సాక్షి, ఆదోని(కర్నూలు) : తుంగభద్ర జలాల వినియోగం.. కర్ర ఉన్నోడిదే బర్రె అన్న చందంగా సాగుతోంది. దిగువ కాలువ పరిధిలో యథేచ్ఛగా జల చౌర్యం జరుగుతోంది. కర్ణాటకలో జల చౌర్యాన్ని గత ప్రభుత్వాలు అడ్డుకోలేకపోయాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతూ జల చౌర్యానికి చెక్ పెడుతోంది. తుంగభద్ర కాలువల భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన వేసిన పైపులను గుర్తించి..వాటిలో కాంక్రీట్‌ను నింపుతున్నారు. కాంక్రీట్ గట్టి పడేంత వరకు 48 గంటల పాటు పోలీసులతో ఎల్లెల్సీ అధికారులు కలిసి కాపలా ఉంటున్నారు. కాంక్రీట్ గట్టి పడిన తరువాత తొలగించడం సాధ్యం కాదు. గతంలో బోర్డు అధికారులు నీటి చౌర్యాన్ని అరికట్టేందుకు యత్నించినా కర్ణాటక రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ సారి పోలీస్ బందోబస్తు మధ్య పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.
నాడు..
తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నా..దిగువ కాలువకు వచ్చేవి అరకొరే. కర్ణాటక రాష్ట్రంలో యథేచ్ఛగా జలచౌర్యం జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకునేవి కావు. రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిపినప్పుడు తూతూ మంత్రంగా పోలీసులతో గస్తీ తిప్పి..తరువాత వదిలేసేవి. దీంతో ఆయకట్టులో సాగుకు ఇబ్బందులు ఏర్పడేవి. సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా తగ్గేది.
నేడు..
తుంగభద్ర డ్యాంలో నిండా నీరున్నాయి..ఎల్లెల్సీకి వాటా నీరు వదులుతున్నా జిల్లా సరిహద్దుకు వచ్చే సరికి తగ్గిపోతున్నాయి. కర్ణాటక ప్రాంతంలో జల చౌర్యాన్ని అరికట్టడానికి ప్రస్తుత ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. అక్రమంగా వేసిన పైపులను గుర్తించి...వాటిని కాంక్రీట్‌తో నింపుతోంది. ఫలితంగా దిగువ కాలువలో నీటి మట్టం పెరుగుతోంది. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది సాగునీటికి ఇబ్బందులు ఉండబోవని, బంగారు పంటలు పండించుకోవచ్చని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇవీ...
- హెచ్చెల్సీ, ఎల్లెల్సీ పరిధిలో రెండువేల చోట్ల జలచౌర్యం జరుగుతున్నట్లు గుర్తించారు.
- భూగర్భంలో 200 చోట్ల శాశ్వత ప్రాతిపదికన పైపులను వేసుకొని పెద్ద ఎత్తున నీటిని మళ్లిస్తున్నట్లు సర్వేలో తేలింది.
- ఈ పైపులను కాంక్రీట్‌తో మూసి వేసి..అది గట్టి పడేంత వరకు దాదాపు 48 గంటల పాటు పోలీసులతో కలిసి కాపలా ఉంచుతున్నారు.
- ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం బుధవారం.. 363 క్యూసెక్కులకు పెరిగింది.
నాలుగో వంతుకు పైగా నీటి చౌర్యం
తుంగభద్ర జలాశయంలో 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని ఈ ఏడాది అధికారులు అంచనా వేశారు. హెచ్చెల్సీకి 25 టీఎంసీలు, ఎల్లెల్సీకి 18.6 టీ ఎంసీలు కేటాయించారు. అయితే హెచ్చెల్సీ 105కి.మీ, ఎల్లెల్సీ 250కి.మీ కర్ణాటక రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి. ఏటా టీఎంసీల కొద్ది నీటిని అక్రమంగా మళ్లించుకుంటూ వేల ఎకరాల్లో అక్రమ ఆయకట్టు సాగు చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం, బోర్డు అధికారులు కూడా నీటి చౌర్యాన్ని పట్టించుకునే వారు కాదు. దీంతో అనంతపురం, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలు కరువు బారిన పడి.. ఏటా వేల ఎకరాలు ఆయకట్టు భూమి బీడుగా మారుతోంది. గత సంవత్సరం ఎల్లెల్సీకి కేటాయించిన 14 టీఎంసీలలో ఆకట్టుకు 8.7 టీఎంసీలు మాత్రమే చేరింది. దాదాపు 5.2 టీఎంసీలకు గండి పడింది. ఎల్లెల్సీ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంలో 1, 56,963 ఎకరాలు, హెచ్‌ఎల్సీ కింద అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో 1,88,777 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది.
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో..
దశాబ్దాలుగా జరుగుతున్న నీటి చౌర్యాన్ని అరికట్టడంతో బోర్డు అధికారులు విఫలం అవుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన జరిగిన తుంగభద్ర జలాల కేటాయింపులో రాష్ట్రం తరఫున చర్చల్లో పాల్గొన్న ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు.. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని సమవేశం దృష్టికి తీసుకువెళ్లారు. నీటి చౌర్యం అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరారు. గత సంవత్సరం జలాల కేటాయింపు, వినియోగాన్ని సమీక్షించి చౌర్యం అయిన నీటిని కర్ణాటక వాటాలో తగ్గించాలని, ఆ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు కూడ నివేదిక సమర్పిస్తామని ఆయన చెప్పారు. ఏ మేరకు నీటి చౌర్యం జరిగిందో ఖచ్చితమైన వివరాలు ఏపీ చేతిలో ఉండడంతో బోర్డు, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులు జల చౌర్యంపై గట్టి చర్యలు తీసుకోడానికి అంగీకరించారు.
ఆ మేరకు కాలువ గట్లపై 24 గంటలపాటు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కాలువల భూగర్భంలో ఏర్పాటు చేసిన పైపులను గుర్తించి కాంక్రీట్‌తో నింపుతున్నారు. మూడు రోజులుగా కాంక్రీట్ నింపే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోర్డు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సురేష్‌రెడ్డి, డీఈఈ సేవ్లానాయక్, ఏఈలు రవి, వెంకటేష్ పోలీసు బందోబస్తు మద్య పనులను పర్యవేక్షిస్తున్నారు. మిగిలిన చోట్ల తాత్కాలికంగా పైపులు, పంపింగ్ మోటార్లు ఏర్పాటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరలో నీటి చౌర్యాన్ని పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. బోర్డు అధికారుల చర్యలు పూర్తిగా ఫలిస్తే సీమ జిల్లాల్లో విస్తరించిన ఎల్లెల్సీ, హెచ్‌ఎల్సీ ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరుందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎల్లెల్సీలో పెరిగిన నీటి మట్టం
బోర్డు సరిహద్దు 250కి.మీ. హానువాళు వద్ద బుధవారం ఎల్లెల్సీలో నీటి మట్టం 363 క్యూసెక్కులు ఉంది. ఈ నెల 16న 287 క్యూసెక్కులకు పడిపోయిన నీటి మట్టం.. ఎగువన చర్యలు చేపట్టడంతో నీటి మట్టం పెరిగినట్లు తెలుస్తోంది. అధికారుల ఇండెంట్ మేరకు బోర్డు సరిహద్దు వద్ద 600 క్యూసెక్కులు ఉండాలి. ఎగువన నీటి చౌర్యంను పూర్తిగా అరికడితే ఆ మేరకు నీటి మట్టం పెరుగవచ్చని ఎల్లెల్సీ అధికారులు, రైతులు ఆశిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment