ఎగువన పరవళ్లు.. దిగువన దుర్భిక్షం  | Tungabhadra Dam Water Illegal Using In Karnataka | Sakshi
Sakshi News home page

ఎగువన పరవళ్లు.. దిగువన దుర్భిక్షం 

Published Mon, Aug 13 2018 10:12 AM | Last Updated on Mon, Aug 13 2018 10:12 AM

Tungabhadra Dam Water Illegal Using In Karnataka - Sakshi

కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఎల్లెల్సీ నీటిని పైపుల ద్వారా అక్రమ ఆయకట్టుకు తరలిస్తున్న దృశ్యం

కర్నూలు సిటీ : జిల్లాలోని పశ్చిమ ప్రాంతాన్ని కరువు వెన్నాడుతోంది. ఏ పల్లెలో చూసినా వలస బతుకుల దీనగాథలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం కలిసిరాక బీడు పడిన భూములు దర్శనమిస్తాయి. తుంగభద్ర డ్యాంలో నీరు నిండుగా ఉన్నా..ఈ ప్రాంతాన్ని దుర్భిక్షం వీడడం లేదు. ప్రభుత్వంలో నూ చలనం రావడం లేదు. జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ కింద 1.4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. డ్యాంలో పూడిక, ఆవిరి పేరుతో యేటా నీటి వాటాను తగ్గిస్తూ తుంగభద్ర బోర్డు అధికారులు ఆయకట్టు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఫలితంగా 40 వేల ఎకరాల ఆయకట్టుకు 

మాత్రమే నీరందుతోంది. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో మాత్రం ఆయకట్టు కంటే ఎక్కువగా సాగవుతోంది. అక్రమ ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందుతున్నాయి. కొందరు బోర్డు అధికారులు రైతుల వద్ద మామూళ్లు తీసుకొని జల చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నారు. అధికారులు వసూలు చేసే మామూళ్లలో కొంత మొత్తం అధికార పార్టీ ప్రజాప్రతినిధులకూ వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.      

ఎందుకీ దుస్థితి.. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమలోని కరువు రావడంతో ఎంతో మంది పోరాటాలు చేసి  తుంగభద్ర డ్యాం సాధించుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు తరువాత కర్ణాటక పరిధిలోకి ఆ డ్యాం వెళ్లింది. ఆ తరువాత కొనేళ్ల పాటు సాగు, తాగు నీరు సమృద్ధిగానే అందింది. అయితే కొన్నేళ్లుగా.. కర్ణాటక రాష్ట్రంలో ప్రవహించే ఎల్లెల్సీ, టీబీ బోర్డు పరిధిలోని కాలువకు ఇరువైపులా ఉన్న వారు అడ్డగోలుగా నీటిని చౌర్యం చేస్తున్నారు. కొందరు ఇంజినీర్ల అక్రమార్జన తోడు కావడంతో పాటు వచ్చిన సొమ్ములో టీడీపీ ప్రజాప్రతినిధులకు వాటాలుగా ఇస్తుండడంతో జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువకు కేటాయించిన నీరు రావడం లేదు. ప్రతి ఏటా  జల చౌర్యాన్ని అడ్డుకుంటామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెబుతన్నా.. ఏ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు  

దిగువకు నీరొచ్చేదేప్పుడు? 
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర జలాశయం. 212 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు నేడు 100 టీఎంసీలకు సామర్థ్యం తగ్గింది. ఈ డ్యాంలో ఎల్లెల్సీ(  కర్ణాటక, ఏపీ)కి  43 టీఎంసీల నీటిని కేటాయించారు. దిగువ కాలువ 1800 క్యుసెక్కుల  ప్రవాహ సామర్థ్య ఉంది. మొత్తం 348.2 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇందులో డ్యాం నుంచి 131.5 కి.మీ వరకు కర్ణాటక పరిధిలోను, 131.5 కి.మీ నుంచి 148.0 కి.మీ వరకు ఏపీలోను, 148.0 కి.మీ నుంచి 156.0 కి.మీ వరకు కర్ణాటక, 156.0 కి.మీ నుంచి 188.0 కి.మీ ఏపీలో, 188.0 కి.మీ నుంచి 190.8 కి.మీ వరకు కర్ణాటక, 190.8 కి.మీ నుంచి 250.580 కి.మీ వరకు ఏపీ పరిధిలోని ప్రవహిస్తోంది. ఏపీ పరిధిలో ప్రవహించే ఈ కాలువ 250.58 కి.మీ వరకు టీబీ బోర్డు పరిధిలో ఉంది.

250.58 కి.మీ దగ్గక ప్రధాన కాలువలో 725 క్యుసెక్కుల నీటి ప్రవాహాన్ని చూపించాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. అయితే బోర్డు పరిధిలోని కాలువ సైట్లో 14 మంది ఇంజినీర్లు పని చేస్తున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారే. 30 కి.మీ నుంచి 156.0 కి.మీ వరకు అధికంగా నానాయకట్టు సాగవుతోంది. మిగతా కాల్వ పరిధిలో కొంత తక్కువగానే సాగవుతోంది. ఈ ఏడాది ఎల్లెల్సీకి 17 టీఎంసీల నీటిని కేటాయించారు. గత నెల 18వ తేదీ నుంచి  నీటిని విడుదల చేస్తున్నా ఇంత వరకు ఏపీ సరిహద్దులో 250 క్యుసెక్కుల నీటి ప్రవాహం కూడా లేదు. ఎమ్మిగనూరు తరువాత వచ్చే కాలువలోని నీటి ప్రవాహం డిస్ట్రిబ్యూటరీలకు కూడా అందడం లేదని ఇంజినీర్లే చెబుతున్నారు. జిల్లాలో వర్షాలు లేకపోవడంతో ఎండుతున్న పంటలకైన ఎల్లెల్సీ నీరు వస్తుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు.  

వసూళ్లు ఇలా...! 
కర్ణాటక పరిధిలోని కాలువ కింద 37,518 హెక్టార్లు(92,670 ఎకరాలు) స్థీరికరించిన ఆయకట్టు ఉంది. అయితే ఇంతకు రెండింతలు అక్రమ ఆయకట్టు ఉంది.  ఖరీఫ్‌లోని ఆయకట్టుకు ఎకరానికి రూ.300నుంచి రూ. 500 వరకు, నానాయకట్టుకు రూ.500నుంచి రూ. 1000 చొప్పున కొందరు ఇంజినీర్లు రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకారం ఒక్క ఖరీఫ్‌లోనే రైతుల నుంచి రూ.5కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.   

కఠిన చర్యలు తీసుకుంటాం: 
తుంగభద్ర జలాశయం నుంచి ఎల్లెల్సీకి 2,500 క్యుసెక్కుల వరకు నీటిని విడుదల చేస్తున్నాం.  కర్ణాటక రాష్ట్రంలో కాలువ ప్రవహించే ప్రాంతం లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉండడంతో  ఎక్కువ నీటిని వాడుకుంటున్న మాట వాస్తవమే.  జల చౌర్యం గతంలో కంటే భాగా తగ్గింది. చింతకుంట దగ్గర 600 క్యుసెక్కుల వరకు కాల్వలో నీటి ప్రవాహం ఉంది. 134 నుంచి 184 కి.మీ మధ్య అధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు ఇటీవల కాల్వపై పర్యటించిన సమయంలో గుర్తించాం.

 ఆయకట్టుకు, నానాయకట్టుకు వేరు వేరు గా డబ్బులను రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇటీవలే లస్కర్లకు, ఇంజనీర్లకు గట్టిగా హెచ్చరికలు జారీ చేశాం. ఒక వేళ ఎక్కడైన వసూలు చేసినా, చేస్తున్నా, రైతులను బలవంతం పెట్టినా ఫిర్యాదు చేస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం.  – వెంకట రమణ, టీబీ డ్యాం ఎస్‌ఈ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement