పచ్చరంగులో తుంగభద్ర నీరు
హొస్పేట : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగుకు నీటిని అందించే తుంగభద్ర జలాశయంలోని నీరు పచ్చరంగులోకి మారడంతో పాటు దుర్గంధం వెదజల్లుతోంది. తుంగభద్ర డ్యాం ఎగువన ఉన్న కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థపదార్థాలు నేరుగా డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి. అదే విధంగా ఎగువన ఉన్న రైతులు తమ పొలాల్లో పంటలకు వాడుతున్న ఎరువులు, రసాయనిక పదార్థాలు కూడా డ్యాంలోకి వచ్చి చేరుతున్నాయి.
అందువల్లే నీరు పచ్చరంగులోకి మారుతోందని పలువురు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా డ్యాంలో నీరు పచ్చరంగులోకి మారుతున్నా తుంగభద్ర మండలి అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నగర వాసులు తెలిపారు. డ్యాంలోని నీరు పచ్చరంగుగా ఉండడంతో ఈ విషయంపై బుధవారం నగర అసిస్టెంట్ కమిషనర్ పీ.సునీల్ తుంగభద్ర తీరప్రాంత ప్రదేశాలన్ని సందర్శించి నీటిని పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ డ్యాంలో నీరు పచ్చరంగులోకి మారడంతో నీటిని పరీక్షించేందుకు ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. పరీక్ష రిపోర్టు వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.