‘జల’ నిర్బంధం | Water detention | Sakshi
Sakshi News home page

‘జల’ నిర్బంధం

Published Wed, Jul 12 2017 10:49 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

‘జల’ నిర్బంధం

‘జల’ నిర్బంధం

- ఎల్లెల్సీ ప్రవాహానికి అడ్డుకట్ట
- మోకావద్ద రింగ్‌బండ్‌
- కర్ణాటక వాసుల దుశ్చర్య
- తెరుచుకోని ఎస్కేప్‌ చానల్‌ షట్టర్లు
- చర్యలు తీసుకోవాలంటున్న‍ ప్రజలు
 
ఆదోని/హాలహర్వి: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీకి విడుదల అయిన తాగునీటికి కర్ణాటకలోని మోకా వద్ద అడ్డుకట్ట పడింది. ఇసుక సంచులతో కాలువకు అడ్డంగా దాదాపు ఏడు అడుగుల ఎత్తుతో రింగ్‌ బండ్‌ నిర్మించారు. రింగ్‌ బండ్‌కు ఎగువన ఉన్న వంకకు నీరు మళ్లించుకోడానికే కర్ణాటక వాసులు ఇలా చేశారని తెలుస్తోంది. దీంతో జిల్లాకు నీటి చేరిక మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
 
మూడురోజుల క్రితం విడుదల..
జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు, పత్తికొండ నియోజక వర్గాలలో ఎల్లెల్సీ ఆధారంగా 27 ఎస్‌ఎస్‌ ట్యాంకులు నిర్మించారు. ఇందులో ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల కోసం నిర్మించినవి కూడా ఉన్నాయి. నీటి నిల్వలు తగ్గిపోవడంతో  ఎల్లెల్సీపై ఆశలు పెంచుకున్నారు. వర్షాల రాకతో గడిచిన వారం రోజుల్లో తుంగభద్ర జలాశయంలో నీటి మట్టం 12.8 టీఎంసీలకు చేరింది. నీటి చేరిక ఆశాజనకంగా  ఏపీ వాటా కింద ఎల్లెల్సీకి 500 క్యూసెక్కుల నీనరు విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఇండెంట్‌ పెట్టారు. ఇండెంట్‌ మేరకు మూడు రోజుల క్రితం జలాశయం నుంచి బోర్డు అధికారులు నీటిని విడుదల చేశారు. 
 
అడ్డంకులు వీ..
ఎల్లెల్సీ ద్వారా నీటి ప్రవాహం బుధవారానికి  మోకా వద్దకు చేరింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర సరిహద్దు చింతకుంటకు ఆ తరువాత మూడు, నాలుగు రోజుల్లో కోడుమూరు వరకు నీటి ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేశారు. వెంటనే ఎస్‌ఎస్‌ ట్యాంకులకు నీటి పంపింగ్‌ ప్రారంభించాలని అధికారులు భావించారు. అయితే కర్ణాటకలో నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడంతో తాగు నీటి ఇబ్బందులు తప్పవేమోనని అధికారులు, ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ పరిస్థితుల్లో బోర్డు అధికారులు వెంటనే రింగ్‌బండ్‌ను తొలగించాల్సి ఉంది. 
 
షెట్టర్లను తెరవని అధికారులు
ఏపీ వాటా నీటిని జిల్లాకు చేర్చడంపై  తుంగభద్ర బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తాగునీటి కోసం విడుదల అయిన నీరు మోకా వద్దకు చేరింది. అయితే ఎస్కేప్‌ చానల్‌ వద్ద షట్టర్లను మాత్రం అధికారులు తెరవలేదు. ఎగువన ఇసుక సంచులను తొలగించినా ఎస్కేప్‌ చానల్‌ వద్ద నీటి ప్రవాహం మళ్లీ నిలిచిపోతోంది. ఆదోని మండలం హానువాళు 251కిమీ వరకు కాలువ బోర్డు పరిధిలో ఉంది. దీంతో ఆదోని ఎల్లెల్సీ ప్రాజెక్టు అధికారులకు కాలువపై ఎలాంటి అధికారం ఉండదు. అయితే నీటి విడుదల జరిగినా బోర్డు అధికారులు ఎస్కేప్‌ చానల్‌ షట్టర్లు తెరవక పోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. 
 
చర్యలు చేపట్టండి
ఎల్లెల్సీకి అడ్డంగా మోకా వద్ద ఏర్పాటు చేసిన రింగ్‌ బండ్‌ను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి. జిల్లా కలెక్టరు సత్యనారాయణను కోరారు. మోకా వద్ద ఇసుక బస్తాలతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేశారనే సమాచారం రావడంతో వైఎస్సార్‌ నాయకుటు చంద్రకాంత్‌రెడ్డి హైదరాబాదులో ఉన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ఫోన్‌లో సమాచారం అందించారు. ఈ విషయమైజిల్లా కలెక్టరు, నీటి పారుదల శాఖ, బోర్డు ఈఈతో తాను మాట్లాడానని ఎమ్మెల్యే ఫొన్‌లో ‘సాక్షి’కి తెలిపారు. ఈ విషయమై కలెక్టరు బళ్లారి జిల్లా కలెక్టరును కూడా ఫోన్‌లో సంప్రదించి పరిస్థితిని వివరించారని చెప్పారు. రింగ్‌బండ్‌ తొలగింపునకు వెంటనే చర్యలు చేపడుతామని, ఎస్కేప్‌ చానల్‌ వద్ద షట్టర్లను కూడా తెరిపిస్తామని బళ్లారి జిల్లా కలెక్టరు తెలిపారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement