
సాక్షి, కర్నూలు: కృష్ణ, తుంగభద్ర నదులకు మళ్లీ వరద ప్రవాహం మొదలైంది. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఈ నదులకు వరద వస్తోంది. కృష్ణానదిలో వరద పెరగడంతో బుధవారం మధ్యాహ్నం ఆల్మట్టి డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని నారాయణపూర్‌కు విడుదల చేశారు. అలాగే నారాయణపూర్ నుంచి జూరాలకు 1,13,280 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఎగువ నుంచి వచ్చే నీటిని దృష్టిలో పెట్టుకుని శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి గత నెల 25న కృష్ణా జలాల ప్రవాహం నిలిచిపోయింది. నదులకు ఒకసారి నీటి ప్రవాహం వచ్చాక రెండో సారి అనేది ఇటీవల కాలంలో చాలా అరుదు. ఇప్పటికే కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరి కళకళలాడాయి.
కొంత మేర నీటిని ఆయకట్టుకు వాడుకోగా..డ్యాంలలో నీటి మట్టం క్రమంగా తగ్గుతున్న తరుణంలో మళ్లీ నదులకు వరద రావడం విశేషం. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉందని ఇంజినీరింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తుంగభద్ర డ్యాంకు సైతం ఎగువ నుంచి వరద ప్రవాహం ఉండడంతో పది గేట్లు పైకెత్తి సుమారు 35 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరు నేటి రాత్రికి సుంకేసుల బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది. ఈ నదికి నీటి ప్రవాహం నిలిచిపోయి.. కేసీ ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్న తరుణంలో మళ్లీ వరద వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు సుంకేసుల బ్యాకేజీలో నీటి మట్టం తగ్గడంతో కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయనే ఆందోళన ఉండేది. ప్రస్తుత వరదతో తాగునీటి కష్టాలు సైతం గట్టెక్కుతాయని నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment