సరిహద్దుల్లో చెక్
► ఉచిత ఇసుక విధానంపై నేడు సమావేశం
► తుంగభద్రపై రెండు రీచ్‌ల్లోనే తవ్వకాలు
► పంచాయతీ కార్యదర్శులకు అధికారాలు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఉచిత ఇసుక విధానంపై జిల్లాలో కసరత్తు మొదలైంది. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన సోమవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జిల్లా నుంచి ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు చెక్‌పోస్టులను ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారు.
అదేవిధంగా తుంగభద్ర నదిపై కేవలం రెండు ఇసుక రీచ్‌ల్లో మాత్రమే తవ్వకాలు చేపట్టేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం. స్థానికంగా వాగులు, వంకల నుంచి ఇసుక తవ్వకాలపై నిబంధనలు సడలించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే గ్రామాల్లో నిర్మాణాల కోసం ఇసుక తవ్వకాల కోసం ముందస్తుగా పంచాయతీ కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలనే నిబంధన పెట్టనున్నట్టు తెలుస్తోంది.
రెండు బోర్డర్ చెక్‌పోస్టులు
జిల్లాకు ఆనుకుని రెండు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణలో ఉచిత ఇసుక విధానం అమల్లో లేదు. కర్ణాటక రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి వస్తే... ఈ రెండు రాష్ట్రాలకు ఇసుక తరలిపోయే ప్రమాదం పొంచి ఉంది. దీనిని అరికట్టేందుకు బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నారు. మైనింగ్ శాఖతోపాటు రెవెన్యూ, పోలీసు విభాగాల ద్వారా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ చెక్‌పోస్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై సోమవారం స్పష్టత రానుంది. అవసరమైతే మరిన్ని చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ముందస్తు
అనుమతి తప్పనిసరి
గ్రామాలకు సమీపంలో ఉన్న వాగులు, వంకల్లో ఇసుక తరలింపునకు పెద్దగా ఆటంకాలు కల్పించకూడదనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇక్కడ ఇసుక తరలింపును సరళతరం చేయనున్నట్టు తెలిసింది. అయితే గ్రామాల్లో ఇసుక తరలించుకునే వారు సంబంధిత పంచాయతీ కార్యదర్శి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన విధించనున్నట్టు సమాచారం. తద్వారా విచ్చలవిడిగా ఇసుక తరలింపు జరగకుండా ఉంటుందనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. నందవరంలోని గురజాల, ఆర్.కొణతపాడు సమీపంలోని తుంగభద్ర నది నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది. పంచలింగాల వద్ద బ్రిడ్జికి 500 మీటర్ల దూరంలో ఉండటంతో పాటు పర్యావరణ అనుమతి లేదు. పూడురు-పడిదెంపాడు రీచ్‌లల్లో మాత్రం ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.
ఇవీ నిబంధనలు...!
= {బిడ్జిలకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలపై పూర్తిగా నిషేధం
= భూగర్భ జలాలు ఇంకిపోయి తాగునీటికి ఇబ్బందులు తప్పవనే ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వరు.
= ఈసీ క్లియరెన్స్ కచ్చితంగా ఉన్న రీచ్‌లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
= బోర్డర్ చెక్‌పోస్టుల ద్వారా ఇసుక రాష్ట్రం దాటకుండా పటిష్ట నిఘా
= ఇసుక రీచ్‌లల్లో నిరంతరం నిఘాకు ఏర్పాట్లు