సాక్షి, అమరావతి/ధవళేశ్వరం: శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త పెరిగింది. శనివారం సాయంత్రం 6 గంటలకు 87,852 క్యూసెక్కులు చేరుతోంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 41,358 క్యూసెక్కులను దిగువకు వదులు తున్నారు. శ్రీశైలంలో 879.5 అడుగుల్లో 185.56 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి 29,080 క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 31,125 క్యూసెక్కులు దిగువకు వదులుతుండటంతో ఆదివారమూ శ్రీశైలంలోకి వరద ప్రవాహం కొనసాగనుంది. శ్రీశైలం నుంచి విడుదల చేసిన జలాలతో నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 554.9 అడుగుల్లో 220.70 టీఎంసీలకు చేరుకుంది. సాగర్‌కు దిగువన మూసీలో వరద ఉధృతి తగ్గడంతో పులిచింతల్లోకి 7,852 క్యూసెక్కులు వస్తోంది. నీటి నిల్వ 40.63 టీఎంసీలకు చేరింది. ఇక్కడి నుంచి 19,587 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి దిగువకు వదులుతున్న నీటికి పాలేరు, మున్నేరు ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 27,542 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 10,197 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 17,345 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
తగ్గిన గోదావరి వరద
గోదావరిలో వరద ప్రవాహం మరింతగా తగ్గింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద శనివారం రాత్రి నీటి మట్టం 8.80 అడుగులు ఉంది. బ్యారేజి నుంచి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 9,800 క్యూసెక్కులు వదిలారు. 5,91,042 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచి పెట్టారు. భద్రాచలం వద్ద నీటి మట్టం శనివారం సాయంత్రం 6 గంటలకు 32.70 అడుగులకు చేరింది. పోలవరంలో 10.78 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 15.02 మీటర్ల నీటి మట్టాలు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది
Comments
Please login to add a commentAdd a comment