చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
Published Fri, Oct 21 2016 10:24 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
కర్నూలు(సిటీ): తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో ఎల్లెల్సీ ఇంజనీర్లతో జలచౌర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాల్వకు ఉన్న వాటా మేరకు నీరు తీసుకొచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రధానంగా జలచౌర్యం బోర్డు పరిధిలో ఉన్న కాల్వ నుంచే జరుగుతోందన్నారు. దీనిపై ముందు నుంచి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రతి ఏటా వాటా నీటిని ఎగువ ప్రాంతం వారు చౌర్యం చేసి వేలాది ఎకరాల అక్రమ ఆయకట్టును సాగు చేస్తున్నారన్నారు. ఈ చౌర్యం అరికట్టేందుకే 135 నుంచి 324 కి.మీ వరకు నాలుగు శాఖలకు చెందిన అధికారులతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విద్యుత్ శాఖ, జలనవరుల శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాల్లో ఉంటారన్నారు. నిత్యం కాల్వపై పర్యవేక్షిస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి అయినా, చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల పాటు నిరంతరంగా కాల్వపైనే ఈ ప్రత్యేక బృందాలు తిరుగుతూ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నిఘాను విస్తృతం చేసి గస్తీ నిర్వహించాలన్నారు. ఏఈతో పాటు లస్కరు ఖచ్చితంగా ప్రతిరోజు విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఉన్న టీములలో ఉన్న లస్కర్లను తొలగించి, నూతన టీమ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకొని జలచౌర్యాన్ని అరికట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు.
Advertisement