జల దిగ్బంధం... ట్రాఫిక్‌ చక్రబంధం | Heavy Rain In Hyderabad | Sakshi
Sakshi News home page

జల దిగ్బంధం... ట్రాఫిక్‌ చక్రబంధం

Sep 23 2025 2:19 AM | Updated on Sep 23 2025 5:49 AM

Heavy Rain In Hyderabad

హైదరాబాద్‌పై వరుణ ప్రతాపం 

సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు జడివాన 

చెరువుల్లా మారిన రోడ్లు.. పలుచోట్ల కొట్టుకుపోయిన టూవీలర్లు 

గంటలకొద్దీ కి.మీ. మేర స్తంభించిన ట్రాఫిక్‌.. సీఎం కాన్వాయ్‌కూ తప్పని ట్రా‘ఫికర్‌’ 

సచివాలయం నుంచి జూబ్లీహిల్స్‌ వరకు కాన్వాయ్‌లో 13 నిమిషాల ప్రయాణానికి గంటంపావు సమయం  

బంజారాహిల్స్‌లో అత్యధికంగా 10.5 సెం.మీ. వర్షపాతం 

పలు జిల్లాల్లోనూ కుండపోత.. పిడుగుపాట్లకు ఇద్దరు మృతి

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: భాగ్యనగరాన్ని వరుణుడు బెంబేలెత్తించాడు. హోరు వానతో నగరాన్ని అతలాకుతలం చేశాడు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఉరుములు మెరుపులతో మొదలైన మేఘగర్జన రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో వరద ఉధృతికి రహదారుల పక్కన నిలిపిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఓపెన్‌ నాలాలు, మ్యా­న్‌హోల్స్‌ పొంగిపోర్లాయి. ఫలితంగా రోడ్లన్నీ చెరువు­లను తలపించడంతో ట్రాఫిక్‌ పూర్తిగా అస్తవ్యస్తమైంది.

గంటలకొద్దీ, కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు స్తంభించిపోయాయి. విజయవాడ, వరంగల్, ముంబై, బెంగళూరు, కరీంనగర్‌ వెళ్లే మార్గాల్లో ఇళ్లకు, ఆఫీసులకు బయలుదేరిన వాహనదారులు ముందుకు కదల్లేక నానా అవస్థలు పడ్డారు. ప్రధానంగా అసెంబ్లీ నుంచి ఖైరతాబాద్, మెహిదీపట్నం నుంచి మాసాబ్‌ ట్యాంక్, ఎల్బీ నగర్‌ నుంచి మలక్‌పేట వరకు కేవలం కిలోమీటర్‌ ప్రయాణానికి గంటలకొద్దీ సమయం పట్టింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా బంజారాహిల్స్‌లో సుమారు 10.5 సెం.మీ. వర్షం కురవగా శ్రీనగర్‌ కాలనీలో 9.9 సెం.మీ., ఖైరతాబాద్‌లో 8.9 సెం.మీ. వర్షం కురిసింది.

 శ్రీనగర్, ఖైరతాబాద్, మైత్రివనం, యూసుఫ్‌గూడ, వనస్థలిపురం, హయత్‌నగర్, బహదూర్‌పురా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక నగరు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచికొట్టింది. తుర్కయంజాల్‌ మున్సిపల్‌ పరిధి ఇంజాపూర్‌–తొర్రూర్‌ మార్గంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు వరదలో చిక్కుకున్నారు. మున్సిపల్‌ సిబ్బంది అతికష్టం మీద వారిని కాపాడారు. వరదలో కొట్టుకుపోయిన కారు కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెకు తగిలి ఆగిపోయింది. 

సీఎం కాన్వాయ్‌కూ తప్పని ట్రాఫిక్‌ తిప్పలు.. 
కుండపోత వర్షంతో రోడ్లన్నీ జలమయం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ సైతం ట్రాఫిక్‌లో చిక్కుకొని నత్తనడకన ముందుకు సాగింది. సాయంత్రం 6:30 గంటలకు సీఎం సచివాలయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి బయల్దేరగా ఖైరతాబాద్‌ ఫ్లై ఓవర్‌ మీదుగా వీవీ స్టాచ్యూ వద్దకు రాగానే ఖైరతాబాద్‌ కూడలిలో ట్రాఫిక్‌ స్తంభించింది. అక్కడి నుంచి ఖైరతాబాద్, కేసీపీ జంక్షన్, ఎర్రమంజిల్‌ తాజ్‌ కృష్ణా, వెంగళ్‌రావు పార్కు, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ చౌరస్తా, పంజగుట్ట శ్మశానవాటిక, టీవీ 9 మీదుగా సాగర్‌ సొసైటీ, కేబీఆర్‌ పార్కు చౌరస్తా వరకు కాన్వాయ్‌ ముందుకు కదిలేందుకు చాలా సమయం పట్టింది.

సరిగ్గా 7:25 గంటలకు సీఎం కాన్వాయ్‌ కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. కేబీఆర్‌ పార్కు చౌరస్తా నుంచి జూబ్లీహిల్స్‌ చౌరస్తాకు వెళ్లేందుకు 20 నిమిషాలు పట్టింది. జూబ్లీహిల్స్‌ చౌరస్తా నుంచి సీఎం ఇంటికి వెళ్లకుండా కేబుల్‌ బ్రిడ్జి మీదుగా మెడికవర్‌ ఆస్పత్రికి వెళ్లారు. సరిగ్గా 8 గంటలకు ఆయన మెడికవర్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. వాస్తవానికి సచివాలయం నుంచి సీఎం నేరుగా తన ఇంటికి వెళ్లేందుకు 13 నిమిషాల సమయం పడుతుంది.

కేబీఆర్‌ పార్కు చౌరస్తాలో నిలిచిపోయిన సీఎం కాన్వాయ్‌  

కానీ సోమవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్‌ దాటడానికే గంటంపావు సమయం పట్టింది. అయితే తన కోసం వాహనదారులను ఇబ్బంది పెట్టొద్దని.. తాను ట్రాఫిక్‌లో ఇరుక్కున్నా పరవాలేదని పోలీసులను ఆదేశించిన సీఎం రేవంత్‌.. గంటన్నరపాటు స్తంభించిన ట్రాఫిక్‌లోనే మెల్లగా ముందుకు కదిలారు.

జిల్లాల్లోనూ జోరు వాన 
వరంగల్, ములుగు, సిద్దిపేట జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని చెల్పాక గ్రామంలో పొలం దున్నుతున్న రైతు ఊకే కృష్ణ (45) పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందగా మరో రైతు పూనెం చిట్టిబాబు గాయపడ్డాడు. అలాగే వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలో పొలంలో మిరప నారు వేస్తుండగా వర్షం కురుస్తోందని చెట్టు కింద నిలబడిన మొద్దు రాకేష్‌ (25)పై పిడుగుపడటంతో మృతిచెందాడు.

వరంగల్‌ నగరంలోని వరంగల్‌ అండర్‌బ్రిడ్జి, భవాని నగర్‌–వికాస్‌నగర్‌ కూడలి, అంబేడ్కర్‌ భవన్, హనుమకొండ జి­ల్లా బస్‌స్టేషన్‌ కూడలి, బస్‌స్టేషన్, కాకాజీ నగర్, హను­మకొండ, వరంగల్‌ చౌరస్తా ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో వాహనదారులు అవస్థలుపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాకలో 8.5 సెం.మీ. వర్షం కురవగా కొమురవెల్లి మండల కేంద్రంలో 7.2, సిద్దిపేట పట్టణంలో 7.15 సెం.మీ. వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఇంజనీర్‌ శాఖ కార్యాలయంపై పిడుగు పడటం సుమారు రూ. 10 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు  అధికారులు అంచనా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement