అన్నారం పంపుహౌస్ దగ్గర ఊపందుకున్న పనులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగునీటి ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేయనున్న ప్రతిష్టాత్మక పథకం కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను పొలాలకు మళ్లించేందుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఆదివారం నుంచి సరిగ్గా వంద రోజుల్లో.. అంటే జూలై మూడో వారంలో మేడిగడ్డ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందుకోసం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేందుకు నిర్మిస్తున్న మూడు బ్యారేజీలు, మూడు పంపుహౌజ్‌ల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే బ్యారేజీల పరిధిలో గేట్ల బిగింపు ప్రక్రియ మొదలవగా.. మోటార్లు, పంపులు, డెలివరీ మెయిన్ వంటి వ్యవస్థల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. విదేశాల నుంచి భారీ మోటార్లను ఈ నెలాఖరు నాటికి తెప్పించి బిగింపు ప్రక్రియ మొదలు పెట్టేలా నీటి పారుదల శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
వేగంగా గేట్ల బిగింపు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసిన విషయం తెలిసిందే. అయితే మరింత ముందుగానే ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే జూలై రెండో వారం నుంచే రోజుకు ఒక టీఎంసీని ఎత్తిపోసి.. ఖరీఫ్ ఆయకట్టుకు అందించేలా ప్రాజెక్టు పనులను వేగిరం చేసింది. దీనికి అనుగుణంగా ఇప్పటికే బ్యారేజీలు, పంపుహౌజ్ పనుల్లో 80 శాతం కాంక్రీటు పనులు పూర్తవగా.. మిగతా 20 శాతం పనులను రెండు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పొడవు 1.63 కిలోమీటర్లుకాగా 85 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ముందుగా ఒక టీఎంసీ నీటిని తీసుకునేలా జూన్ నాటికి కనీసం 10 గేట్లు ఏర్పాటు చేసేలా పనులు జరుగుతున్నాయి. మరో వారంలో ఇక్కడ గేట్లు అమర్చే ప్రక్రియ మొదలవనుంది. ఇక అన్నారం బ్యారేజీలో 66 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 6 గేట్ల ఏర్పాటు పూర్తయింది. నెలాఖరుకు మొత్తంగా 20 గేట్లు బిగించి.. జూన్ నాటికి మిగతా పనులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యుద్ధ ప్రాతిపదికన బ్యారేజీల పనులు
అన్నారం బ్యారేజీ పనులను రూ.1,464 కోట్లతో చేపట్టగా రూ.వెయ్యి కోట్ల మేర పనులు పూర్తికావడం గమనార్హం. మిగతా బ్యారేజీలతో పోలిస్తే çసుందిళ్ల బ్యారేజీ పనులు కాస్త ఆలస్యంగా ప్రారంభమైనా.. అన్నారం బ్యారేజీ తర్వాత దాని పనులే అధిక వేగంతో ముందుకెళ్తున్నాయి. ఈ బ్యారేజీ పొడవు 1.45 కిలోమీటర్లు, నిల్వ సామర్థ్యం 8.5 టీఎంసీలు కాగా... దీనికోసం 81 పిల్లర్లు నిర్మించి 74 రేడియల్ గేట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 4 గేట్లు బిగించగా.. నెలాఖరుకు 15 గేట్లు, వచ్చే నెలలో 25 గేట్ల ఏర్పాటు పూర్తిచేసి జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయనున్నారు. ఈ బ్యారేజీలో మొత్తంగా రూ.1,444 కోట్ల పనుల్లో రూ.800 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి.
మోటార్ల బిగింపునకు సిద్ధం
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని తీసుకునే మూడు పంపుహౌజ్‌ల పరిధిలో ఇప్పటికే మట్టి, కాంక్రీట్ పనులు పూర్తికాగా.. పంపులు, మోటర్ల బిగింపు పనులు నెలాఖరు నుంచి మొదలు కానున్నాయి. మోటార్లు అమర్చేందుకు వీలుగా ఇతర పనులన్నీ వేగంగా పూర్తి చేస్తున్నారు. మూడు పంపుహౌజ్‌లకు అవసరమైన యంత్రాలను జపాన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ఆయా దేశాల కంపెనీల ప్రతినిధులతో నీటి పారుదల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. మోటర్లు ఈనెల చివరికి రాష్ట్రానికి వచ్చే అవకాశముంది.
