దిగువకు దిక్కెవరు?
దిగువకు దిక్కెవరు?
Published Mon, Oct 17 2016 12:57 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
- హామీని విస్మరించిన చంద్రబాబు
- ఎల్లెల్సీలో యథేచ్ఛగా జలచౌర్యం
- పట్టించుకోని అధికార పార్టీ నేతలు
- బీడుభూమిగా మారుతున్న ఆయకట్టు
- కాల్వ ఏపీది.. పెత్తనం బోర్డుది
- పర్యవేక్షణ కరువు..అందని నీటివాటా
కర్నూలు సిటీ:
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తుంగభద్ర జలాల వాటాలో నుంచి చుక్క నీరు కూడా చౌర్యం కాకుండా చూస్తాం. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతులు జలచౌర్యం చేయకుండా ఎల్‌ఎల్‌సీ ఆధునీకరణ చేయడమా? లేకపోతే ప్రధాన కాల్వకు బదులు అంతర్గత పైపులు లైన్లు వేయడమా అనేది చూస్తాం
- ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది.
అధికారంలోకి వచ్చాక జల చౌర్యాన్ని అడ్డుకోలేకపోయారు. ఫలితంగా తుంగభద్ర జలాల్లో కర్నూలు జిల్లా తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయంపై తుంగభద్ర బోర్డు అధికారులను టీడీపీ నేతలు నిలదీయలేకపోతున్నారు. దీంతో ఆయకట్టుకు నీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. డ్యాం నిర్వహణకు ఏర్పాటు అయిన బోర్డు మూడు రాష్ట్రాలకు దామాషా ప్రకారం సాగు నీరు అందించాల్సి ఉంది. అయితే బోర్డు కర్ణాటక ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ.. మిగతా రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. టీబీ డ్యాం నుంచి దిగువ కాలువ కింద జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు మండలాలకు చెందిన 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది.
కాల్వ ఏపీది...పెత్తనం బోర్డుది
దిగువ(ఎల్‌ఎల్‌సీ)కాల్వ మొత్తం 398 కి.మీ పొడవు ఉంటుంది. ఇందులో కర్ణాటక పరిధిలో 134 కి.మీ మాత్రమే ఉండేది. మిగతాది ఏపీకి చెందినది. అయినా 135 నుంచి 250 కి.మీ వరకు ఉన్న కాలువ నిర్వహణ బోర్డు పరిధిలో ఉంది. దామాషా ప్రకారం అందాల్సిన వాటా నీరు అందించేందుకు కాల్వపై ఎలాంటి పర్యవేక్షణ లేదు. దీంతో జల చౌర్యం యథేచ్ఛగా సాగుతోంది. ప్రధాన కాల్వకు పైపులు వేసి నీటిని కర్ణాటక రైతులు తోడేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించే అధికారులకు మామూళ్లు ఇస్తున్నారు. ప్రస్తుతం కాల్వకు 690 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంది. అయితే 200 క్యూసెక్కుల నీరు రావడం లేదు. ఏపీలో ఉన్న కాలువపై బోర్డు పర్యవేక్షణ ఉండడంతో ఆ ప్రాంతానికి ఇంజినీర్లు వెళ్లడం లేదు. బోర్డు పరిధిలోని కాలువకు ఏపీకి అప్పగిస్తేనే వాటా మేరకు కొంత మేరకైనా నీరు వస్తుందని ఇంజినీర్లు సాగు నీటి సలహా మండలి సమావేశం దృష్టికి తీసుకపోయినా..ప్రభుత్వం స్పందించడం లేదు.
జలచౌర్యం మితిమీరిపోయింది
– యస్.చంద్రశేఖర్ రావు, జల వనరుల శాఖ ఎస్‌ఈ
దిగువ కాలువ 135 నుంచి 250 కి.మీ వరకు బోర్డు పరిధిలో ఉంది. ఈ కారణంతోనే ఆ ప్రాంతంలో అధిక శాతం జల చౌర్యం జరుగుతోంది ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకపోయాం. ఈ ఏడాది చౌర్యం మితిమీరిపోయింది. దానాని అడ్డుకోవాలనే 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. చౌర్యం అడ్డుకోకపోతే ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడం ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంది.
ఆంధ్ర సరిహద్దు వరకు పైప్‌లైన్ వేయాలి: అబ్దుల్ కరీం, రిటైర్డ్ ఇరిగేషన్ డీఈఈ
ఎల్లెల్సీ వాటా నీరు రావాలంటే డ్యామ్ నుంచి ఏపీ సరిహద్దు వరకు పైప్‌లైన్ వేయాలి. హొళగుంద సమీపంలో రెగ్యులేటర్‌ను నిర్మించి వాటా నీటిని నిలువ చేస్తే రెగ్యులేటర్ నుంచి పైప్‌లైన్ ద్వారా ఎల్లెల్సీలోకి అవసరమైన మేర విడుదల చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఈ రెండు ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్నాయి.
వరి సాగు మరచిపోయాం: గోపాల్, రైతు, నందవరం
ఎల్లెల్సీకి నీరు రాకపోవడంతో వరి సాగు చేయడం మరచిపోయాం. కాలువ కింద ఉన్న పొలాల్లో పత్తి పంట సాగు చేశాం. ఆరేళ్లుగా వరి పంట లేదు. బియ్యాన్ని అంగట్లో కొనుగోలు చేసి తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకపుడు వరి పంట పైర్లతో కళకళలాడేవి. ఇపుడు ఎక్కడ చూసిన మెట్ట పంటలు తప్ప మరొకటి కనిపించదు.
Advertisement
Advertisement