సాక్షి, కర్నూలు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ప్రధాన జలవనరుల్లో ఒకటి తుంగభద్ర డ్యాం. ఈ డ్యాంలో నీటి లభ్యతను బట్టి ఏటా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయించిన వాటాల మేరకు నీటిని కేటాయిస్తారు. అదే విధంగా డ్యాంలోకి వచ్చే నీటి చేరికలను బట్టి డ్యాం ఆధారిత ప్రాంతాల్లో తాగునీరు, సాగు కష్టాలను దృష్టిలో పెట్టుకొని కాలువలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే దశాబ్దన్నర కాలంగా తుంగభద్ర జలాల వినియోగంలో కర్ణాటక ఇష్టారాజ్యంతో జిల్లాకు అన్యాయమే జరుగుతోంది.
కర్ణాటక కాలువలకు అనుమతులు లేకున్నా నీరు..
ఏటా డ్యాంలోకి నీటి చేరికలు మొదలైన తరువాత ముందుగా కర్ణాటక రాష్ట్ర పరిధిలోని సాగు నీటి కాలువలకు నీరు ఇచ్చిన తరువాతనే ఏపీకి చెందిన కాలువలకు ఇస్తున్నారు. అది కూడా ఇండెంట్‌కు అనుమతులు వచ్చేంత వరకు టీబీ బోర్డు అధికారులు చుక్క నీటిని వదలరు. కర్ణాటకకు చెందిన కాలువలకు మాత్రం అనుమతులు లేకపోయినా సాగు కోసం నీటిని విడుదల చేస్తుండడంతో అనంత, కర్నూలు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ జిల్లాల్లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా తాగునీటికి సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తాగునీటి అవసరాలకు సైతం నీరు విడుదల చేయడంలో బోర్డు అధికారులు జాప్యం చేశారు. ఈ లోపు టీబీ డ్యాంకు వరద నీరు వచ్చింది. డ్యాం గరిష్ట స్థాయికి చేరుకొని గేట్లుపైకెత్తి నీటిని నదిలోకి వదిలారు. అయితే హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీ కాలువలకు మాత్రం సాగునీటిని విడుదల చేయకపోవడంపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
కడలికి చేరుతున్న వరద జలాలు..
తుంగభద్ర డ్యాం పూర్తి సామర్థ్యం 100 టీఎంసీలు. ఈ జలాలతో కర్నూలు జిల్లాలోని పశ్చిమ పల్లెలకు తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు ఆధారం. జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సాగు, 8 నియోజకవర్గాల్లో తాగు నీటి అవసరాలకు సైతం తుంగభద్ర జలాలే ఆధారం. జిల్లాకు మొత్తం 1,51,134 ఎకరాల ఆయకట్టుకు నీరు అందాల్సి ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎల్‌ఎల్‌సీ కాలువకు 24 టీఎంసీలు, హెచ్చెల్సీకి 32.5 టీఎంసీలను కేటాయించింది. అయితే దశబ్దన్నర కాలంగా ఎల్‌ఎల్‌సీకి 13, హెచ్చెల్సీకి 18 టీఎంసీలకు మించి అందని పరిస్థితి. డ్యాం నుంచి వరద నీరు దిగువకు ఇప్పటి వరకు 45 టీఎంసీలు వదిలారు. కాల్వలకు మాత్రం ఇవ్వలేదు. ఇదేంటని బోర్డు అధికారులను అడిగితే ఇండెంట్ పెడితే నీటిని ఇస్తామని, వరదల సమయంలో నీరిచ్చినా కేటాయింపుల్లోకే లెక్కిస్తామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment