
ఆలస్యం.. అమృతం.. విషం!
కర్నూలు(అర్బన్): కేసీ కెనాల్ ఆయకట్టును ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలస్యంగా మేలుకున్నా.. రైతులకు మాత్రం నష్టం తప్పేలా లేదు. టీబీ డ్యామ్ నుంచి 6.50 టీఎంసీల నీటి వాటాను రాబట్టాల్సి వుండగా, కేవలం 2.50 టీఎంసీల నీరు విడుదలకు సంబంధించి ప్రభుత్వం ఈఎన్‌సీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇంకా జిల్లా నీటి పారుదల శాఖ కార్యాలయానికి చేరలేదు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో కేవలం 1.19 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ వుంది.
ఈ నీటిలో కర్నూలు తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీ నీటిని నిల్వ వుంచి మిగిలిన 0.19 టీఎంసీల నీటిని మాత్రమే కేసీ ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం వుంది. ఇప్పటికే ఆర్‌డీఎస్ నుంచి వస్తున్న నీటితో పాటు సుంకేసులలోని నీటిని కలిపి ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీటిని కేసీకి విడుదల చేస్తున్నారు. సుంకేసుల జలాశయంలోని 0.19 టీఎంసీల నీరు రెండు రోజులకు మించి ఆయకట్టుకు అందే పరిస్థితి లేదు.
టీబీ డ్యామ్ నుంచి 2.50 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించి డ్యామ్ అధికారులకు లేఖ రాయడం, అందుకు వారు స్పందించి నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయడం.. ఈ తతంగమంతా జరిగేందుకు కనీసం 15 రోజులు పడుతుందనేది సాగు నీటి శాఖ అధికారులే చెబుతున్నారు. తద్వారా నీటి విడుదలలో చోటుచేసుకునే జాప్యం వల్ల పంటలు వాడుముఖం పట్టనున్నాయి. మొత్తం మీద కేసీ ఆయకట్టుకు ఇంకా ప్రమాదం పొంచి ఉందనేది అర్థమవుతోంది.
కర్నూలు, మహబూబ్‌నగర్ అధికారుల ఇండెంట్ అవసరం..
టీబీ డ్యామ్ నుంచి నీటి విడుదలకు కర్నూలు, పాలమూరు జిల్లాలకు చెందిన నీటి పారుదల శాఖ అధికారులు పరస్పరం ఒక అవగాహనకు వచ్చి ఇండెంట్ పెట్టాల్సి వుంది. మన జిల్లా అవసరాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అవసరాలు కూడా ఈ నీటితో ముడిపడి వున్నాయి. ఈఎన్‌సీ నుంచి నీటి విడుదల ఉత్తర్వులు ఇక్కడకు వచ్చిన అనంతరం మన అవసరాలతో పాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో వుంచుకొని 2.50 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఇండెంట్‌ను టీబీ డ్యాం అధికారులకు పంపాల్సి వుంటుంది.
ముందే స్పందించి ఉంటే..
వాస్తవానికి కేసీ కెనాల్ ఆయకట్టును దృష్టిలో ఉంచుకుని నీటి విడుదలపై ప్రభుత్వం ముందే స్పందించాల్సి ఉండింది. అయితే, కేసీ ఆయకట్టుతో పాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో వుంచుకొని జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు కనీసం 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఒకటికి, రెండు సార్లు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలపై స్పందించని ప్రభుత్వం హెచ్‌ఎల్‌సీకి నీటిని విడుదల చేసే సమయంలో కర్నూలు జిల్లా రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావించి కంటి తుడుపు చర్యగా 2.50 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు అంగీకరించింది.
అయితే ప్రస్తుతం టీబీ డ్యామ్ నుంచి విడుదల కానున్న 2.50 టీఎంసీ నీరు కూడా కేసీ ఆయకట్టుకు ఫిబ్రవరి వరకు ఆదుకోవడంతో పాటు తెలంగాణ ప్రాంతాల్లోని సాగు, తాగునీటి అవసరాలకు సరిపోతే భవిష్యత్తులో కర్నూలు నగర ప్రజల దాహార్తి ప్రశ్నార్థకంగా మారనుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.