the share of water
-
ఆలస్యం.. అమృతం.. విషం!
కర్నూలు(అర్బన్): కేసీ కెనాల్ ఆయకట్టును ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలస్యంగా మేలుకున్నా.. రైతులకు మాత్రం నష్టం తప్పేలా లేదు. టీబీ డ్యామ్ నుంచి 6.50 టీఎంసీల నీటి వాటాను రాబట్టాల్సి వుండగా, కేవలం 2.50 టీఎంసీల నీరు విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఈఎన్సీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయానికి చేరలేదు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో కేవలం 1.19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ వుంది. ఈ నీటిలో కర్నూలు తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ నీటిని నిల్వ వుంచి మిగిలిన 0.19 టీఎంసీల నీటిని మాత్రమే కేసీ ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం వుంది. ఇప్పటికే ఆర్డీఎస్ నుంచి వస్తున్న నీటితో పాటు సుంకేసులలోని నీటిని కలిపి ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీటిని కేసీకి విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయంలోని 0.19 టీఎంసీల నీరు రెండు రోజులకు మించి ఆయకట్టుకు అందే పరిస్థితి లేదు. టీబీ డ్యామ్ నుంచి 2.50 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించి డ్యామ్ అధికారులకు లేఖ రాయడం, అందుకు వారు స్పందించి నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయడం.. ఈ తతంగమంతా జరిగేందుకు కనీసం 15 రోజులు పడుతుందనేది సాగు నీటి శాఖ అధికారులే చెబుతున్నారు. తద్వారా నీటి విడుదలలో చోటుచేసుకునే జాప్యం వల్ల పంటలు వాడుముఖం పట్టనున్నాయి. మొత్తం మీద కేసీ ఆయకట్టుకు ఇంకా ప్రమాదం పొంచి ఉందనేది అర్థమవుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్ అధికారుల ఇండెంట్ అవసరం.. టీబీ డ్యామ్ నుంచి నీటి విడుదలకు కర్నూలు, పాలమూరు జిల్లాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు పరస్పరం ఒక అవగాహనకు వచ్చి ఇండెంట్ పెట్టాల్సి వుంది. మన జిల్లా అవసరాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలు కూడా ఈ నీటితో ముడిపడి వున్నాయి. ఈఎన్సీ నుంచి నీటి విడుదల ఉత్తర్వులు ఇక్కడకు వచ్చిన అనంతరం మన అవసరాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని 2.50 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఇండెంట్‌ను టీబీ డ్యాం అధికారులకు పంపాల్సి వుంటుంది. ముందే స్పందించి ఉంటే.. వాస్తవానికి కేసీ కెనాల్ ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై ప్రభుత్వం ముందే స్పందించాల్సి ఉండింది. అయితే, కేసీ ఆయకట్టుతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకొని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు కనీసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఒకటికి, రెండు సార్లు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలపై స్పందించని ప్రభుత్వం హెచ్ఎల్సీకి నీటిని విడుదల చేసే సమయంలో కర్నూలు జిల్లా రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి కంటి తుడుపు చర్యగా 2.50 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది. అయితే ప్రస్తుతం టీబీ డ్యామ్ నుంచి విడుదల కానున్న 2.50 టీఎంసీ నీరు కూడా కేసీ ఆయకట్టుకు ఫిబ్రవరి వరకు ఆదుకోవడంతో పాటు తెలంగాణ ప్రాంతాల్లోని సాగు, తాగునీటి అవసరాలకు సరిపోతే భవిష్యత్తులో కర్నూలు నగర ప్రజల దాహార్తి ప్రశ్నార్థకంగా మారనుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
ఎల్లెల్సీ నీటి వాటాలో కోత
అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు రంగం సిద్ధం ఆదోని : తుంగభద్ర దిగువ కాలువ రాష్ట్ర నీటివాటాలో దాదాపు ఒక టీఎంసీ నీటిని కోత విధించారు. కేసీకి కేటాయించిన నీటి వాటాలో కూడా మరో 0.3 టీఎంసీ కోతపెట్టారు. బుధవారం జలాశయం కార్యాలయంలో బోర్డు సమావేశం జరిగింది. జలాశయంలో నీటి నిల్వ, ఇప్పటి వరకు ఆయా కాలువలకు సరఫరా చేసిన నీటిని, ఉన్న నీటిని రబీ పంటలకు సరఫరా చేసే అంశాలను బోర్డు సమీక్షించింది. జిల్లా సాగునీటి శాఖ ఎస్ఈ నాగేశ్వర రావు, ఎల్ఎల్సీ, హెచ్ఎల్సీ ఎసీఈలు, కర్ణాటక, తుంగభద్ర బోర్డు ఎస్ఈలు సమావేశంలో పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం జూన్‌లో జలాశయానికి 144 టీఎంసీల నీరు చేరవచ్చని అంచనావేసిన బోర్డు దిగువ కాలువకు రాష్ట్ర వాటా కింద 16.302 టీఎంసీలనీటిని కేటాయించింది. అయితే అంచనాకంటే రెండు టీఎంసీలు తక్కువగా 138టీఎంసీలు మాత్రమే జలాశయానికి చేరడంతో నీటి వాటా కేటాయింపును 15.62 టీఎంసీలకు కుదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఖరీఫ్ పంటలకు ఇప్పటివరకు దిగువ కాలువకు కేటాయించిన నీటి వాటాలో 6.2టీఎంసీలు వినియోగించుకున్నట్లు తుంగభద్ర బోర్డు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం కొత్తగా నీటి వాటా కేటాయింపును పరిగణలోకి తీసుకుంటే 9.36 టీఎంసీలు మాత్రమే జలాశయంలో ఎల్ఎల్సీ నీటివాటా నీరు నిల్వ ఉంది. ఖరీఫ్‌లో కాలువ కింద సాగుచేసిన వరి, మిరప, పత్తి పంటలకు మరో పక్షం రోజుల పాటు నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరో టీఎంసీ నీరు అవసరం కావచ్చని అంచనా వేస్తున్నారు. తాగు, సాగు నీటి అవసరాలకోసం గాజులదిన్నె ప్రాజెక్టుకు మరో టీఎంసీ నీటిని మళ్ళించాల్సి ఉంది. వేసవిలో జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలకు 3టీఎంసీలు పోగా జలాశయంలో 4.36 టీఎంసీల నీరు మాత్రమే మిగులుతుంది. ప్రవాహ నష్టం, నీటి ఆవిరి రూపంలో మరో టీఎంసీ నీటికి కోతపడుతుంది. దీంతో రబీ పంటలకు 3.36 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతపురం జిల్లాకు నీటి మళ్లింపు.. ? తుంగభద్ర దిగువ కాలువ, కేసీ కెనాల్‌కు కేటాయించిన నీటిని అనంతపురం జిల్లాకు మళ్ళించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు బోర్డుపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు ఒత్తిళ్ళకు తలొగ్గి నీటి మళ్ళింపుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించాల్సి ఉంది. ప్రస్తుతం ఎల్ఎల్సీ వాటాకింద రబీ సీజన్లో 3.36 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో నుంచి అనంతపురం జిల్లాకు నీటిని మళ్ళిస్తే ఎల్ఎల్సీ, కేసీ కెనాల్ కింద రబీ పంటలకు సాగునీరందించడం కష్టసాధ్యమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో రబీ పంటలకు సాగునీరు అందిస్తారో లేదోనని దిగువ కాలువ రైతులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.