కుండపోత
సాక్షి,గుంటూరు
జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం కురిసిన కుండపోత వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రహదారులు నీట మునిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పట్టణ ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.
జిల్లాలోని మేడికొండూరులో అత్యధికంగా 20.04 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రత్తిపాడులో 16.02, ఫిరంగిపురం 15.80, యడ్లపాడు 14 , గుంటూరు 9.22, పెదకూరపాడులో 8.29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఏడు సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదైంది.
జిల్లాలో అధిక శాతం పైర్లు వరద నీట మునిగాయి. దాదాపు నెల రోజుల కిందట వేసిన పైర్లు కావడంతో నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే, వెయ్యి హెక్టార్లలోపు పైర్లు మాత్రమే నీట మునిగి దెబ్బతినే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
తాడికొండ మండలం లాం వద్ద కొండవీటివాగు పొంగి పొర్లడంతో చప్టాపై నుంచి భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తుండటంతో అందులో ఓ గుర్తుతెలియని మహిళ గల్లంతైంది. ఆమెను రక్షించేందుకు షేక్‌బాజీ అనే వ్యక్తి చేసిన ప్రయత్నం ఫలించలేదు. కంతేరు వద్ద ఎర్రవాగు లో ఎం.వాసుదేవరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు.
నల్లపాడు-పేరేచర్ల మధ్య వరద నీటి ఉధృతికి రైల్వే ట్రాక్ కట్ట కొట్టుకుపోవడంతో పట్టాలు గాలిలో ఉన్నాయి. ఆ సమయంలో వస్తున్న హుబ్లీ ప్యాసింజర్ డ్రైవర్ గుర్తించి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
మేడికొండూరులో చప్టాపై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో గుంటూరు - మాచర్ల రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
పెదకూరపాడు గ్రామంలో పిడుగుపడి అంకమ్మతల్లి దేవాలయం పాక్షికంగా దెబ్బతింది. చినమక్కెన వద్ద కల్వర్టు కొట్టుకుపోవడంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
నరసరావుపేట పట్టణం ఎస్‌ఆర్‌కేటీ కాలనీతోపాటు పలు కాలనీల్లోకి నీరు రావడంతో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
చిలకలూరిపేట పట్టణంలో దాదాపు అన్ని కాలనీలు జలమయమయ్యాయి. గడియారస్తంభం సెంటర్‌లో షాపులు నీట మునిగి రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. ఓగేరు, కుప్పగంజి, నక్క వాగులు పొంగి పొర్లుతున్నాయి.
{పత్తిపాడులో చిన్న చెరువు పొంగి కాలనీలు జలమయమయ్యాయి. కోయవారిపాలెం కొండవాగు పొంగి ఎస్సీ కాలనీని ముంచెత్తింది. గొట్టిపాడులో నక్కవాగు పొంగి రాకపోకలు స్తంభించాయి.
చిలకలూరిపేట మండలం మురికిపూడి కొత్తచెరువుకు గండి పడి వందల ఎకరాల్లో పైర్లు నీట మునిగాయి. పసుమర్రు -అనంతవరం మార్గంలో రాకపోకలు స్తంభిం చాయి. అలాగే యడ్లపాడు- ఫిరంగిపురం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
నరసరావుపేట తహశీల్దారు కార్యాలయం పైకప్పు వర్షానికి నాని పెచ్చులూడి కిందపడడంతో కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి.
మేడికొండూరు మండలం కొర్రపాడులో మంచినీటి చెరువు పొంగడంతో గ్రామం జలమయమైంది.