మేడిగడ్డ పంపుహౌజ్‌లో 40 మెగావాట్ల సామర్థ్యముండే 11 పంపులను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. జూన్ చివరి నాటికి 5 మోటార్లను బిగించనున్నారు. ఈ పంపుల ద్వారా 10,594 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంటుంది. దీనికి దిగువన అన్నారం పంపుహౌజ్‌లో 8 మోటార్లకుగాను జూన్ చివరికి నాలుగు మోటార్లను ఏర్పాటు చేయనున్నారు. సుందిళ్ల వద్ద 9 మోటార్లకుగాను నాలుగు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా జూన్ చివరికి మోటార్లను సిద్ధం చేసి డ్రై, వెట్ ట్రయల్ రన్‌లను నిర్వహించాలని... జూలై రెండో వారంలో గోదావరి ఉధృతి పెరిగే సమయానికి నీటిని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల ద్వారా ఎల్లంపల్లికి తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఎల్లంపల్లి దిగువన శరవేగంగా..
ఎల్లంపల్లి దిగువన ఉన్న నంది మేడారం, రామడుగు (ప్యాకేజీ–6, 8) పంపుహౌజుల్లోనూ ఒక్కో టీఎంసీ నీటిని లిఫ్టు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకేజీ–6లో గ్రావిటీ కెనాల్, టన్నెల్, పంపుహౌజ్‌లు నిర్మించాల్సి ఉండగా.. 88 శాతం పనులు పూర్తయ్యాయి. మొత్తం 124 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు పంపులను ఇప్పటికే సిద్ధం చేశారు. మరో రెండు పంపుల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇక ప్యాకేజీ–7లో మేడారం రిజర్వాయర్‌తో పాటు 11.24 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ప్యాకేజీ–8లో 139 మెగావాట్ల సామర్థ్యంతో 22,036 క్యూసెక్కుల నీటిని మిడ్‌మానేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేలా ఏడు పంపులను అమర్చుతున్నారు. ఇందులో 2 పంపుల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి.
జూలై రెండో వారం నుంచి నీళ్లు..
మిడ్‌మానేరుకు చేరే నీటిని అనంతగిరి, రంగనాయకసాగర్ రిజర్వాయర్ల ద్వారా కొండపోచమ్మ సాగర్ కింది ఆయకట్టుకు ఇచ్చేలా.. గంధమల, బస్వాపూర్‌ల కింది చెరువులను నింపేలా నిర్మిస్తున్న గ్రావిటీ కెనాళ్లు, అప్రోచ్ చానళ్లు, లింక్ కెనాల్స్, టన్నెళ్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ మొదటి వారానికే మెజారిటీ పనులను పూర్తి చేసి.. టెస్ట్ రన్‌లు నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జూన్ చివరి నాటికి లోపాలను సరిదిద్దుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 16 నాటికి సాగునీటిని తరలించాలని దిశానిర్దేశం చేశారు. వంద రోజుల కౌంట్‌డౌన్ పెట్టిన నేపథ్యంలో.. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అటు లైవ్ కెమెరాల ద్వారా, ఇటు అధికారుల ద్వారా సమీక్షిస్తున్నారు.
కాళేశ్వరానికి సీడబ్ల్యూసీ చైర్మన్
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ మసూద్ హుస్సేన్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఆదివారం హైదరాబాద్ రానున్న ఆయన.. సోమవారం ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, పంపుహౌజ్‌ల పనులను పరిశీలించే అవకాశముందని నీటి పారుదల వర్గాలు తెలిపాయి. ఆయనతో పాటు సీడబ్ల్యూసీ సీఈ నవీన్‌కుమార్ సైతం ఈ పర్యటనలో పాల్గొననున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం నుంచి కీలకమైన కాస్ట్ అప్రైజల్, ఇరిగేషన్ ప్లానింగ్ వంటి రెండు, మూడు అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలో మసూద్ హుస్సేన్ పర్యటన కీలకం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment