ఎత్తిపోతల పథకం.. సీమకు శరణ్యం  | YSR kadapa People Support To Rayalaseema Lift Irrigation Project | Sakshi
Sakshi News home page

ఎత్తిపోతల పథకం.. సీమకు శరణ్యం 

Published Wed, Jul 14 2021 9:46 AM | Last Updated on Wed, Jul 14 2021 9:51 AM

YSR kadapa People Support To Rayalaseema Lift Irrigation Project - Sakshi

శ్రీశైలం ప్రాజెక్టు

సాక్షి, కడప: శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో తెలంగాణ ప్రభుత్వం దిగువకు తోడేస్తుండడంతో కరువుకు నిలయమైన వైఎస్సార్‌ జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే రాయలసీమ, ముఖ్యంగా వైఎస్సార్‌ జిల్లాతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సాగు, తాగునీటి కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఏడాది భారీ వర్షాలు కాకుండా సాధారణ వర్షపాతం నమోదయ్యే పక్షంలో దిగువ జిల్లాలకు ముఖ్యంగా వైఎస్సార్‌  జిల్లాకు నీటి ఇక్కట్లు తప్పవు. గత రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపడంతో లక్షలాది ఎకరాలలో పచ్చని పంటలు కళకళలాడాయి.

అప్పట్లో కృష్ణా జలాల  కంటే తుంగభద్ర క్యాచ్‌మెంట్‌ ఏరియాల్లోని వర్షపు నీరే తాము వాడుకున్నామని ఈ ప్రాంత సాగు నీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రాబోయే కాలంలో వర్షాలు తగ్గుముఖం పట్టి తెలంగాణ ప్రభుత్వం ఇదే వైఖరితో ముందుకు సాగితే జిల్లా మళ్లీ కరువు కోరల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వరద సమయంలో త్వరితగతిన నీటిని తెచ్చుకుని ప్రాజెక్టులు నీటితో నింపాలన్న ఉద్దేశంతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టింది. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకమే శరణ్యమని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.  

జిల్లాలో  సాగునీటి వనరుల పరిస్థితి 
జిల్లాలో తెలుగుగంగ పరిధిలోని బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌తోపాటు సబ్సిడరీ రిజర్వాయర్‌–1, సబ్సిడరీ రిజర్వాయర్‌–2, గండికోట, మైలవరం, వామికొండ, సర్వరాయసాగర్, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, పైడిపాలెం, లోయర్‌ సగిలేరు, బుగ్గవంక, అన్నమయ్య ప్రాజెక్టు, వెలిగల్లు, పింఛా ప్రాజెక్టులతోపాటు కేసీ కెనాల్‌  ఉండగా, వీటి పరిధిలో 94.489 టీఎంసీల నీరు అవసరముంది. ఇందులో నాలుగు ప్రాజెక్టులు మినహా మిగిలిన 10 సాగునీటి వనరులు కృష్ణా, తుంగభద్ర  జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. వీటి పరిధిలో 86.989 టీఎంసీల నీరు అవసరముంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక రెండు సంవత్సరాల్లో జిల్లాతోపాటు ఎగువ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. కృష్ణానదితోపాటు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం పరిధిలోని తుంగభద్ర నది సైతం పొంగి ప్రవహించాయి. తుంగభద్ర నీళ్లు పెద్ద ఎత్తున కృష్ణాలో కలిశాయి.

దీంతో శ్రీశైలం నుంచి భారీ స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేశారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను ప్రభుత్వం నీటితో నింపింది. గండికోటలో పూర్తి సామర్థ్యం 26.850 టీఎంసీల నీటిని నిల్వ పెట్టింది. తెలుగుగంగ ప్రాజెక్టు పరిధిలోని సాగునీటి వనరులకు 18 టీఎంసీలు, కేసీ కెనాల్‌కు సుమారు 10 టీఎంసీల నీటిని తరలించారు. దీంతో జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, కడప తదితర నియోజకవర్గాల పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. భూగర్భ జలాలు పెరిగి బోరు బావులకు నీరు చేరింది. అదనపు ఆయకట్టుకు సాగునీరు, తాగునీటి ఇబ్బందులు తీరాయి.   

తెలంగాణ వైఖరితో  జిల్లా వాసుల్లో ఆందోళన 
ఈ ఏడాది ముందస్తు వర్షాలు ప్రారంభం కావడంతో సకాలంలో కృష్ణా నీరు దిగువకు చేరి జిల్లాలోని ప్రాజెక్టులు నీటితో నిండితే గత రెండేళ్లు లాగే సాగునీటి ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్న జిల్లా వాసులకు తెలంగాణ వైఖరి మరింత ఆందోళన కలిగిస్తోంది. శ్రీశైలంలో నామమాత్రపు నీరు ఉన్నా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు త్వరితగతిన నిండి రాయలసీమ జిల్లాలతోపాటు వైఎస్సార్‌ జిల్లాకు సకాలంలో నీరొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ స్థానికంగా సాధారణ వర్షపాతం నమోదై ఎగువ రాష్ట్రాల్లో నామమాత్రపు వర్షాలు కురిస్తే వైఎస్సార్‌ జిల్లాకు కృష్ణా జలాలు రావడం గగనం.  

ఎత్తిపోతల పథకం తప్పనిసరి..
వాస్తవానికి గత రెండేళ్లలోనూ కృష్ణానది నీరు కాకుండా జిల్లా ప్రాజెక్టులకు తుంగభద్ర నీరే వాడుకున్నట్లు సాగునీటి రంగ నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర పరిధిలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గత రెండేళ్లలో భారీ వర్షాలు కురిశాయి. ఆ నీరు కృష్ణానదిలో చేరింది. ఆ మేరకు మాత్రమే జిల్లాలోని ప్రాజెక్టులకు నీటిని వాడినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంతేగానీ కృష్ణా జలాలు వాడింది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాయలసీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీటి ఇక్కట్లు తలెత్తే విధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించడంపై ఈ ప్రాంత వాసుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం తప్పనిసరి అని జిల్లా వాసులు పేర్కొంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ప్రధాన కాలువల ఆధునికీకరణ, ఎత్తిపోతల పథకం ద్వారా వరద కాలంలో నీటిని తరలించుకునే అవకాశం ఉంటుంది.  ఒప్పందం మేరకు 15 టీఎంసీల కృష్ణా జలాలను వైఎస్సార్‌ జిల్లా మీదుగా చెన్నై తాగునీటి అవసరాలకు తరలించాల్సి ఉంది. దీంతోపాటు నెల్లూరు  జిల్లాలోని 78 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల రిజర్వాయర్‌తోపాటు అదే జిల్లాలోని కండలేరు రిజర్వాయర్‌కు జిల్లా మీదుగానే కృష్ణాజలాలను తరలిస్తున్నారు. తెలంగాణ వైఖరితో రాయలసీమ జిల్లాలతోపాటు అటు నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఇటు ప్రకాశం జిల్లాకు నీటి కష్టాలు తప్పవన్నది నిపుణుల వాదన.  

నీటిని వృథా చేయడం నేరం 
నీరు జాతీయ సంపద. దానిని వృథా చేయడం నేరం. అవసరం లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నీటిని వృథా చేస్తోంది. శ్రీశైలం నీటిని దిగువకు వదలడం వల్ల  రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.  – దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన సమితి కన్వీనర్, కడప 

తెలంగాణ ప్రభుత్వం నీటి విడుదలను వెంటనే ఆపాలి  
శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న కొద్దిపాటి నీటిని తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో దిగువకు వదలడం వల్ల వైఎస్సార్‌ జిల్లాకు తీరని నష్టం వాటిల్లుతుంది.   వెంటనే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం నుంచినీటి విడుదలను ఆపాలి.  
– సంబటూరు ప్రసాద్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్, కడప 

మనం వాడుకున్నది తుంగభద్ర నీరే 
తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో ఉన్న కాస్త నీటిని విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో దిగువకు తోడేయడం సరికాదు. గత రెండేళ్లలో భారీ వర్షాలు కురవడంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నింపుకున్నాం. మనం వాడుకున్నది కృష్ణా జలాలు కాదు. తుంగభద్ర నీరు మాత్రమే.  
– వెంకట్రామయ్య, ఈఈ, ఇరిగేషన్, కడప  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement