- వరద కాలువతోనే అనంత, బళ్లారి సస్యశ్యామలం
- అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి
- కర్ణాటక సీఎంను ఏపీ సీఎం కలిసి చర్చిస్తాననడం సంతోషదాయకమే
- క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు చర్చలు జరిపితేనే అనుమానాల నివృత్తికి ఆస్కారం
- బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్‌రెడ్డి
సాక్షి, బళ్లారి : కరువు జిల్లా అయిన అనంతపురం సస్యశ్యామలం కావడంతో పాటు బళ్లారి జిల్లాకు మరింత మేలు జరగాలంటే తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టాలని బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు హెచ్‌ఎల్‌సీ కాలువ నుంచి అదనంగా నీరు తీసుకెళ్లేందుకు కర్ణాటక సీఎంను కలుస్తానని పేర్కొనడం హర్షనీయమన్నారు.
వరద కాలువ నిర్మాణాలపై గత ఏడాదే తాము బళ్లారి తుంగభద్ర ఆయకట్టు రైతుల సమక్షంలో వర్క్ షాపు నిర్వహించామని తెలిపారు. గతంలో తుంగభద్ర డ్యాంలో 133 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు. పూడికవల్ల 100 టీఎంసీలకే పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ నిపుణులు రుద్రస్వామి, గోవిందరాజు వర్క్‌షాపులో పాల్గొని అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూడిక తీయడం సాధ్యం కాదని, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ఏకైక మార్గమని సూచించారని వివరించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోలేదన్నారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టేందుకు బళ్లారి జిల్లాకు చెందిన రైతలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు.
ముందుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చర్చలు జరిపితే బాగుంటుందని వివరించారు. అనంతపురం జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, 22 టీఎంసీలు మాత్రమే అందుతోందని తెలిపారు. అందుకు నీటి నిల్వ తగ్గిపోవడమే కారణమన్నారు. తగ్గిపోయిన నీటిని యధావిధిగా తీసుకోవడంతో పాటు మరింత నీటిని పెంచుకునేందుకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక్కటే ఏకైక మార్గమన్నారు.
ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 270 టీఎంసీల నీరు నది పాలైందన్నారు. వరద కాలువ నిర్మాణాలు చేపడితే అనంతపురం, బళ్లారి జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు.