the Tungabhadra Dam
-
వరద కాలువతోనే అనంత, బళ్లారి సస్యశ్యామలం
వరద కాలువతోనే అనంత, బళ్లారి సస్యశ్యామలం అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి కర్ణాటక సీఎంను ఏపీ సీఎం కలిసి చర్చిస్తాననడం సంతోషదాయకమే క్షేత్ర స్థాయిలో ఎమ్మెల్యేలు చర్చలు జరిపితేనే అనుమానాల నివృత్తికి ఆస్కారం బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్‌రెడ్డి సాక్షి, బళ్లారి : కరువు జిల్లా అయిన అనంతపురం సస్యశ్యామలం కావడంతో పాటు బళ్లారి జిల్లాకు మరింత మేలు జరగాలంటే తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీ కాలువ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టాలని బళ్లారి జిల్లా తుంగభద్ర ఆయకట్టు సలహా సమితి కన్వీనర్ నారా ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం సాక్షితో మాట్లాడుతూ వచ్చే నెల 4న ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు హెచ్ఎల్సీ కాలువ నుంచి అదనంగా నీరు తీసుకెళ్లేందుకు కర్ణాటక సీఎంను కలుస్తానని పేర్కొనడం హర్షనీయమన్నారు. వరద కాలువ నిర్మాణాలపై గత ఏడాదే తాము బళ్లారి తుంగభద్ర ఆయకట్టు రైతుల సమక్షంలో వర్క్ షాపు నిర్వహించామని తెలిపారు. గతంలో తుంగభద్ర డ్యాంలో 133 టీఎంసీల నీరు నిల్వ ఉండేదని తెలిపారు. పూడికవల్ల 100 టీఎంసీలకే పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో పూడిక ద్వారా నష్టపోతున్న నీటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ నిపుణులు రుద్రస్వామి, గోవిందరాజు వర్క్‌షాపులో పాల్గొని అనేక సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు. పూడిక తీయడం సాధ్యం కాదని, ఫ్లడ్‌ఫ్లో కెనాల్ ఏకైక మార్గమని సూచించారని వివరించారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోలేదన్నారు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నిర్మాణం చేపట్టేందుకు బళ్లారి జిల్లాకు చెందిన రైతలు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ముందుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చర్చలు జరిపితే బాగుంటుందని వివరించారు. అనంతపురం జిల్లాకు 32 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, 22 టీఎంసీలు మాత్రమే అందుతోందని తెలిపారు. అందుకు నీటి నిల్వ తగ్గిపోవడమే కారణమన్నారు. తగ్గిపోయిన నీటిని యధావిధిగా తీసుకోవడంతో పాటు మరింత నీటిని పెంచుకునేందుకు ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఒక్కటే ఏకైక మార్గమన్నారు. ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 270 టీఎంసీల నీరు నది పాలైందన్నారు. వరద కాలువ నిర్మాణాలు చేపడితే అనంతపురం, బళ్లారి జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ దిశగా అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందన్నారు. -
ఇప్పటికే 60 టీఎంసీలు నది పాలు
పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నదికి టీబీ డ్యాంకు వరద కాల్వ నిర్మాణాలపై మీనమేషాలు అనంతపురం జిల్లాకు వరద కాలువ నిర్మాణంపై వీడని అశ్రద్ధ సాక్షి, బళ్లారి : ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి ఇప్పటికే 60 టీఎంసీల నీరు నది పాలైంది. డ్యాం పూర్తి కెపాసిటీ 100 టీఎంసీలు. అంటే ఇంకో టీబీ డ్యాం ఉండిఉంటే అది 60 శాంతం నిండి ఉండేది. ఇలా ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది పాలు అవుతోంది. అంటే మరో రెండు టీబీ డ్యాంలు నిండి ఉండేవి. ఇంత స్థాయిలో నీరు నది పాలు అవుతున్నా పాలకులు మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రస్తుతం రోజూ డ్యాం నుంచి లక్షా ఐదు వేల క్యూసెక్కులకు పైగా డ్యాంకు ఉన్న 33 క్రస్టుగేట్లు ద్వారా నదికి వదులుతున్నారు. సోమవారం నాటికే 60 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లితే ఇక ఖరీఫ్ సీజన్ మొత్తంలో మరెన్ని టీఎంసీలు నీరు బయటకు వెళతాయోనన్నది వరుణుడి కృపపై ఆధారపడి ఉంటుంది. అయితే 10 సంవత్సరాలుగా తుంగభద్ర డ్యాంలోకి వచ్చే నీటిని లెక్కిస్తే డ్యాం నుంచి ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లిపోతోంది. తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి చేరుకుని చివరకు సముద్రం పాలవుతోంది. ఇంత పెద్ద స్థాయిలో తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చాలా మేలు చేస్తున్నప్పటికి, తుంగభద్రకు సమీపంలోని బళ్లారి, అనంతపురం జిల్లాలకు డ్యాం నీటిని మరింత సద్వినియోగం చేసుకునే దానిపై పాలకులు దృష్టికి పెట్టకపోవడంతో రెండు జిల్లాలకు చెందిన రైతులు తీవ్ర కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది. ఈ జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి వరద కాల్వ ద్వారా నీటిని తీసుకెళ్లితే కరువు జిల్లాకు కాస్త ఉపయోగపడుతుంది. తుంగభద్ర వరద కాల్వపై గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లా రైతులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వరద కాల్వ నిర్మాణాలపై బళ్లారి జిల్లా రైతులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం తుంగభద్ర డ్యాం సలహా సమితి అధ్వర్యంలో బళ్లారి జిల్లా రైతులు సమావేశం నిర్వహించుకుని వరద కాల్వపై ప్రధానంగా చర్చించారు. ఇందుకు రైతుల నుంచి సానుకూలత వ్యక్తం అయినప్పటికీ పాలకుల్లో కదిలిక లేదు. తుంగభద్ర డ్యాం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో బోర్డు అనుమతితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వరద కాల్వలపై సమీక్ష నిర్వహిస్తే కాల్వ నిర్మాణ ం ఫైలు కదులుతుందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. 10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డ్యాంను సందర్శించినప్పుడు వరద కాల్వ ఏర్పాటు చేస్తే ఏ మేరకు మేలు జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న అనంతపురం జిల్లాకు శాశ్వత కరువు నివారణ జరగాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వరద కాల్వ ఒక్కటే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తి నిండినప్పుడు నెల రోజుల పాటు నది ద్వారా లక్షలాది క్యూసెక్కుల నీరు బయటకు వెళతాయి. అయితే వరద కాల్వ నిర్మిస్తే డ్యాం నుంచి నది ద్వారా బయటకు వెళ్లే నీటిని ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కాలువకు మళ్లిస్తే రెండు జిల్లాలకు చాలా మేలు జరుగుతుంది. ఈ విషయంపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించి వరద కాల్వ నిర్మాణ ంపై చర్యలు తీసుకుంటే అనంతపురం దుర్భిక్ష పరిస్థితులు కాస్త ఉపశమనం పొందేందుకు వీలవుతుందని చెప్పవచ్చు. ఇటీవల తుంగభద్ర డ్యాంను సందర్శించి కాల్వ శ్రీనివాసులు వరద కాల్వ నిర్మాణ ంపై దృష్టి సారిస్తానని మాట ఇవ్వడంతో ఆయన ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తేనే వరద కాాల్వ నిర్మాణానికి సాధ్యం అవుతుందని రైతులు ఆశిస్తున్నారు. -
తుంగభద్రమ్మ గలగల
టీబీ డ్యాంకు ఒకే రోజు 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఒకే రోజు 9 టీఎంసీలు పెరుగుదల వారంలోపు డ్యాం నిండే అవకాశం సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువన ఆగుంబే, మోరాళు, తీర్థహళ్లి, మండగద్దె, శివమొగ్గ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయానికి జలాశయంలో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 95 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో రావడంతో సాయంత్రానికి మరో 9 టీఎంసీల నీరు చేరింది. ఇదే ఇన్‌ఫ్లో నాలుగు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. డ్యాం కెపాసిటీ 103 టీఎంసీలు కాగా ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి ఈనెలాఖరుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంటుందని, ఆగస్టు మొదటి వారంలో గేట్లు ఎత్తివేసి దిగువకు నదికి నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యంగా డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగినప్పటికి అనుకున్న సమయానికి డ్యాం నిండుకుండలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌తో పాటు రబీ పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతాయని అధికారులు అంటున్నారు. డ్యాం కెపాసిటీ 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1623 అడుగులకు చేరుకుంది. మరో 10 అడుగులు నీటిమట్టం పెరిగితే 33 గేట్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.