సాక్షి, హైదరాబాద్: నైరుతి నిరాశపరచడం, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. జూన్ ఆరంభంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు మొదలైనా.. ప్రస్తుతం నిలిచిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకు కృష్ణా, గోదావరి బేసిన్‌ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 9.17 టీఎంసీల నీరే చేరడం, ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో దిగువ ప్రాజెక్టుల కింద సాగు ప్రశ్నార్థకం కానుంది.
చుక్క ప్రవాహం లేదు: జూన్ తొలివారంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలొచ్చాయి. రోజుకి 10 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టులో నీటి లభ్యత పెరుగుతుందని భావించారు. కానీ కొత్త నీరు 3.99 టీఎంసీలే వచ్చింది. ప్రస్తుతం చుక్క ప్రవాహం కూడా లేదు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.25 టీఎంసీల లభ్యతే ఉంది. సింగూరులోకి సైతం తొలుత ప్రవాహాలొచ్చినా ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 0.93 టీఎంసీల కొత్త నీరే వచ్చింది.
ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.76 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 18.9 టీఎంసీల లభ్యత ఉంది. ఇక నిజాంసాగర్‌లోకి ఇంతవరకు చుక్క నీరు రాలేదు. కడెంలోకి 1.48 టీఎంసీలు, ఎల్లంపల్లిలోకి 1.36 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకి కొంత మేర ప్రవాహాలున్నా మునుపటితో పోలిస్తే తగ్గాయి. కృష్ణా బేసిన్‌లో తొలివారంలో జూరాలకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగడంతో ప్రాజెక్టులోకి కొత్తగా 2.41 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరుంది. కానీ సాగర్, శ్రీశైలంలోకి కొత్త నీరు రాలేదు. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లోకి 9.17 టీఎంసీల నీరే వచ్చింది.
ఆల్మట్టి నిండితేనే దిగువకు..
ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో ఒక్క తుంగభద్రకే ఆశాజనక ప్రవాహాలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 23 రోజుల వ్యవధిలో 23.08 టీఎంసీల మేర కొత్త నీరొచ్చింది. దీంతో ప్రాజెక్టులో 100 టీఎంసీకు గానూ 26.21 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయి. శనివారం కూడా ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. నారాయణపూర్‌లో వారం కిందటి వరకు ప్రవాహాలు కొనసాగినా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24 టీఎంసీల మేర లభ్యత ఉంది. అతి ముఖ్యమైన ఆల్మట్టిలోకి ఇంతవరకు పెద్ద ప్రవాహాలే లేవు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 22.88 టీఎంసీల నీరే ఉంది. ఆల్మట్టి నిండితేనే దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment