ఎల్లెల్సీకి నీరు విడుదల
– తాగునీటి కోసమే అంటున్న అధికారులు
– సాగునీటికి ఇప్పట్లో విడుదల లేనట్లే
– టీబీ డ్యాంలో నీటి నిల్వ 40.9 టీయంసీలు
కర్నూలు సిటీ: తాగునీటి అవసరాల కోసం కర్ణాటక రాష్ట్రం హŸస్పేటలోని తుంగభద్ర జలాశయం నుంచి తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)కి గురువారం 690 క్యుసెక్కుల నీరు విడుదల చేశారు. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఇబ్బందులు ఉండడంతో జల వనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్.. టీబీ బోర్డుకు ఇండెంట్ పెట్టారు. టీబీ బోర్డు అధికారులు స్పందించి నీరు విడుదల చేశారు. పశ్చిమ ప్రాంతంలో 15 రోజులుగా ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. సాగు చేసిన పైర్లు వాడు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్లెల్సీకి నీరు విడుదల చేశారనే విషయం తెలియగానే రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే అవి తాగునీటి అవసరాలకేనని అధికారులు ప్రకటించడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. తుంగభద్ర డ్యాంకు 20 రోజుల్లోనే 36 టీ.యం.సీల నీరు వచ్చి చేరినట్లు బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 40.9 టీయంసీలు నిల్వ ఉంది. ఏపీతోపాటుæ కర్ణాటక ప్రభుత్వం ఇండెంట్ పెట్టడంతో బోర్డు అధికారులు స్పందించి ఎల్‌ఎల్‌సీ కాల్వకు ఏపీ వాటా కింద 690, కర్ణాటక వాటా 650 క్యుసెక్కుల నీటిని విడుదల చేశారు. జిల్లా పశ్చిమ ప్రాంతంలోని 165 గ్రామాల ప్రజలకు ఎల్లెల్సీ తాగు నీటి అవసరాలు తీరుస్తోంది. తుంగభద్ర దిగువ కాల్వ కింద జిల్లాలో 1.51 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఏడాది 90 వేల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని ఇటీవలే జల వనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఈ ఏడాది దిగువ కాల్వకు 17.05 టీయంసీల నీటి వాటాగా కేటాయించారు. దీంట్లో నుంచి మొదటి విడతలో 690 క్యుసెక్కుల చొప్పున 10 రోజుల పాటు నీరు విడుదల చేయనున్నారు.