ఎల్లెల్సీ నీటి వాటాలో కోత | Ellelsi water erosion stock | Sakshi
Sakshi News home page

ఎల్లెల్సీ నీటి వాటాలో కోత

Published Thu, Nov 13 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

ఎల్లెల్సీ నీటి వాటాలో కోత

ఎల్లెల్సీ నీటి వాటాలో కోత

అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు రంగం సిద్ధం
 
 ఆదోని : తుంగభద్ర దిగువ కాలువ రాష్ట్ర నీటివాటాలో దాదాపు ఒక టీఎంసీ నీటిని కోత విధించారు. కేసీకి కేటాయించిన నీటి వాటాలో కూడా మరో 0.3 టీఎంసీ కోతపెట్టారు. బుధవారం జలాశయం కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది. జలాశయంలో నీటి నిల్వ, ఇప్పటి వరకు ఆయా కాలువలకు సరఫరా చేసిన నీటిని, ఉన్న నీటిని రబీ పంటలకు సరఫరా చేసే అంశాలను బోర్డు సమీక్షించింది.

జిల్లా సాగునీటి శాఖ ఎస్‌ఈ నాగేశ్వర రావు, ఎల్‌ఎల్సీ, హెచ్‌ఎల్సీ ఎసీఈలు, కర్ణాటక, తుంగభద్ర బోర్డు ఎస్‌ఈలు సమావేశంలో  పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం జూన్‌లో జలాశయానికి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అంచనావేసిన బోర్డు దిగువ కాలువకు రాష్ట్ర వాటా కింద 16.302 టీఎంసీలనీటిని కేటాయించింది. అయితే అంచనాకంటే రెండు టీఎంసీలు తక్కువగా 138టీఎంసీలు మాత్రమే జలాశయానికి చేరడంతో నీటి వాటా కేటాయింపును 15.62 టీఎంసీలకు కుదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఖరీఫ్ పంటలకు ఇప్పటివరకు దిగువ కాలువకు కేటాయించిన నీటి వాటాలో 6.2టీఎంసీలు వినియోగించుకున్నట్లు తుంగభద్ర బోర్డు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా నీటి వాటా కేటాయింపును పరిగణలోకి తీసుకుంటే 9.36 టీఎంసీలు మాత్రమే జలాశయంలో ఎల్‌ఎల్సీ నీటివాటా నీరు నిల్వ ఉంది. ఖరీఫ్‌లో కాలువ కింద సాగుచేసిన వరి, మిరప, పత్తి పంటలకు మరో పక్షం రోజుల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.

ఇందుకు మరో టీఎంసీ నీరు అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు. తాగు, సాగు నీటి అవసరాలకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు మరో టీఎంసీ నీటిని మళ్ళించాల్సి ఉంది. వేసవిలో జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు 3టీఎంసీలు పోగా జలాశయంలో 4.36 టీఎంసీల నీరు మాత్రమే మిగులుతుంది. ప్రవాహ నష్టం, నీటి ఆవిరి రూపంలో మరో టీఎంసీ నీటికి కోతపడుతుంది. దీంతో రబీ పంటలకు 3.36 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.  
 అనంతపురం జిల్లాకు

 నీటి మళ్లింపు.. ?
 తుంగభద్ర దిగువ కాలువ, కేసీ కెనాల్‌కు కేటాయించిన నీటిని అనంతపురం జిల్లాకు మళ్ళించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు బోర్డుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఒత్తిళ్ళకు తలొగ్గి నీటి మళ్ళింపుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించాల్సి ఉంది.

ప్రస్తుతం ఎల్‌ఎల్సీ వాటాకింద రబీ సీజన్‌లో 3.36 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో నుంచి అనంతపురం జిల్లాకు నీటిని మళ్ళిస్తే ఎల్‌ఎల్సీ, కేసీ కెనాల్ కింద రబీ పంటలకు సాగునీరందించడం కష్టసాధ్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రబీ పంటలకు సాగునీరు అందిస్తారో లేదోనని దిగువ కాలువ రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement