తుంగభద్రమ్మ గలగల
- టీబీ డ్యాంకు ఒకే రోజు 95 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
- ఒకే రోజు 9 టీఎంసీలు పెరుగుదల
- వారంలోపు డ్యాం నిండే అవకాశం
సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల జీవనాడి తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. ఎగువన ఆగుంబే, మోరాళు, తీర్థహళ్లి, మండగద్దె, శివమొగ్గ ప్రాంతాల్లో కుండపోత వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం ఉదయానికి జలాశయంలో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండగా 95 వేల క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో రావడంతో సాయంత్రానికి మరో 9 టీఎంసీల నీరు చేరింది. ఇదే ఇన్‌ఫ్లో నాలుగు రోజులు పాటు కొనసాగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.
డ్యాం కెపాసిటీ 103 టీఎంసీలు కాగా ప్రస్తుతం వస్తున్న ఇన్‌ఫ్లోను బట్టి ఈనెలాఖరుకు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంటుందని, ఆగస్టు మొదటి వారంలో గేట్లు ఎత్తివేసి దిగువకు నదికి నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి. ఆలస్యంగా డ్యాంలోకి ఇన్‌ఫ్లో పెరిగినప్పటికి అనుకున్న సమయానికి డ్యాం నిండుకుండలా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌తో పాటు రబీ పంటలకు సాగునీరు పుష్కలంగా అందుతాయని అధికారులు అంటున్నారు. డ్యాం కెపాసిటీ 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 1623 అడుగులకు చేరుకుంది. మరో 10 అడుగులు నీటిమట్టం పెరిగితే 33 గేట్లు తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి.