..ప్చ్ | oh! | Sakshi
Sakshi News home page

..ప్చ్

Published Tue, Nov 11 2014 3:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

..ప్చ్ - Sakshi

..ప్చ్

‘ఎన్నాళ్లకెన్నాళ్లకో కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు కలుస్తున్నారు.. తుంగభద్ర నీటి పంపిణీ సక్రమంగా జరిగేలా చూసి కరువు బారి నుంచి అనంతకు కాసింత ఓదార్పు కలిగిస్తారు.. హెచ్చెల్సీ ఆయకట్టుకు మంచి రోజులు రాబోతున్నారుు..’ అని సంబరపడిన జిల్లా రైతులకు నిరాశే మిగిలింది. హెచ్చెల్సీకి ఏటా 32.5 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, పూడిక పేరుతో దామాషా పద్ధతి ప్రకారం అంటూ 22 టీఎంసీలే ఇస్తుంటే ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులు నోరెత్తలేకపోయూరు.

తుంగభద్ర బోర్డులో ఇరు రాష్ట్రాల అధికారులున్నప్పటికీ కర్ణాటకదే పైచేరుు అవుతోంది. సోమవారం నాటి ‘బాబు’ చర్చలతో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశించడం అత్యాశే అని తేలిపోరుుంది. పెత్తనం తుంగభద్ర బోర్డుదే అని అక్కడి సీఎం సిద్ధరామయ్య అంటే.. దానికి మన ముఖ్యమంత్రి సైతం తందానా అన్నారు.

 
  సాక్షిప్రతినిధి, అనంతపురం : తుంగభద్ర బోర్డులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్టాల అధికారులున్నప్పటికీ పెత్తనం అంతా కర్ణాటకదే అవడంతో ఏటా అనంతపురం జిల్లా రైతులు నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్) ద్వారా ఆంధ్రాకు రావల్సిన నీటి కేటాయింపులు సక్రమంగా జరగడం లేదు. 132 టీఎంసీల సామర్థ్యంతో టీబీడ్యాంను నిర్మించారు. హెచ్చెల్సీ కెనాల్ ద్వారా 32.5టీఎంసీల నీళ్లు ఆంధ్రాకు కేటాయించాలని బచావత్  అవార్డు నిర్ణయించింది.

ఈ నీళ్లు మొత్తం సాగునీటి అవసరాల కోసమే కేటాయించారు. ఈ నీటిపై ఆధారపడి అనంతపురంతో పాటు కర్నూలు జిల్లాలోని ఆలూరు బ్రాంచ్ కెనాల్, వైఎస్సార్‌జిల్లాలోని మైలవరం, పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే టీబీ డ్యాంలో పూడిక వల్ల నిల్వ సామర్థ్యం 132 నుంచి 100 టీఎంసీలకు పడిపోయింది. తద్వారా నీటి లభ్యత కూడా 227 టీఎంసీల నుండి 190 టీఎంసీలకు పడిపోయింది. ఈక్రమంలో హెచ్చెల్సీకి నికర జలాల కేటాయింపులను పక్కనపెట్టి.. నీటి లభ్యత ఆధారంగా ఏటా కేటాయింపులు చేస్తున్నారు.

ఏటా సగటున  20-22 టీఎంసీలు మాత్రమే దామాషా ప్రకారం సరఫరా చేస్తున్నారు. ఆవిరి, ప్రవాహ నష్టం తదితర కారణాలతో తుదకు  18 టీఎంసీలు మాత్రమే చేరుతోంది. ఇందులో ఏపీ ప్రభుత్వం 8.5 టీఎంసీలు తాగునీటికి కేటాయించింది. తక్కిన 9.5 టీఎంసీలు ఆయకట్టుకు చేరుతున్నాయి. ఈ నీరు  90-1.10 లక్షల ఎకరాలకు మాత్రమే సరిపోతోంది.

ఈక్రమంలో మనకు రావాల్సిన కోటానీటిపై కర్ణాటక సీఎంతో చర్చలు జరిపి రాయలసీమకు న్యాయం చేస్తానని చంద్రబాబు కొద్ది రోజులుగా ఆర్భాటం చేశారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటున్నారంటూ తెగ హంగామా చేశారు. తుదకు కర్ణాటక సీఎంతో భేటీ వల్ల ఎలాంటి ఫలితం రాబట్టలేదని, ఒక్క మాటలో చెప్పాలంటే ‘తుస్సుమనింద’ని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

 భేటిలో తేటతెల్లమైన బాబు ‘వైఖరి’!
 సోమవారం కర్ణాటక సీఎంతో చంద్రబాబు భేటి అయ్యారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ చర్చకు వచ్చిన అంశాలేమిటంటే.. మొదటగా కాలువ ఆధునికీకరణ అంశాన్ని లేవనెత్తారు. డ్యాం నుంచి ఆంధ్రా సరిహద్దులోని 105 కిలోమీటరు వరకూ 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కాలువను 60ఏళ్ల కిందట నిర్మించారని బాబు గుర్తు చేశారు. కానీ ఆ మేరకు నీటి ప్రవాహం ఉండటం లేదని, తద్వారా 105 కిలోమీటరు నుంచి తమకు రావాల్సిన నీటి ప్రవాహంపై ఆ ప్రభావం పడుతోందని వివరించారు.

ప్రస్తుతం తాము 4 వేల క్యూసెక్కుల ప్రవాహంతో కాలువను ఆధునికీకరించామన్నారు. ఈ మేరకు నీటిప్రవాహం రావాలంటే కర్ణాటకలో డ్యాం నుంచి 105 కిలోమీటరు దాకా 6 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండేలా కాలువను ఆధునికీకరించుకోవాలని సీఎం సిద్ధరామయ్యకు సూచించారు. తద్వారా 105 కిలోమీటరుకు వచ్చేసరికి ప్రవాహం 4 వేల క్యూసెక్కులకు సరిపడేలా ఉంటుందన్నారు. ఈ ప్రతిపాదనను సిద్ధరామయ్య తిరస్కరించారు. 6 వేల క్యూసెక్కులకు పెంచడం కుదరదని తేల్చి చెప్పారు.

అయితే 4 వేల క్యూసెక్కులు ప్రవహించేలా కాలువలో పూడికతీతతో పాటు ఆధునికీకరిస్తామని చెప్పారు. ఏపీకి రావల్సిన 32.5 టీఎంసీల నీళ్లు పంపిణీ జరగడం లేదని, కేటాయింపుల ప్రకారం జలాలు ఏపీకి వచ్చేలా చూడాలని కోరారు. దీనికి రామయ్య స్పందిస్తూ...‘కేటాయింపుల కోసం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, కృష్ణా బోర్డులు ఉన్నాయని, డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేసేలా తుంగభద్ర బోర్డు వ్యవహరిస్తుందని చెప్పినట్లు తెలిసింది. ఇందులో ఇరు రాష్ట్రాలు జోక్యం చేసుకోవాల్సిన పనిలేదని సిద్ధరామయ్య తెగేసి చెప్పడంతో చేసేదిలేక చంద్రబాబు ఒకింత అసహనంతో వెనుదిరిగినట్లు సమాచారం.
 
 జనం దృష్టి మళ్లించేందుకేనా?
 రాజధాని ఎంపికలో రాయలసీమ వాసుల మనోభావాలను పట్టించుకోకుండా ఒంటెత్తుపోకడతో చంద్రబాబు కోస్తాలో రాజధానిని ఎంపిక చేశారు. ఈ అంశంలో ‘బాబు’ వైఖరిపై ‘సీమ’వాసుల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకింది. ఈక్రమంలో వ్యూహం ప్రకారం ‘సీమ’ ప్రయోజనాల కోసం తాను పాకులాడుతున్నట్లు బాబు ఎత్తుగడ వేశారు. టీబీడ్యాం పరిస్థితి, నీటి లభ్యత అన్నీ బాబుకు తెలుసు.

టీబీ డ్యాం నుంచి సక్రమంగా నీళ్లు రావాలంటే హెచ్చెల్సీ కాలువకు అనుసంధానంగా మరో వరద కాలువను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉందని సాగునీటిరంగ విశ్లేషకులు కొన్నేళ్లుగా సూచిస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో కర్ణాటక సీఎంతో భేటీకి తెరలేపారు. దీనిపై వారం రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. తీరా సోమవారం భేటీలో కూర్చుని ఎలాంటి ఫలితాలు లేకుండానే వెనుదిరిగారు. తాము ఈ ఫలితం ముందే ఊహించామని, అనుకున్నట్లుగానే జరిగిందని సాగునీటి రంగ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement