకేష్ (11) స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కర్ల గురవయ్య, లక్ష్మి దంపతులకు కుమారుడు బాలయేసు (12)తో పాటు కుమార్తె ఉంది. ఆ బాలుడు స్థానిక పాఠశాలలోనే 7వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి గురవయ్య గతంలో మరణించడంతో ఆ కుటుంబం మగ దిక్కును కోల్పోయింది. ఇక జట్టి సుందరరావు, అరుణలకు ఇద్దరు సంతానం కాగా చిన్నవాడైన అజయ్ (12) 7వ తరగతి చదువుతున్నాడు. అలాగే గురజాల మరియమ్మ భర్త నుంచి విడిపోయి రెండో పెళ్లి చేసుకుంది. ఆమె కుమారుడు అజయ్ చరణ్(14)ను అమ్మమ్మ, తాతయ్య పెంచుకుంటున్నారు. అజయ్చరణ్ 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, మాగులూరి సుబ్బారావు మేరీ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా.. మూడవ కుమారుడైన సన్నీ (12) 7వ తరగతి చదువుతున్నాడు. ఈ చిన్నారులంతా పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో వంట కట్టెలు తేవడానికి సైకిళ్లపై వెళ్లి మునేరులో దిగి మృత్యువాత పడ్డారు. ఏటూరులో గతంలోనూ ఇలాంటి ప్రమాదం జరిగింది. ఈ గ్రామానికి ఓ వైపు మునేరు మరోవైపు కృష్ణా నది ఉన్నాయి. 2016 అగస్టు 16న నందిగామ చైతన్య కళాశాలలో చదువుతున్న తోటరావులపాడు, జయంతి, చెరువు కొమ్ముపాలెం, నందిగామకు చెందిన ఐదుగురు విద్యార్థులు కృష్ణా నదిలో పడి మృతి చెందారు. మళ్లీ ఇప్పుడు ఐదుగురు చిన్నారులు మునేరులో దిగి దుర్మరణం పాలయ్యారు. రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నట్టు కలెక్టర్ జె.నివాస్ ప్రకటించారు. బుధవారం ఈ సొమ్మును అందజేయనున్నారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. మంత్రి ఆదిమూలపు సంతాపం కాగా, విద్యార్థుల మృతిపై విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ అధికారులు ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు. సంక్రాతి సెలవులు, కరోనా కేసులు విజృంభిస్తున్న తరుణంలో ఇళ్ల వద్ద ఉంటున్న విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
మున్నేరు వాగు ఘటన: నలుగురు మృతదేహలు లభ్యం
చందర్లపాడు: వంట కోసం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఉదయం వెళ్లిన వారు చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి ఆరా తీసిన తల్లిదండ్రులకు తమ పిల్లలు ఏటి దగ్గరకి వెళ్లినట్లు తెలిసి ఆందోళన చెందారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూసేసరికి ఏటొడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు, సైకిళ్లు మాత్రమే కనిపించాయి. ఎంత వెతికినా వారి జాడ తెలియకపోవడంతో నీళ్లలో గల్లంతై ఉంటారని భావించి గాలింపు ప్రారంభించారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టీ అజయ్ (12), గురజాల చరణ్ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇళ్ల వద్దే ఉన్న వీరు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయల్దేరారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. పిల్లలు మునేరు దగ్గరకి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపారు. నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ, తహసీల్దార్ సుశీలాదేవి గాలింపు చర్యలు చేపట్టారు. పల్లెకారులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తులు నదిలో పడవల సాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఘటనా స్థలికి చేరుకుని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి 11 గంటలైన పిల్లల ఆచూకీ లభ్యంకాలేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు మునేరులో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. నలుగురు చిన్నారుల మృతదేహలు లభ్యం నీటిలో పడి మునిగిపోయిన ఐదుగురు చిన్నారులలో నలుగురు మృతదేహలు లభ్యమయ్యాయి. మరో యువకుడి మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. -
పారిపోయి వచ్చేస్తున్నారు ..!
విజయనగరం ఫోర్ట్ : కొమరాడ మండలం విక్రమపురానికి చెందిన 12 ఏళ్ల బాలుడు తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయి రైల్లో విజయనగరానికి శనివారం చేరుకున్నాడు. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్ సభ్యులు గుర్తించి సంరక్షణ కల్పించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలల సంక్షేమ కమిటీ సూచనల మేరకు చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు. విశాఖపట్నం పూర్ణమార్కెట్ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడు తల్లి మందలించిందని కొద్ది రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం వచ్చేశాడు. చైల్డ్‌లైన్ 1098 సంస్థ సభ్యులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా అనేక మంది ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని కొంతమంది.. పట్టణాలు చూద్దామని మరి కొందరు.. ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. ఇంటి నుంచి పారిపోయి వచ్చే సమయాల్లో పోలీసులకు గాని, చైల్డ్‌లైన్ సభ్యులకు గాని దొరికితే ఫర్వాలేదు. పొరపాటును ఏ అగంతుకులకో దొరికితే పిల్లల పరిస్థితి అంతే సంగతి. మూడేళ్ల కాలంలో.. మూడేళ్ల కాలంలో ఇళ్ల నుంచి పారిపోయి పట్టణానికి వచ్చేసిన వారు సుమారు వంద మంది వరకున్నారు. వీరిలో అధికశాతం మంది తల్లిదండ్రులు మందలిస్తే పారిపోయి వచ్చిన వారే. ఈ సంఖ్య కేవలం అధికారులకు పట్టుబడిన చిన్నారులు మాత్రమే. ఇలా లెక్కకు దొరకని చిన్నారులు ఇంకెంతమంది ఉన్నారో చెప్పలేం. ఇష్టాలు తెలుసుకోలేకపోతున్నారు.. పిల్లల ఇష్టాలను తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. విధి నిర్వహణలో బిజీగా ఉంటూ పిల్లల ప్రవర్తనను చాలామంది గుర్తించ లేకపోతున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీలో తల్లిదండ్రులు ఉండడం బాధాకరం. పిల్లల ఇష్టాలను తెలుసుకోకుండా మందలించడం, కొట్టడం వల్ల వారి మనసులు గాయపడి ఇళ్ల నుంచి పారిపోతున్నారు. చిన్నారుల అభిప్రాయాలను తెలుసుకుని వారికి సముచిత స్థానం కల్పిస్తే ఇటువంటి సంఘటనలు జరగవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గొడవల వల్లే.. పిల్లల ఎదుటే తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గొడవలు పడుతుండడం వల్ల చిన్నారులు మనసు గాయపడుతుంది. దీంతో వారు ఎటైనా పారిపోవాలనే ఉద్దేశానికి వస్తారు. అలాగే సోషల్ మీడియాలో చూపిస్తున్న ప్రదేశాలను చూడాలని కూడా కొంతమంది పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఇంట్లో స్వేచ్ఛ ఉండడం లేదని.. తల్లిదండ్రులు మందలించారని చాలా మంది పిల్లలు ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తున్నారు. – కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిన్ సభ్యుడు ప్రవర్తన గమనించాలి.. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. వారి ఇష్టాఇష్టాలను తెలుసుకోవాలి. ప్రతి చిన్న విషయానికీ కొట్టడం, తిట్టడం చేయడం వల్ల ఇంటి నుంచి పారిపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. మంచి చెడుల గురించి చెప్పేవారు. కాని నేటి తల్లిదండ్రులు పిల్లలు ఏమి చేస్తున్నారో కూడా గమనించడం లేదు. – వావిలాల లక్ష్మణ్, జిల్లా బాలల సంక్షేమ సమితి అధ్యక్షుడు -
హాస్టల్‌కు వెళ్తున్నామని చెప్పి...అదృశ్యమయ్యారు
విజయనగర్‌కాలనీ(హైదరాబాద్): హాస్టల్‌కు వెళ్తున్నామంటూ ఇంటి నుంచి బయలుదేరిన ఇద్దరు బాలురు కనిపించకుండా పోయారు. ఈ సంఘటన శనివారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోజగుట్టలో నివాసం ఉండే ఎ.మల్లేశ్ కుమారులు అరుణ్(7), అశోక్(9) కార్వాన్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉంటున్నారు. ఈ నెల 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు హాస్టల్‌కు వెళ్తున్నామంటూ ఇంటి నుంచి వెళ్లిన విద్యార్థులు హాస్టల్‌కు చేరలేదు. తండ్రి బంధుమిత్రులు, తెలిసినవారి చోట వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుర ఆచూకీ తెలసిన వారు 94906 16557 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.