- పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దం
- ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నదికి
- టీబీ డ్యాంకు వరద కాల్వ నిర్మాణాలపై మీనమేషాలు
- అనంతపురం జిల్లాకు వరద కాలువ నిర్మాణంపై వీడని అశ్రద్ధ
సాక్షి, బళ్లారి : ఈ ఏడాది తుంగభద్ర డ్యాం నుంచి ఇప్పటికే 60 టీఎంసీల నీరు నది పాలైంది. డ్యాం పూర్తి కెపాసిటీ 100 టీఎంసీలు. అంటే ఇంకో టీబీ డ్యాం ఉండిఉంటే అది 60 శాంతం నిండి ఉండేది. ఇలా ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది పాలు అవుతోంది. అంటే మరో రెండు టీబీ డ్యాంలు నిండి ఉండేవి. ఇంత స్థాయిలో నీరు నది పాలు అవుతున్నా పాలకులు మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రస్తుతం రోజూ డ్యాం నుంచి లక్షా ఐదు వేల క్యూసెక్కులకు పైగా డ్యాంకు ఉన్న 33 క్రస్టుగేట్లు ద్వారా నదికి వదులుతున్నారు.
సోమవారం నాటికే 60 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లితే ఇక ఖరీఫ్ సీజన్ మొత్తంలో మరెన్ని టీఎంసీలు నీరు బయటకు వెళతాయోనన్నది వరుణుడి కృపపై ఆధారపడి ఉంటుంది. అయితే 10 సంవత్సరాలుగా తుంగభద్ర డ్యాంలోకి వచ్చే నీటిని లెక్కిస్తే డ్యాం నుంచి ఏటా కనీసం 200 టీఎంసీల నీరు నది ద్వారా బయటకు వెళ్లిపోతోంది. తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు శ్రీశైలం, నాగార్జున సాగర్, విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీకి చేరుకుని చివరకు సముద్రం పాలవుతోంది.
ఇంత పెద్ద స్థాయిలో తుంగభద్ర డ్యాం నుంచి వెళ్లిన నీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు చాలా మేలు చేస్తున్నప్పటికి, తుంగభద్రకు సమీపంలోని బళ్లారి, అనంతపురం జిల్లాలకు డ్యాం నీటిని మరింత సద్వినియోగం చేసుకునే దానిపై పాలకులు దృష్టికి పెట్టకపోవడంతో రెండు జిల్లాలకు చెందిన రైతులు తీవ్ర కరువు కాటకాలతో దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా పూర్తిగా కరువు కోరల్లో చిక్కుకుంది.
ఈ జిల్లాకు తుంగభద్ర డ్యాం నుంచి వరద కాల్వ ద్వారా నీటిని తీసుకెళ్లితే కరువు జిల్లాకు కాస్త ఉపయోగపడుతుంది. తుంగభద్ర వరద కాల్వపై గతంలో కర్ణాటకలోని బళ్లారి జిల్లా రైతులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం వరద కాల్వ నిర్మాణాలపై బళ్లారి జిల్లా రైతులు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు. ఆరు నెలల క్రితం తుంగభద్ర డ్యాం సలహా సమితి అధ్వర్యంలో బళ్లారి జిల్లా రైతులు సమావేశం నిర్వహించుకుని వరద కాల్వపై ప్రధానంగా చర్చించారు.
ఇందుకు రైతుల నుంచి సానుకూలత వ్యక్తం అయినప్పటికీ పాలకుల్లో కదిలిక లేదు. తుంగభద్ర డ్యాం ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో బోర్డు అనుమతితో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని వరద కాల్వలపై సమీక్ష నిర్వహిస్తే కాల్వ నిర్మాణ ం ఫైలు కదులుతుందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు.
10 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు డ్యాంను సందర్శించినప్పుడు వరద కాల్వ ఏర్పాటు చేస్తే ఏ మేరకు మేలు జరుగుతుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. తీవ్ర కరువు కాటకాలతో అలమటిస్తున్న అనంతపురం జిల్లాకు శాశ్వత కరువు నివారణ జరగాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వరద కాల్వ ఒక్కటే శరణ్యమని నిపుణులు పేర్కొంటున్నారు.
తుంగభద్ర డ్యాం పూర్తి నిండినప్పుడు నెల రోజుల పాటు నది ద్వారా లక్షలాది క్యూసెక్కుల నీరు బయటకు వెళతాయి. అయితే వరద కాల్వ నిర్మిస్తే డ్యాం నుంచి నది ద్వారా బయటకు వెళ్లే నీటిని ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా కాలువకు మళ్లిస్తే రెండు జిల్లాలకు చాలా మేలు జరుగుతుంది. ఈ విషయంపై అనంతపురం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించి వరద కాల్వ నిర్మాణ ంపై చర్యలు తీసుకుంటే అనంతపురం దుర్భిక్ష పరిస్థితులు కాస్త ఉపశమనం పొందేందుకు వీలవుతుందని చెప్పవచ్చు.
ఇటీవల తుంగభద్ర డ్యాంను సందర్శించి కాల్వ శ్రీనివాసులు వరద కాల్వ నిర్మాణ ంపై దృష్టి సారిస్తానని మాట ఇవ్వడంతో ఆయన ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తేనే వరద కాాల్వ నిర్మాణానికి సాధ్యం అవుతుందని రైతులు ఆశిస్తున్నారు.