తుంగభద్రపై దొంగ లెక్కలు | wrong statistics on Tungabhadra | Sakshi
Sakshi News home page

తుంగభద్రపై దొంగ లెక్కలు

Published Tue, Nov 19 2013 2:41 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

wrong statistics on Tungabhadra

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తుంగభద్ర నదీ జలాలను దోచుకోవడంలో తమకు ఎదురులేదని కర్ణాటక మరోసారి నిరూపించుకుంది. విస్తారంగా వర్షాలు కురిసి.. జులై చివరినాటికే తుంగభద్ర డ్యాం పొంగిపొర్లినా.. నీటి లభ్యత తగ్గిందంటూ దొంగ లెక్కలు చెప్పి తొలుత  కేటాయించిన జలాల్లోనే కోతలు వేసింది. అదనపు జలాలు వస్తాయనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఆశలపై నీళ్లుచల్లింది. సమైక్యాంధ్రలోనే టీబీ బోర్డులో కర్ణాటక పెత్తనం ఇలా ఉంటే.. రాష్ట్ర విభజన జరిగితే అది మరింత అధికమవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక-ఆంధప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా హోస్పేటకు సమీపంలో తుంగభద్ర నదిపై 133 టీఎంసీల సామర్థ్యంతో టీబీ డ్యామ్‌ను నిర్మించారు. డ్యామ్‌లో నీటి లభ్యత 230 టీఎం సీలు ఉంటుందని లెక్కలు వేసిన బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీమ్)కు 6.51 టీఎంసీలు, కేసీ(కడప కర్నూలు) కెనాల్‌కు 10 టీఎంసీలు, ఎల్‌ఎల్‌సీ(లోయర్ లెవల్ కెనాల్)కి 24టీఎంసీలు, హెచ్‌ఎల్‌సీ(హైలెవల్ కెనాల్)కి 32.50 టీఎంసీలు కేటాయించింది.
 
 అంటే.. మొత్తమ్మీద టీబీ డ్యామ్ నుంచి 73.10 టీఎంసీల జలాలను మన రాష్ట్రానికి కేటాయించింది. రాయచూరు కెనాల్ సహా కర్ణాటకకు 138.99 టీఎంసీలను కేటాయించింది. కానీ.. డ్యామ్‌లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 100.85 టీఎంసీలకు తగ్గిపోయిందని గతంలో టీబీ బోర్డు నిర్ధారించింది. నీటి లభ్యత కూడా 230 టీఎంసీల నుంచి 150 టీఎంసీలకు తగ్గిపోయిందని లెక్కలు వేసి.. దామాషా పద్ధతిలో నీటిని కేటాయిస్తున్నారు. దాంతో మన రాష్ట్ర కోటా కింద రావాల్సిన 73.10 టీఎంసీల్లో కేవలం 40 నుంచి 50 టీఎంసీలే దక్కుతున్నా యి. ఈ ఏడాది జూన్ 24న సమావేశమైన టీబీ బోర్డు.. డ్యాంలో 150 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కలు కట్టి.. దామాషా పద్ధతిలో హెచ్చెల్సీకి 22.99 టీఎంసీలు, ఎల్‌ఎల్‌సీకి 16.90, కేసీ కెనాల్, ఆర్డీఎస్‌లకు 11.21 టీఎంసీలను కేటాయించింది. అంటే.. మొత్తమ్మీద మన రాష్ట్ర వాటా కింద 51.10 టీఎంసీలను కేటాయించింది. అయితే, ఆ జలాలను కూడా తగ్గించేలా కర్ణాటక ఇప్పుడు ఎత్తులు వేసింది.
 
 విస్తారంగా వర్షాలు కురిసినా..
 తుంగభద్ర పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. సాధారణంగా ఆగస్టు నెలాఖరుకు నిండే టీబీ డ్యాం.. ఈ ఏడాది జూలై ఆఖరునాటికే పొంగి పొర్లింది. దాంతో అదనపు జలాలు రావచ్చని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఏడాది మన రాష్ట్ర వాటా కింద రావాల్సిన జలాల్లో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, ఆర్డీఎస్, కేసీ కెనాల్‌లకు కలిపి 23.30 టీఎంసీలు, కర్ణాటక వాటా కింద 50.70 టీఎంసీలను ఇప్పటికే విడుదల చేశారు. మన రాష్ట్ర వాటా కింద మరో 27.8 టీఎంసీలు, కర్ణాటక వాటా కింద 47.01 టీఎంసీలు విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం డ్యామ్‌లో ఉన్న 83.59 టీఎంసీలు, ఇప్పటిదాకా ఆంధ్ర, కర్ణాటక వినియోగించుకున్న జలాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఏడాది డ్యాంలో కనీసం 157.59 టీఎంసీలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. కానీ.. డ్యామ్‌లో నీటి లభ్యత 144 టీఎంసీలకు పడిపోయిందని టీబీ బోర్డు దొంగ లెక్కలు వేసింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో నీటి లభ్యత తగ్గిందని అధికారికంగా ప్రకటించింది.  సమైక్య రాష్ట్రంలోనే టీబీ బోర్డుపై కర్ణాటక పెత్తనం చేస్తోంటే.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర, తెలంగాణ ప్రాం తాలకు టీబీ డ్యాం నుంచి చుక్కనీళ్లు కూడా వచ్చే అవకాశాలు ఉండవని ఎల్‌ఎల్‌సీ అధికారి ఒకరు ‘సాక్షి’కి స్పష్టం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement