aayakar
-
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం
– ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఆదోని టౌన్: తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అధికారులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. నాలుగు రోజులుగా డీపీలకు నీటి సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేస్తే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఏం కావాలని టీబీపీ డీఈ విశ్వనాథరెడ్డి, ఏఈ కౌలుట్లయ్య, జేఈ గోపీనాథరెడ్డిలను నిలదీశారు. బుధవారం ఎమ్యేల్యే సాయి ప్రసాదరెడ్డి తన అనుచర గణంతో తుంగభద్ర దిగువ కాలువపై పర్యటించారు. సంతెకూడ్లూరు, చిన్న హరివాణం, హానవాలు, మదిర, 104 బసాపురం, నాగనాథనహళ్ళి గ్రామాల ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కాలవపై కలియ తిరిగారు. రైతులు సాగు చేసిన పత్తి, మిరప, వరి పంటల పరిస్థితిని చూసి చలించిపోయారు. సాగు నీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను రైతులు..ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. టీబీపీ అధికారులతో సాయి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా వాటా కింద 650 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. రబీలో ఆరు తడి పంటలకు సమృద్ధిగా నీరు అందేలా చూడాల్సిన భాద్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రస్తుతం కెనాల్లో ప్రవహించే 200 క్యూసెక్కుల నీటితో ప్రజల గొంతులు ఎలా తడపాలి, పంటలకు నీరు ఎలా మళ్లించాలో అధికారులే తేల్చాల్సి ఉందన్నారు. నీటి మళ్లింపులో కోత విధించడంతో రైతులు డీపీలను పగుల గొట్టేందుకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చిన్న హరివాణం కాలువ వద్ద రైతులు పెద్ద ఎత్తున పోగై..ఎమ్మెల్యేకు సమస్యను తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు చంద్రకాంతరెడ్డి, గోవర్ధనరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ప్రతాపరెడ్డి, పంపాపతి తదితరులు పాల్గొన్నారు. -
చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు
కర్నూలు(సిటీ): తుంగభద్ర దిగువ కాల్వ చివరి ఆయకట్టుకు నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చల్లా విజయమోహన్ జలవనరుల శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో ఎల్లెల్సీ ఇంజనీర్లతో జలచౌర్యంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుంగభద్ర దిగువ కాల్వకు ఉన్న వాటా మేరకు నీరు తీసుకొచ్చి చివరి ఆయకట్టు వరకు నీరందించే బాధ్యత ఇంజనీర్లపై ఉందన్నారు. ప్రధానంగా జలచౌర్యం బోర్డు పరిధిలో ఉన్న కాల్వ నుంచే జరుగుతోందన్నారు. దీనిపై ముందు నుంచి ప్రణాళిక లేకపోవడం వల్లే ప్రతి ఏటా వాటా నీటిని ఎగువ ప్రాంతం వారు చౌర్యం చేసి వేలాది ఎకరాల అక్రమ ఆయకట్టును సాగు చేస్తున్నారన్నారు. ఈ చౌర్యం అరికట్టేందుకే 135 నుంచి 324 కి.మీ వరకు నాలుగు శాఖలకు చెందిన అధికారులతో 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. ఇందులో విద్యుత్ శాఖ, జలనవరుల శాఖ, పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాల్లో ఉంటారన్నారు. నిత్యం కాల్వపై పర్యవేక్షిస్తూ అక్రమంగా నీటిని వాడుకుంటున్న వారిపై కేసులు నమోదు చేసి అయినా, చివరి ఆయకట్టుకు నీరందించాల్సిన అవసరం ఉందన్నారు. నెల రోజుల పాటు నిరంతరంగా కాల్వపైనే ఈ ప్రత్యేక బృందాలు తిరుగుతూ చౌర్యాన్ని అరికట్టాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన వాహనాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజాము సమయాల్లో నిఘాను విస్తృతం చేసి గస్తీ నిర్వహించాలన్నారు. ఏఈతో పాటు లస్కరు ఖచ్చితంగా ప్రతిరోజు విధులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం ఉన్న టీములలో ఉన్న లస్కర్లను తొలగించి, నూతన టీమ్‌లను ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు తీసుకొని జలచౌర్యాన్ని అరికట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు.