తుంగభద్ర కాల్వ డిజైన్ మారదు
- బోర్డు నిర్ణయం మేరకే నీటి పంపిణీ, ఆధునికీకరణ
- ఏపీ, కర్ణాటక సీఎంల ఉమ్మడి ప్రకటన
సాక్షి, బెంగళూరు: తుంగభద్ర రైట్ బ్యాంక్ కెనాల్ (టీబీఆర్‌బీసీ) ప్రస్తుత డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఉమ్మడిగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల కాల్వ ఆధునికీకరణ జరిగినా భవిష్యత్‌లో తుంగభద్ర నీటి పంపకాలకు సంబంధించి గొడవలు తలెత్తవని వారు అభిప్రాయపడ్డారు.
తుంగభద్ర నదీ జలాల పంపిణీ విషయమై బెంగళూరులోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధుల మధ్య సోమవారం దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిగాయి. చర్చల అనంతరం తొలుత కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ... తుంగభద్ర నీటి పంపకం కోసం ఏర్పాటైన బోర్డు కాల్వ ఆధునికీకరణ విషయమై కూడా నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందేనన్నారు.
ప్రస్తుత చర్చల్లో కుడికాల్వ ఆధునికీకరణ విషయాన్ని మాత్రమే చర్చించినట్లు చెప్పారు. వరద కాలువ విషయం, మరో విషయమంటూ తమ మధ్య చర్చకు రాలేదని స్పష్టం చేశారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుంగభద్ర కుడి కాల్వ ఆధునికీకరణ వల్ల హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా బళ్లారితో పాటు అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆధునికీకరణ విషయమై ‘బోర్డు నిర్ణయం’ తర్వాతే నిధుల విషయంపై స్పష్టత వస్తుందని తెలిపారు.
వ్యవసాయ ఉత్పత్తుల ఆన్‌లైన్ ట్రేడింగ్
చర్చల అనంతరం కర్ణాటకలో వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అక్కడి ప్రభుత్వం అవలంభిస్తున్న విషయాలపై సంబంధిత అధికారులు, కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణభైరేగౌడ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు హోటల్ అశోకాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీడియూతో మాట్లాడుతూ.. కర్ణాటకలో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం అవలంభిస్తున్న ఆన్‌లైన్ ట్రేడింగ్ విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు. దీన్ని ఏపీలో అమలు చేయనున్నామని వెల్లడించారు. ల్యాండ్‌పూలింగ్ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణానికి భూమిని సేకరిస్తున్నామని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. చర్చల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు దేవినేని ఉమ, పరిటాల సునీత పాల్గొన్నారు.