ఒక్క చుక్కా చేజారొద్దు | Single drop should not loss says kcr | Sakshi
Sakshi News home page

ఒక్క చుక్కా చేజారొద్దు

Published Fri, Dec 8 2017 1:16 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Single drop should not loss says kcr - Sakshi

గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలి.. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల పరిశీలనలో కేసీఆర్‌

తెలంగాణ రైతాంగం భవిష్యత్‌  ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. జూన్‌ నాటికి పంపుహౌస్‌ పనులు పూర్తయి నీరు పారించాలి. పనుల్లో మరింత వేగం పెంచండి. మూడు షిఫ్టుల్లో పనులు చేయండి. – సీఎం కేసీఆర్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ /సాక్షి, పెద్దపల్లి
వచ్చే వర్షాకాలం నుంచి గోదావరి నది నీరు ఒక్క చుక్క కూడా వృథాగా కిందికి పోవద్దని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సాగునీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని.. ఇందుకోసం మూడు షిఫ్టుల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్టు పురోగతిపై కాగితాల్లో చూపిస్తున్న దానికి, సమీక్షల్లో వివరిస్తున్న అంశాలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు పొంతన లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల పరిధిలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపుహౌస్‌లు, దేవాదుల ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను కేసీఆర్‌ పరిశీలించారు. తొలుత ఉదయం కరీంనగర్‌ జిల్లా తీగరాజులగుట్ట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10:17 గంటలకు తుపాకులగూడెం బ్యారేజీ ప్రాంతానికి చేరుకున్నారు. 15 నిమిషాల పాటు ఏరియల్‌ సర్వే చేసిన అనంతరం.. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో దిగి పనులను పరిశీలించారు. ప్రస్తుతం గోదావరిలో ఆరువేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉందని.. ఇప్పటివరకు 1,132 మీటర్ల కాఫర్‌డ్యాం నిర్మాణం పూర్తయిందని, మరో 150 మీటర్లు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన... 2016 నుంచి పనులు జరుగుతున్నా ఆశించిన పురోగతి లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ని షిఫ్టుల్లో పని జరుగుతోందని కేసీఆర్‌ ప్రశ్నించగా.. ఒక షిప్టులోనే పనులు జరుగుతున్నాయని కంపెనీ ప్రతినిధులు వివరించారు. దీంతో మూడు షిప్టుల్లో పనిచేసి, సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని వారిని కేసీఆర్‌ ఆదేశించారు. జూన్‌ నాటికి బ్యారేజీలో కాంక్రీట్‌ ఫీడర్‌ పనులు పూర్తి చేసి, 72 మీటర్ల నీటిమట్టంతో దేవాదుల పంపుహౌస్‌కు నీటిని అందివ్వాలని స్పష్టం చేశారు. మరో పదిహేను రోజుల్లో మళ్లీ వస్తానని, అప్పటికి పనుల్లో వేగం పుంజుకోవాలని సూచించారు.

ఎంత వరద వచ్చినా తట్టుకోవాలి..
తుపాకులగూడెం నుంచి కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. గోదావరిలో 16.17 టీఎంసీల సామర్థ్యంతో 1.63 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న బ్యారేజీ పనులను పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించి.. నిర్మాణ పనులు చేస్తున్న ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్‌లో తనకు చెబుతున్నంత వేగంగా క్షేత్రస్థాయిలో పనులు జరిగినట్లు కనిపించడం లేదని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇలాగైతే ఎప్పుడు నీళ్లు అందిస్తామని ప్రశ్నించారు. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేయాలని, అవసరమైతే ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందిస్తామని చెప్పారు. ఎంత వరద వచ్చినా తట్టుకునేలా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం జరగాలని అధికారులకు సూచించారు. మేడిగడ్డ బ్యారేజీకి అవతల మహారాష్ట్ర వైపు ఇబ్బందులు రాకుండా అక్కడి అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. అనంతరం కన్నెపల్లి పంపుహౌస్‌ వద్దకు బయలుదేరారు.

ఫిబ్రవరికల్లా మోటార్లు పెట్టాలి
కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటిని తోడే మోటార్లను 2018 ఫిబ్రవరికల్లా బిగించాలని అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పంపుహౌస్‌ పనులు మందకొడిగా సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. పదకొండు మోటార్లు నడిచేందుకు అవసరమైన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణాన్ని త్వరగా చేయాలంటూ అక్కడే ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావును సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పంపుహౌస్‌లకు అవసరమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను శరవేగంగా సిద్ధం చేస్తున్నామని సీఎంకు ప్రభాకర్‌రావు తెలిపారు. తాము చేపట్టిన పనుల పురోగతిని వివరించగా.. దానిపై కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు.

