
ఎట్టకేలకు..
► ప్రభుత్వానికి చేరిన తుమ్మిళ్ల ఎత్తిపోతల డీపీఆర్
► మూడు రిజర్వాయర్లతో డీపీఆర్‌ను ఆమోదించిన ఈఎన్‌సీ
► రూ. 835 కోట్లఅంచనాతో తుమ్మిళ్ల
► ఎత్తిపోతల డీపీఆర్ డీపీఆర్‌కు అనుమతి వస్తే పథకం పనులకు శ్రీకారం
► ఈ ఎత్తిపోతలతో ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లు
► 23వ డిస్ట్రిబ్యూటరీ నుంచి ఆయకట్టులోని 70వేల
► ఎకరాలు సాగులోకి..
జూరాల : మూడు రిజర్వాయర్లతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను ఈఎన్‌సీ ఆమోదించి మంజూరు కోసం ప్రభుత్వానికి పంపారు. దీంతో ఎనిమిది నెలలుగా సర్వే దశలో ఉన్న ఈ పథకం ముందడుగు పడినట్లయింది. దశాబ్దాలుగా ఆర్డీఎస్ ఆయకట్టులో నీళ్లందని రైతులకు శాశ్వత పరిష్కారంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఏర్పడింది. ఆర్డీఎస్ ఆయకట్టులో చివరి ఎకరా వరకు నీళ్లిచ్చేందుకు ప్రతిపాదించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను రూ. 835 కోట్ల అంచనాకు ఈఎన్‌సీ మురళీధర్ ఆమోదించి ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల గ్రామం వద్ద తుంగభద్ర నదీతీరంలో మూడు పంపులతో పంప్‌హౌస్ నిర్మించనున్నారు. ఒక్కో పంపు 10 క్యూమిక్స్ నీటిని తోడే సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నారు. అక్కడినుంచి నీటిని మొదటగా మల్లమ్మ కుంట రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తారు.
మల్లమ్మ కుంట రిజర్వాయర్ నుంచి జూలకల్, వల్లూరుల వద్ద నిర్మించే రెండు రిజర్వాయర్లకు నీటిని మళ్లించి నింపుతారు. మూడు రిజర్వాయర్ల ద్వారా ఆర్డీఎస్ డి-23 నుంచి అలంపూర్ మండల పరిధిలోని చివరి ఎకరాకు నీళ్లందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఎత్తిపోతల ద్వారా ఎనిమిది టీఎంసీల నీటిని 90 రోజుల్లో తుంగభ ద్ర నుంచి పంపింగ్ చేయాలన్నది లక్ష్యం. 70 నుంచి 80వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా డిజైన్ చేశారు. ఆగస్టు మొదటి వారం నుంచి అక్టోబర్ చివరి వరకు నదిలో వరద ఉన్న సమయంలో పంపింగ్‌ను చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించారు.
కర్ణాటకలోని మాన్వి తాలూకా పరిధిలో ఉన్న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి వచ్చే నీళ్లు చివరి దాకా అందని ఆయకట్టు భూములకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పూర్తయితే శాశ్వతంగా నీరందనుంది. మన రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిళ్ల సర్వేను వీఎస్ మ్యాప్ సంస్థకు రూ. 18 లక్షల అంచనాతో జూన్‌లో అప్పగించింది. నాటి నుంచి సర్వే కొనసాగుతూ ఎట్టకేలకు డిసెంబర్ చివరి వారంలో సర్వేను పూర్తి చేశారు. సర్వేకు అనుగుణంగా అంచనాను రూపొందించి రూ.835 కోట్ల డీపీఆర్‌ను సిద్ధం చేశారు.