మహబూబాబాద్,న్యూస్‌లైన్ :
మున్నేరు వాగుకు ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతైన సంఘటన మానుకోటలో ఆదివారం చోటుచేసుకుంది. విద్యార్థి బంధువుల కథనం ప్రకారం... మానుకోట పట్టణంలోని కంకరబోడ్ కాలనీకి చెందిన ఎండీ షరీఫ్‌ఖాన్, షబానా దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు రిజ్వాన్(17) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కళాశాలకు సెలవు ఇవ్వడంతో రెండు రోజుల క్రితమే ఇంటికొచ్చాడు. ఈతపై అమిత ఆసక్తి ఉన్న అతడు ఆదివారం తన తొమ్మిది మంది స్నేహితులతో మున్నేరు వాగుకు వెళ్లాడు. వాగు మత్తడి వద్ద ఈత కొట్టారు. వారిలో కొంతమంది కొద్దిసేపటి తర్వాత ఒడ్డుపై సేద తీరుతుండగా రిజ్వాన్‌తోపాటు మరోస్నేహితుడు మాత్రమే ఈత కొడుతున్నారు. ఈ క్రమంలో మత్తడి వద్ద నీటి ప్రవాహం తీవ్రంగా ఉండడంతో ఉధృతిలో రిజ్వాన్ కొట్టుకుపోయాడు. దీంతో అతడి స్నేహితులు, అక్కడే ఉన్న మునిసిపాలిటీ సిబ్బంది అతడి కోసం ఎంత గాలించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న అతడి తల్లిదండ్రులు, బంధువులు వాగు వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లు, మునిసిపాలిటీ సిబ్బంది మళ్లీ నీటిలోకి దిగి విద్యార్థికోసం గాలించినా ఫలితం లేకపోయింది. రాత్రి కావడంతో వెలుతురు లేకపోవడం, నీటి ప్రవాహాన్ని తట్టుకోవడం కష్టమేనని తిరిగి ఒడ్డుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం మళ్లీ గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతామని అధికారులు తెలిపారు. వాగు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం అధికారుల వైఫల్యానికి అద్దం పడుతోంది.
మున్నేరువాగులో విద్యార్థి గల్లంతు
Published Mon, Sep 9 2013 4:05 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM
Advertisement
Advertisement