ప్రకాశం: ఐదేళ్లు కూడా నిండని పసిపాప మనుబ్రోలు రమ్య అదృశ్యమైంది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రమ్య తన అక్కతో పాటు మద్దులూరులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్తోంది. బడి ఈడు వయస్సు లేకపోయినా తన అక్క ఐదో తరగతి చదువుతుంటే అక్కతో కలిసి రోజులాగే శుక్రవారం కూడా బడికి వెళ్లింది. సాయంత్రం ఇంటర్వెల్‌లో రమ్య ఇంటికి వెళ్తానంటే బడిలో ఉన్న టీచర్ పంపించాడు. రోడ్డు మీద వేరే పేరెంట్ వెళ్తుంటే ఆ పేరెంట్‌తో కలిసి రమ్య వెళ్లింది.
కానీ పేరెంట్ ఇల్లు మధ్యలోనే ఉండటంతో అక్కడి నుంచి రమ్య ఒక్కతే వెళ్లినట్లు స్థానికులు చెబున్నారు. తీరా సాయంత్రం 4 గంటలకు బడి వదిలినప్పుడు రమ్య అక్క ఇంటికి రాగానే రమ్య ఏదని తల్లి కోటేశ్వరి అడగటంతో ఇంటర్వెల్‌లోనే ఇంటికొచ్చిందని అక్క చెప్పటంతో రమ్య అదృశ్యమైనట్లు తల్లి గుర్తించి తల్లిదండ్రుల ద్వారా గ్రామంలోని పరిసరాలను వెతికి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, సింగరాయకొండ సీఐ రంగనాథ్, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, మద్దిపాడు, టంగుటూరు, కొండపి ఎస్సైలతో పాటు ఒంగోలు పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నుంచి మరో ముగ్గురు ఎస్సైలు కలిసి అదృశ్యమైన పాప ఆచూకీ కోసం మద్దులూరు గ్రామాన్ని జల్లెడ పట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి పాఠశాల, బాత్‌రూములు, అనకర్లపూడి వైపు ఉన్న ఆక్వా పరిశ్రమలు, మూసీ నదివైపు స్థానిక గ్రామస్థులతో పాటు పోలీసులు పాప ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు.
అయినా రాత్రి 10 గంటల గడిచినా పాప ఆచూకీ లభించకపోవడంతో పాప తల్లి కోటేశ్వరి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. పాప తండ్రి రామాంజనేయులు స్వస్థలం చీమకుర్తి మండలం ఇలపావులూరు అయితే డెలివరీ కోసం కోటేశ్వరి అమ్మగారి ఊరైన మద్దులూరు వచ్చింది. కోటేశ్వరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్నారు. అదృశ్యమైన పాప రమ్య రెండో కుమార్తె. తండ్రి హైదరాబాద్‌లో బేల్దార్ పనులకని వెళ్లాడు. కోటేశ్వరి డెలివరీకని వచ్చి మద్దులూరులోని తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. పాప ఆచూకీ తెలియాల్సి ఉందని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment