godhavari river
-
శ్రీశైలం ప్రాజెక్టులోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త పెరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు 87,852 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 41,358 క్యూసెక్కులను దిగువకు వదులు తున్నారు. శ్రీశైలంలో 879.5 అడుగుల్లో 185.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 29,080 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 31,125 క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో ఆదివారమూ శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన జలాలతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 554.9 అడుగుల్లో 220.70 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన మూసీలో వరద ఉధృతి తగ్గడంతో పులిచింతల్లోకి 7,852 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 40.63 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి 19,587 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి దిగువకు వదులుతున్న నీటికి పాలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 27,542 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 10,197 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 17,345 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తగ్గిన గోదావరి వరద గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి నీటి మట్టం 8.80 అడుగులు ఉంది. బ్యారేజి నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 9,800 క్యూసెక్కులు వదిలారు. 5,91,042 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. భద్రాచలం వద్ద నీటి మట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 32.70 అడుగులకు చేరింది. పోలవరంలో 10.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.02 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి. ఇదీ చూడండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది -
గోదావరికి పోటెత్తిన వరద (ఫొటోలు)
-
గోదావరి ఉగ్రరూపం.. ఆ జిల్లాలకు హైఅలర్ట్
అమరావతి: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరానికి వరద పోటెత్తింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. దీంతో వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ. వరద ఉద్ధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టంది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. ముందస్తుగా అత్యవసర సహాయక చర్యల కోసం.. రెండు ఎన్డీఆర్ఎఫ్, మూడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యల్లో ప్రజలు అధికారులకు సహకరించాలని విన్నవించింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలిని సూచించింది. ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత.. ప్రకాశం బ్యారేజ్‌కు ఎగువ నుంచి కృష్ణా నది వరద ఉద్ధృతి పెరగటంతో గేట్లు ఎత్తారు. దిగువకు వరద నీరు విడుదల చేశారు అధికారులు. దిగువకు నీటిని విడుదల చేసిన క్రమంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని స్పష్టం చేశారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదన్నారు. ఇదీ చూడండి: 'క్యూట్'గా ఉంటే విమాన టికెట్‌పై అదనపు ఛార్జ్.. ఇందులో నిజమెంత? -
వంతెనకు.. నయ వంచన
సాక్షి, నరసాపురం : వశిష్ట వంతెన.. ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురంలో వశిష్ట గోదావరిపై బ్రిడ్జి నిర్మించాలన్నది బ్రిటీష్ హయాం నుంచి ఉన్న డిమాండ్. ప్రతి ఎన్నికల సమయంలోనూ రాజకీయ నేతలు జిల్లాలో మొదటిగా ప్రస్తావించే అంశం. గత 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వశిష్ట వంతెన విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో అదిగో వంతెన, ఇదిగో వంతెన అంటూ హడావుడి తప్ప మరొకటి జరగలేదు. వంతెన మంజూరైందంటూ టీడీపీ నేతలు అనేకసార్లు స్వీట్లు పంచుకున్నారు గానీ ప్రజలకు మాత్రం తీపి కబురు రాలేదు. 2016 ఫిబ్రవరి 18న నరసాపురం పక్కనే ఉన్న తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అప్పటి నుంచి వంతెన విషయంలో టీడీపీ నేతల హైడ్రామా మొదలైంది. హార్బర్ నిర్మాణానికి రూ.1,800 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సరిగ్గా అదే నెలలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి మరో ప్రకటన వచ్చింది. డ్రెడ్జింగ్ హార్బర్ నిధుల్లో రూ.200 కోట్లు ఖర్చు చేసి ఉభయగోదావరి జిల్లాలను కలుపుతూ నరసాపురం వశిష్ట గోదావరిపై వంతెన నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని ఒప్పించారని స్థానిక ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు చెప్పుకొచ్చారు. నితిన్గట్కరీకి ఈ మేరకు చంద్రబాబునాయుడు రాసిన లేఖంటూ ఓ లెటర్‌ను కూడా పత్రికలకు విడుదల చేశారు. ఇంకేముంది కేంద్రం సహకారంతో కలల వారధి ఈ సారి కచ్చితంగా నిర్మాణం జరిగి తీరుతుందని అందరూ భావించారు. వంతెన నిర్మాణం జరుగుతుందంటూ టీడీపీ నాయకులు గోదావరి రేవు వద్ద మిఠాయిలు పంచారు. బాణాసంచా కాల్చారు. 18 నెలల తరువాత మరో డ్రామా ఇదంతా జరిగిన తరువాత సీన్ కట్ చేస్తే మరో 18 నెలలకు ఉభయగోదావరి జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం ఢిల్లీ వెళ్లింది. ఇదే కేంద్రమంత్రి నితిన్‌గట్కరీని కలిశారు. డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం, వంతెనకు నిధుల మళ్లింపు అంశాన్ని పక్కకు పెట్టారు. చించినాడ నుంచి నరసాపురం మీదుగా 216 జాతీయ రహదారి విస్తరణ పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, సఖినేటిపల్లి రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్పు చేసి, సఖినేటిపల్లి నుంచి నరసాపురంలో 216కు అనుసంధానం చేయాలని, నరసాపురంలో వశిష్ట గోదావరిపై వంతెన నిర్మించాలని వినతిపత్రం ఇచ్చారు. దీనికి నితిన్‌గట్కరీ ఒప్పుకున్నారని, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుతో సహా ఢిల్లీ వెళ్లిన బృందంలోని నాయకులు చెప్పారు. 1986లో వంతెన నిర్మాణానికి బీజం నరసాపురం వశిష్ట వంతెన అనేది దశాబ్ధాల పోరాటం. బ్రిటిష్ హయాంలోనే ఇక్కడ వంతెన నిర్మించాలని యోచించారు. మొదటిగా నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మొదటిసారి వంతెన ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. ఎన్టీ రామారావు హయాంలో వంతెనకు బీజం పడింది. 1986లో ఎన్టీఆర్ వశిష్ట వంతెనకు నరసాపురంలోనూ, తూర్పుగోదావరి జిల్లాలోనూ రెండు చోట్లా శంకుస్థాపనలు చేశారు. సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ నరసాపురంలో నిర్మించాల్సిన వంతెనను చించినాడలో నిర్మించారు. 2003లో అప్పటి మంత్రిగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి అంటూ వంతెన పనులకు శంకుస్థాపన చేసి హడావిడి చేశారు. వైఎస్ హయాంలో రూ.194 కోట్లతో టెండర్లు నరసాపురం వశిష్ట వంతెన విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చొరవ చూపారు. 2008 ఏప్రిల్ 15న వశిష్ట వంతెనకు తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శంకుస్థాపన చేశారు. రూ.194 కోట్లతో టెండర్ పిలిచి నిర్మాణ పనులను సత్యంకు అనుబంధ సంస్థగా ఉన్న మైటాస్ కంపెనీకి అప్పగించారు. ప్రాథమికంగా సర్వేలన్నీ పూర్తి చేసిన వంతెన పనులు ప్రారంభమవుతాయనగా సత్యం సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో పనులు నిలిచిపోయాయి. అయితే వైఎస్ వేరే కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. అంతలో ఆయన మృతిచెందడం జరిగింది. మైటాస్ వద్ద సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న వేరే కంపెనీ పనులు చేపట్టడానికి ముందుకు వచ్చినా కూడా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు శ్రద్ధ చూపించలేదు పాదయాత్రలో జగన్ హామీ గత మే నెలలో నియోజకవర్గంలో పాదయాత్రకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో మొదటగా వంతెన విషయాన్నే ప్రస్తావించారు. వశిష్ట వంతెన నిర్మాణంలో ముఖ్యమంత్రి సినిమా చూపిస్తున్నారని, ఆ సినిమాకు తాను అధికారంలోకి రాగానే తెరవేస్తానని హామీ ఇచ్చారు. తన తండ్రి ప్రారంభించిన వంతెన పనులు పూర్తి చేసి చూపిస్తానన్నారు. -
ఇలా వచ్చి.. అలా ఆగాయి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి నిరాశపరచడం, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. జూన్ ఆరంభంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు మొదలైనా.. ప్రస్తుతం నిలిచిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 9.17 టీఎంసీల నీరే చేరడం, ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో దిగువ ప్రాజెక్టుల కింద సాగు ప్రశ్నార్థకం కానుంది. చుక్క ప్రవాహం లేదు: జూన్ తొలివారంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలొచ్చాయి. రోజుకి 10 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టులో నీటి లభ్యత పెరుగుతుందని భావించారు. కానీ కొత్త నీరు 3.99 టీఎంసీలే వచ్చింది. ప్రస్తుతం చుక్క ప్రవాహం కూడా లేదు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.25 టీఎంసీల లభ్యతే ఉంది. సింగూరులోకి సైతం తొలుత ప్రవాహాలొచ్చినా ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 0.93 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.76 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 18.9 టీఎంసీల లభ్యత ఉంది. ఇక నిజాంసాగర్‌లోకి ఇంతవరకు చుక్క నీరు రాలేదు. కడెంలోకి 1.48 టీఎంసీలు, ఎల్లంపల్లిలోకి 1.36 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకి కొంత మేర ప్రవాహాలున్నా మునుపటితో పోలిస్తే తగ్గాయి. కృష్ణా బేసిన్లో తొలివారంలో జూరాలకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగడంతో ప్రాజెక్టులోకి కొత్తగా 2.41 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరుంది. కానీ సాగర్, శ్రీశైలంలోకి కొత్త నీరు రాలేదు. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లోకి 9.17 టీఎంసీల నీరే వచ్చింది. ఆల్మట్టి నిండితేనే దిగువకు.. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో ఒక్క తుంగభద్రకే ఆశాజనక ప్రవాహాలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 23 రోజుల వ్యవధిలో 23.08 టీఎంసీల మేర కొత్త నీరొచ్చింది. దీంతో ప్రాజెక్టులో 100 టీఎంసీకు గానూ 26.21 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయి. శనివారం కూడా ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. నారాయణపూర్‌లో వారం కిందటి వరకు ప్రవాహాలు కొనసాగినా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24 టీఎంసీల మేర లభ్యత ఉంది. అతి ముఖ్యమైన ఆల్మట్టిలోకి ఇంతవరకు పెద్ద ప్రవాహాలే లేవు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 22.88 టీఎంసీల నీరే ఉంది. ఆల్మట్టి నిండితేనే దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలవుతాయి. -
వంద రోజులు.. కోటి ఆశలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనున్న ప్రతిష్టాత్మక పథకం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు మళ్లించేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నుంచి సరిగ్గా వంద రోజుల్లో.. అంటే జూలై మూడో వారంలో మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌజ్‌ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే బ్యారేజీల పరిధిలో గేట్ల బిగింపు ప్రక్రియ మొదలవగా.. మోటార్లు, పంపులు, డెలివరీ మెయిన్ వంటి వ్యవస్థల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. విదేశాల నుంచి భారీ మోటార్లను ఈ నెలాఖరు నాటికి తెప్పించి బిగింపు ప్రక్రియ మొదలు పెట్టేలా నీటి పారుదల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వేగంగా గేట్ల బిగింపు.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే మరింత ముందుగానే ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూలై రెండో వారం నుంచే రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసి.. ఖరీఫ్ ఆయకట్టుకు అందించేలా ప్రాజెక్టు పనులను వేగిరం చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే బ్యారేజీలు, పంపుహౌజ్ పనుల్లో 80 శాతం కాంక్రీటు పనులు పూర్తవగా.. మిగతా 20 శాతం పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1.63 కిలోమీటర్లుకాగా 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముందుగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా జూన్ నాటికి కనీసం 10 గేట్లు ఏర్పాటు చేసేలా పనులు జరుగుతున్నాయి. మరో వారంలో ఇక్కడ గేట్లు అమర్చే ప్రక్రియ మొదలవనుంది. ఇక అన్నారం బ్యారేజీలో 66 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 6 గేట్ల ఏర్పాటు పూర్తయింది. నెలాఖరుకు మొత్తంగా 20 గేట్లు బిగించి.. జూన్ నాటికి మిగతా పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీల పనులు అన్నారం బ్యారేజీ పనులను రూ.1,464 కోట్లతో చేపట్టగా రూ.వెయ్యి కోట్ల మేర పనులు పూర్తికావడం గమనార్హం. మిగతా బ్యారేజీలతో పోలిస్తే çసుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా.. అన్నారం బ్యారేజీ తర్వాత దాని పనులే అధిక వేగంతో ముందుకెళ్తున్నాయి. ఈ బ్యారేజీ పొడవు 1.45 కిలోమీటర్లు, నిల్వ సామర్థ్యం 8.5 టీఎంసీలు కాగా... దీనికోసం 81 పిల్లర్లు నిర్మించి 74 రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 4 గేట్లు బిగించగా.. నెలాఖరుకు 15 గేట్లు, వచ్చే నెలలో 25 గేట్ల ఏర్పాటు పూర్తిచేసి జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. ఈ బ్యారేజీలో మొత్తంగా రూ.1,444 కోట్ల పనుల్లో రూ.800 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మోటార్ల బిగింపునకు సిద్ధం కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే మూడు పంపుహౌజ్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా.. పంపులు, మోటర్ల బిగింపు పనులు నెలాఖరు నుంచి మొదలు కానున్నాయి. మోటార్లు అమర్చేందుకు వీలుగా ఇతర పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నారు. మూడు పంపుహౌజ్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా దేశాల కంపెనీల ప్రతినిధులతో నీటి పారుదల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. మోటర్లు ఈనెల చివరికి రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. మేడిగడ్డ పంపుహౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. జూన్ చివరి నాటికి 5 మోటార్లను బిగించనున్నారు. ఈ పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. దీనికి దిగువన అన్నారం పంపుహౌజ్‌లో 8 మోటార్లకుగాను జూన్ చివరికి నాలుగు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా జూన్ చివరికి మోటార్లను సిద్ధం చేసి డ్రై, వెట్ ట్రయల్ రన్లను నిర్వహించాలని... జూలై రెండో వారంలో గోదావరి ఉధృతి పెరిగే సమయానికి నీటిని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎల్లంపల్లి దిగువన శరవేగంగా.. ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌజుల్లోనూ ఒక్కో టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌజ్‌లు నిర్మించాల్సి ఉండగా.. 88 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు పంపులను ఇప్పటికే సిద్ధం చేశారు. మరో రెండు పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తో పాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చుతున్నారు. ఇందులో 2 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. జూలై రెండో వారం నుంచి నీళ్లు.. మిడ్‌మానేరుకు చేరే నీటిని అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా.. గంధమల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా నిర్మిస్తున్న గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాల్స్, టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ మొదటి వారానికే మెజారిటీ పనులను పూర్తి చేసి.. టెస్ట్ రన్లు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జూన్ చివరి నాటికి లోపాలను సరిదిద్దుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 16 నాటికి సాగునీటిని తరలించాలని దిశానిర్దేశం చేశారు. వంద రోజుల కౌంట్‌డౌన్ పెట్టిన నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అటు లైవ్ కెమెరాల ద్వారా, ఇటు అధికారుల ద్వారా సమీక్షిస్తున్నారు. కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ చైర్మన్ కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆదివారం హైదరాబాద్ రానున్న ఆయన.. సోమవారం ప్రత్యేక హెలికాప్టర్లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులను పరిశీలించే అవకాశముందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు సీడబ్ల్యూసీ సీఈ నవీన్‌కుమార్ సైతం ఈ పర్యటనలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం నుంచి కీలకమైన కాస్ట్ అప్రైజల్, ఇరిగేషన్ ప్లానింగ్ వంటి రెండు, మూడు అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలో మసూద్ హుస్సేన్ పర్యటన కీలకం కానుంది. -
ఒక్క చుక్కా చేజారొద్దు
గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పరిశీలనలో కేసీఆర్ తెలంగాణ రైతాంగం భవిష్యత్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. జూన్ నాటికి పంపుహౌస్ పనులు పూర్తయి నీరు పారించాలి. పనుల్లో మరింత వేగం పెంచండి. మూడు షిఫ్టుల్లో పనులు చేయండి. – సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్ /సాక్షి, పెద్దపల్లి వచ్చే వర్షాకాలం నుంచి గోదావరి నది నీరు ఒక్క చుక్క కూడా వృథాగా కిందికి పోవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని.. ఇందుకోసం మూడు షిఫ్టుల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై కాగితాల్లో చూపిస్తున్న దానికి, సమీక్షల్లో వివరిస్తున్న అంశాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపుహౌస్‌లు, దేవాదుల ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. తొలుత ఉదయం కరీంనగర్ జిల్లా తీగరాజులగుట్ట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 10:17 గంటలకు తుపాకులగూడెం బ్యారేజీ ప్రాంతానికి చేరుకున్నారు. 15 నిమిషాల పాటు ఏరియల్ సర్వే చేసిన అనంతరం.. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో దిగి పనులను పరిశీలించారు. ప్రస్తుతం గోదావరిలో ఆరువేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని.. ఇప్పటివరకు 1,132 మీటర్ల కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తయిందని, మరో 150 మీటర్లు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన... 2016 నుంచి పనులు జరుగుతున్నా ఆశించిన పురోగతి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ని షిఫ్టుల్లో పని జరుగుతోందని కేసీఆర్ ప్రశ్నించగా.. ఒక షిప్టులోనే పనులు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీంతో మూడు షిప్టుల్లో పనిచేసి, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వారిని కేసీఆర్ ఆదేశించారు. జూన్ నాటికి బ్యారేజీలో కాంక్రీట్ ఫీడర్ పనులు పూర్తి చేసి, 72 మీటర్ల నీటిమట్టంతో దేవాదుల పంపుహౌస్‌కు నీటిని అందివ్వాలని స్పష్టం చేశారు. మరో పదిహేను రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటికి పనుల్లో వేగం పుంజుకోవాలని సూచించారు. ఎంత వరద వచ్చినా తట్టుకోవాలి.. తుపాకులగూడెం నుంచి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. గోదావరిలో 16.17 టీఎంసీల సామర్థ్యంతో 1.63 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న బ్యారేజీ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ తిలకించి.. నిర్మాణ పనులు చేస్తున్న ఎల్అండ్టీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌లో తనకు చెబుతున్నంత వేగంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగినట్లు కనిపించడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇలాగైతే ఎప్పుడు నీళ్లు అందిస్తామని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. ఎంత వరద వచ్చినా తట్టుకునేలా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ బ్యారేజీకి అవతల మహారాష్ట్ర వైపు ఇబ్బందులు రాకుండా అక్కడి అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అనంతరం కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు బయలుదేరారు. ఫిబ్రవరికల్లా మోటార్లు పెట్టాలి కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటిని తోడే మోటార్లను 2018 ఫిబ్రవరికల్లా బిగించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. పంపుహౌస్ పనులు మందకొడిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదకొండు మోటార్లు నడిచేందుకు అవసరమైన విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా చేయాలంటూ అక్కడే ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పంపుహౌస్‌లకు అవసరమైన విద్యుత్ సరఫరా వ్యవస్థను శరవేగంగా సిద్ధం చేస్తున్నామని సీఎంకు ప్రభాకర్‌రావు తెలిపారు. తాము చేపట్టిన పనుల పురోగతిని వివరించగా.. దానిపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భూసేకరణ చేయండి అనంతరం సీఎం కేసీఆర్ అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. 