భూసేకరణ చేయండి
అనంతరం సీఎం కేసీఆర్‌ అన్నారం బ్యారేజీ పనులను పరిశీలించారు. 10.87 టీఎంసీల సామర్థ్యంతో 1.27 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ బ్యారేజీ పనులు వేగంగా సాగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. 2018 జూన్‌కల్లా ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లేలా.. పనులను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. అయితే ఈ బ్యారేజీకి సంబంధించి మంచిర్యాల జిల్లా వైపున్న సుందరశాల గ్రామం వద్ద భూసేకరణ నత్తనడకన సాగుతుండడంపై కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రతిపాదికన భూసేకరణ పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మిస్తున్న పంపుహౌస్‌ను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ వద్ద జయశంకర్‌–మంచిర్యాల జిల్లాలను కలిపేలా డబుల్‌లైన్‌ రోడ్డును నిర్మించాలని అధికారులకు సూచించారు. అనంతరం సుందిళ్ల బ్యారేజీ, గోలివాడ పంపుహౌస్‌ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పర్యటనలో కేసీఆర్‌ వెంట మంత్రులు హరీశ్‌రావు, ఈటల, ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎంపీలు బాల్క సుమన్, వినోద్‌కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఇలా జాప్యమైతే ఎలా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఇప్పటివరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించిన సీఎం కేసీఆర్‌.. తొలిసారిగా నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అయితే పలు చోట్ల నిర్మాణ పనులు మెల్లగా జరుగుతుండటాన్ని గుర్తించి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు, అధికారులను నిలదీశారు. ‘‘ఈ పనులు సరిపోవు.. తెలంగాణ రైతాంగానికి మాటిచ్చాను.. నా సంకల్పాన్ని అర్థం చేసుకోండి. ఈ విధంగా పనులు చేస్తే గడువులోగా నీళ్లివ్వడం కష్టమే.. పేరున్న పెద్ద కాంట్రాక్టు కంపెనీలు కూడా ఇలా చేస్తే ఎలా? ప్రభుత్వపరంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం. పనుల్లో మరింత వేగం పెంచండి. మూడు షిఫ్టుల్లో పనులు జరగాలి. జూన్‌ నాటికి పంపుహౌస్‌ పనులు పూర్తయి నీరు పారించాలి. వచ్చే డిసెంబర్‌లోగా బ్యారేజీల పనులు పూర్తి కావాలి. డెడ్‌లైన్‌లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ మొత్తం పనులు పూర్తి చేయాలి. తెలంగాణ రైతాంగం భవిష్యత్‌ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రభుత్వం దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కాంట్రాక్టు ఏజెన్సీలు, అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి..’’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

పర్యటన సాగిందిలా..
భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో ప్రాజెక్టు పనుల పరిశీలన కోసం కేసీఆర్‌ బుధవారం రాత్రే కరీంనగర్‌కు చేరుకున్నారు. గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి.. 10.17 గంటలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని తుపాకులగూడెం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. తర్వాత వరుసగా మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంపుహౌస్, అన్నారం బ్యారేజీ, సిరిపురం పంపుహౌస్‌ల నిర్మాణ పనులు పరిశీలించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోడ్డు మార్గం ద్వారా కాసిపేట పంపుహౌస్‌ వద్దకు చేరుకుని భోజనం చేశారు. గంటపాటు విశ్రాంతి తీసుకుని.. అక్కడి పనులను పరిశీలించారు. తర్వాత సుందిళ్ల బ్యారేజీని, గోలివాడ పంపుహౌస్‌ పనులను పరిశీలించారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో ఎన్టీపీసీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని.. రాత్రి అక్కడే బస చేశారు. శుక్రవారం ఉదయం ధర్మారం మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించనున్నారు.

మిడ్‌మానేరు ఓ గుణపాఠం!
గతేడాది భారీ వర్షాలతో వచ్చిన వరదలకు మిడ్‌మానేరు డ్యామ్‌ వద్ద మట్టికట్ట కొట్టుకుపోయిందని సీఎం కేసీఆర్‌ గుర్తు చేశారు. ఆ చేదు అనుభవాన్ని గుణపాఠంగా స్వీకరించి మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల పనులు పటిష్టంగా చేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాన బ్యారేజీకి కరకట్టలు కలిసే చోట్ల పటిష్టంగా నిర్మించాలని సూచించారు.

డ్రోన్‌లతో భద్రత
తుపాకులగూడెం, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మిస్తున్న ప్రదేశాలకు అవతలివైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు స్థలం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. దీంతో ఈ ప్రాంతాల్లో డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టామని.. ప్రత్యేక బెటాలియన్లను కూడా అందుబాటులో ఉంచామని డీజీపీ మహేందర్‌రెడ్డి వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement