చంద్రబాబు నాయుడుని సన్మానిస్తున్న సిద్ధరామయ్య
బెంగళూరు: తుంగభద్ర కుడి కాలువ ఆధునికీకరణ విషయానికి సంబంధించి కాల్వ డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండబోదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉమ్మడిగా ప్రకటించారు. తుంగభద్ర కుడి కాలువ, హెచ్ఎల్సి కాలువ ఆధునికీకరణ పనులు చేయించడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఆధునికీకరణ కూడా తుంగభద్ర బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వారు తెలిపారు. తుంగభద్ర జలాల విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన చర్చల అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
తుంగభద్ర కుడి కాలువఆధునికీకరణ, కోటా మేరకు నీటి పంపిణీ వ్యవహారం తుంగభద్ర బోర్డు చూసుకుంటుందని వారు స్పష్టం చేశారు. హెచ్ఎల్సీ(తుంగభద్ర ప్రాజెక్టు హైలెవల్ కెనాల్)కి నీటి కేటాయింపు కూడా బోర్డు చూసుకుంటుందని సిద్ధరామయ్య తెగేసి చెప్పారు. చర్చలలో ఇద్దరు సీఎంలతోపాటు రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు చర్చల నిమిత్తం వచ్చిన చంద్రబాబు నాయుడుని సిద్దరామయ్య శాలువతో సత్కరించారు.
**