దేవరపల్లి:గోదావరి జలాలను కృష్ణాజిల్లాకు తీసుకు వెళ్లడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అధికారులు రేయింబవళ్లు కాలువ పనులు పర్యవేక్షిస్తున్నప్పటికీ అడ్డంకులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్యాయ ఏర్పాట్లను చేపట్టింది. ఆగస్టు 15 నాటికి ఏదేమైనా గోదావరి జలాలను కృష్ణాకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తోంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువను పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద ఏర్పాటు చేసిన నాలుగు పంపుల వినియోగించి గోదావరి నీటిని ఎత్తిపోసి నీటిని గుడ్డిగూడెం వద్ద పోలవరం కాలువకు అనుసంధానం చేసి ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకువెళ్లే పనులు వేగంగా జరుగుతున్నాయి.
దీని కోసం గుడ్డిగూడెం 14.806 కిలోమీటరు వద్ద రూ.25లక్షల వ్యయంతో 7 పైపులు ఏర్పాటు చేసి పైపు కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరి జలాలను ఎత్తిపోయటానికి ఎనిమిది పంపులు ఏర్పాటు చేశారు. అయితే తాడిపూడి కాలువ పనులు పూర్తికాకపోవటం, పంటకాలువలు ఏర్పాటు చేయకపోవటంతో మూడు పంపులను మాత్రమే ఉపయోగించి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. మిగిలిన ఐదు పంపుల ద్వారా నీటిని ఎత్తిపోసి పోలవరం కాలువకు అనుసంధానం చేసి తాత్కాలికంగా కృష్ణా జిల్లాకు గోదావరి నీటిని తీసుకువెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోంది.
దాదాపు కల్వర్టు పనులు పూర్తిగావచ్చాయి. దీనికి ఎగువ భాగంలో 1.5కిలోమీటర్ వద్ద పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసే నీటిని పోలవరం కాలువలో అనుసంధానం చేయడానికి భారీ పైపులతో కల్వర్టు ఏర్పాటు చేశారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు 24పంపులు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఈ నెల 15న మూడు పంపులను వినియోగంలోకి తీసుకువచ్చి నీటిని పోలవరం కుడి కాలువకు అనుసంధానం చేయనున్నారు. పట్టిసీమ వద్ద పంపులను ప్రారంభోత్సవం చేసిన అనంతరం సీఎం చంద్రబాబునాయుడు గుడ్డిగూడెం వద్ద ఏర్పాటు చేస్తున్న తాడిపూడి నీరు పోలవరం కుడికాలువకు అనుసంధానం చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
భూములు ఇక ఎడారులే
తాడిపూడి నీరు పోలవరం కాలువకు అనుసంధానం జరిగితే దిగువ ప్రాంతంలోని ఆయకట్టు భూములు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆయకట్టు భూములలో వరినాట్లు ఎండిపోతుండగా ఉన్న నీటిని పోలవరంలోకి మళ్లిస్తే ఈ ప్రాంత రైతులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేసినట్టవుతుందని రైతులు వాపోతున్నారు. 3 పంపుల ద్వారా తాడిపూడి వద్ద ఎత్తిపోస్తున్న నీరు ప్రవహించడానికి కాలువగట్లకు పలుచోట్ల గండ్లు పడుతుండగా 8పంపులు ఒకేసారి వినియోగంలోకి తీసుకువస్తే గట్లు పూర్తిగా తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంత రైతాంగానికి ద్రోహం చేసే పనికి పూనుకున్నారని రైతులు విమర్శిస్తున్నారు.
పట్టిసీమ నాలుగు పంపులతో పాటు తాడిపూడికి సంబంధించిన ఐదు పంపులను ఉపయోగించి 1800 క్యూసెక్కుల నీటిని తాడిపూడి కాలువ ద్వారా పోలవరానికి మళ్లించి కృష్ణాకు తీసుకువె ళ్లటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తాడిపూడి కాలువ ద్వారా సుమారు 2.06 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయవలసి ఉండగా 60 నుంచి 70 వేల ఎకరాలకే సరఫరా చేస్తున్నారు. అన్ని పంపులను వినియోగించి తాడిపూడి ఆయకట్టు భూములకు నీరు సరఫరా చేయకుండా పోలవరానికి అనుసంధానం చేయటంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.