10.87 టీఎంసీల సామర్థ్యంతో 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ బ్యారేజీ పనులు వేగంగా సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2018 జూన్‌కల్లా ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా.. పనులను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అయితే ఈ బ్యారేజీకి సంబంధించి మంచిర్యాల జిల్లా వైపున్న సుందరశాల గ్రామం వద్ద భూసేకరణ నత్తనడకన సాగుతుండడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రతిపాదికన భూసేకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌ను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ వద్ద జయశంకర్–మంచిర్యాల జిల్లాలను కలిపేలా డబుల్‌లైన్ రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంపుహౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పర్యటనలో కేసీఆర్ వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటల, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎంపీలు బాల్క సుమన్, వినోద్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ఇలా జాప్యమైతే ఎలా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం కేసీఆర్.. తొలిసారిగా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే పలు చోట్ల నిర్మాణ పనులు మెల్లగా జరుగుతుండటాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, అధికారులను నిలదీశారు. ‘‘ఈ పనులు సరిపోవు.. తెలంగాణ రైతాంగానికి మాటిచ్చాను.. నా సంకల్పాన్ని అర్థం చేసుకోండి. ఈ విధంగా పనులు చేస్తే గడువులోగా నీళ్లివ్వడం కష్టమే.. పేరున్న పెద్ద కాంట్రాక్టు కంపెనీలు కూడా ఇలా చేస్తే ఎలా? ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం. పనుల్లో మరింత వేగం పెంచండి. మూడు షిఫ్టుల్లో పనులు జరగాలి. జూన్ నాటికి పంపుహౌస్ పనులు పూర్తయి నీరు పారించాలి. వచ్చే డిసెంబర్‌లోగా బ్యారేజీల పనులు పూర్తి కావాలి. డెడ్‌లైన్‌లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం పనులు పూర్తి చేయాలి. తెలంగాణ రైతాంగం భవిష్యత్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి..’’అని కేసీఆర్ స్పష్టం చేశారు. పర్యటన సాగిందిలా.. భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేసీఆర్ బుధవారం రాత్రే కరీంనగర్‌కు చేరుకున్నారు. గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి.. 10.17 గంటలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తుపాకులగూడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. తర్వాత వరుసగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, సిరిపురం పంపుహౌస్‌ల నిర్మాణ పనులు పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా కాసిపేట పంపుహౌస్ వద్దకు చేరుకుని భోజనం చేశారు. గంటపాటు విశ్రాంతి తీసుకుని.. అక్కడి పనులను పరిశీలించారు. తర్వాత సుందిళ్ల బ్యారేజీని, గోలివాడ పంపుహౌస్ పనులను పరిశీలించారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం ధర్మారం మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించనున్నారు. మిడ్‌మానేరు ఓ గుణపాఠం! గతేడాది భారీ వర్షాలతో వచ్చిన వరదలకు మిడ్‌మానేరు డ్యామ్ వద్ద మట్టికట్ట కొట్టుకుపోయిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పనులు పటిష్టంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాన బ్యారేజీకి కరకట్టలు కలిసే చోట్ల పటిష్టంగా నిర్మించాలని సూచించారు. డ్రోన్లతో భద్రత తుపాకులగూడెం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మిస్తున్న ప్రదేశాలకు అవతలివైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు స్థలం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టామని.. ప్రత్యేక బెటాలియన్లను కూడా అందుబాటులో ఉంచామని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు. -
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
పినపాక(భద్రాద్రి కొత్తగూడెం): మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్య స్నానాలు ఆచరిచండానికి గోదావరిలో దిగిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం చింతలబయ్యారం గ్రామంలో శుక్రవారం వెలుగుచూసింది. గ్రామ శివారులోని గోదావరి ఒడ్డు పై ఉన్న శివాలయంలో పూజలు చేయడానికి వచ్చిన తంతరపల్లి మురళి(18), అల్లు నాగేంద్రబాబు(19), గూడె ప్రేమ్ కుమార్(22), పవన్(18), అనే నలుగురు యువకులు పవిత్ర స్నానమాచరించడానికి గోదావరిలో దిగి ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజఈతగాళ్ల సాహయంతో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.