రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం
రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోం
Published Wed, Oct 26 2016 10:58 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
– ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి
ఆదోని టౌన్: తుంగభద్ర దిగువ కాలువ ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని అధికారులను ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి హెచ్చరించారు. నాలుగు రోజులుగా డీపీలకు నీటి సరఫరాను పూర్తి స్థాయిలో నిలిపేస్తే ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు ఏం కావాలని టీబీపీ డీఈ విశ్వనాథరెడ్డి, ఏఈ కౌలుట్లయ్య, జేఈ గోపీనాథరెడ్డిలను నిలదీశారు. బుధవారం ఎమ్యేల్యే సాయి ప్రసాదరెడ్డి తన అనుచర గణంతో తుంగభద్ర దిగువ కాలువపై పర్యటించారు. సంతెకూడ్లూరు, చిన్న హరివాణం, హానవాలు, మదిర, 104 బసాపురం, నాగనాథనహళ్ళి గ్రామాల ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కాలవపై కలియ తిరిగారు. రైతులు సాగు చేసిన పత్తి, మిరప, వరి పంటల పరిస్థితిని చూసి చలించిపోయారు. సాగు నీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను రైతులు..ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు.
టీబీపీ అధికారులతో సాయి ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రా వాటా కింద 650 క్యూసెక్కుల నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. రబీలో ఆరు తడి పంటలకు సమృద్ధిగా నీరు అందేలా చూడాల్సిన భాద్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రస్తుతం కెనాల్లో ప్రవహించే 200 క్యూసెక్కుల నీటితో ప్రజల గొంతులు ఎలా తడపాలి, పంటలకు నీరు ఎలా మళ్లించాలో అధికారులే తేల్చాల్సి ఉందన్నారు. నీటి మళ్లింపులో కోత విధించడంతో రైతులు డీపీలను పగుల గొట్టేందుకు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యే జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. చిన్న హరివాణం కాలువ వద్ద రైతులు పెద్ద ఎత్తున పోగై..ఎమ్మెల్యేకు సమస్యను తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు చంద్రకాంతరెడ్డి, గోవర్ధనరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ప్రతాపరెడ్డి, పంపాపతి తదితరులు పాల్గొన్నారు.
Advertisement